న్యూఢిల్లీ : భారత 14 వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు నగరా మోగింది. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది. జులై 5న ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనున్నదని కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. జులై 19 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు విధించారు. 20న నామినేషన్లు పరిశీలించనున్నారు. జులై 22 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు కొనసాగుతోన్న విషయం విదితమే. వెంకయ్యనాయుడు 2017 ఆగస్టు 11న పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీకాలం ఆగస్టు 10తో ముగుస్తుంది.
ఎన్నుకునే విధానం
ఉపరాష్ట్రపతిని పార్లమెంట్ ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. 233 మంది రాజ్యసభ సభ్యులతోపాటు 12 మంది నామినేటెట్ సభ్యులు, 543 మంది లోక్‌సభ ఎంపీలతో కలుపుకొని మొత్తం 788 మంది ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుని ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఇదిలా ఉండగా, తదుపరి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అధికార, విపక్ష పార్టీలు ఎవరిని బరిలో దించుతాయనే దానిపై ఊహాగానాలు అప్పుడే మొదలయ్యాయి. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఓబీసీ , జనరల్ కేటగిరికి చెందిన మహిళను బరి లోకి దించుతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు దక్షిణాది నుంచి కూడా అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు ఉపరాష్ట్రపతి పదవిని మహిళలు చేపట్టక పోవడం గమనార్హం. తాజాగా రాష్ట్రపతి అభ్యర్థిగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ద్రౌపది ముర్మును ఎంపిక చేసిన ఎన్డీయే , ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఎవరిని అభ్యర్థిగా బరిలోకి దించుతుందో చూడాలి.