Thursday, January 23, 2025

ఉపరాష్ట్రపతి ఉద్బోధ!

- Advertisement -
- Advertisement -

శాసన నిర్మాణ, కార్యనిర్వాహక, న్యాయ అనే మూడు వ్యవస్థల మధ్య అనుల్లంఘనీయమైన సమానత్వం వుండాలని, ఇవి ఒకదాని అధికార పరిధిలోకి మరొకటి చొచ్చుకొని వెళ్ళరాదని ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ ఉద్బోధించడం ప్రాథమిక స్థాయి బడి పాఠాన్ని తలపించింది. అందరికీ తెలిసిన విషయాన్ని మరోసారి రుబ్బి అట్టువేసే పనిని ఆయన చిత్తగించారు. న్యాయ నియామకాలపై కొలీజియం అధికారాలను ప్రశ్నించే పనిలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు నిర్వహిస్తూ వచ్చిన పాత్రను ఆయనకు మించిన ఉత్సాహంతో ఇప్పుడు ధన్‌ఖడ్ పోషిస్తున్నారు. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జెఎసి) ను రద్దు చేస్తూ 2015లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఆయన ఇంతకు ముందు కూడా దుయ్యబట్టారు.

పార్లమెంటు ఏకాభిప్రాయంతో 99వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేసిన ఎన్‌జెఎసిని రద్దు చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఎక్కడిది అని ప్రశ్నించారు. దానికి పొడిగింపుగా ఇప్పుడు పై మూడు వ్యవస్థలు తమ తమ పరిధులను దాటకుండా వుండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఇటీవల జైపూర్‌లో జరిగిన 83వ అఖిల భారత చట్టసభల అధ్యక్షుల సదస్సులో ప్రారంభోపన్యాసం చేస్తూ ధన్‌ఖడ్ ఈ విధంగా ప్రబోధించారు. దేశాన్ని నడిపిస్తున్న పై మూడు వ్యవస్థల ప్రాధాన్యాన్ని గాని, వాటి మధ్య సమతౌల్యం అవసరాన్ని గాని ఎవరూ కాదనరు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థది పైచేయిగా వుండక తప్పని పరిస్థితిని రాజ్యాంగమే కల్పించిందన్న సంగతిని మరచిపోకూడదు. రాజ్యాంగాన్ని కాచి వడపోసి దాని లోతులు తెలిసిన ఉన్నత న్యాయమూర్తులతో కూడుకొన్న న్యాయ వ్యవస్థ, ప్రజలెన్నుకునే సభ్యులతో కూడిన పార్లమెంటు ఒకదానికొకటి తీసిపోనివే. ప్రజాస్వామ్యంలో ప్రజలెన్నుకునే చట్ట సభలకు విశేష ప్రాధాన్యమున్న మాట కూడా వాస్తవమే.

అయితే దేశ పాలనకు సంబంధించిన కీలక అంశాలపై మీమాంస తలెత్తే అరుదైన సందర్భాల్లో సుప్రీంకోర్టుది పైచేయికాక తప్పదు. అలా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు చట్టసభలు కూడా తలవంచిన సందర్భాలు లేకపోలేదు. స్పీకర్ల, గవర్నర్ల నిర్ణయాలను, రాజ్యాంగ వివేచన అనే గీటురాయి మీద పెట్టి సుప్రీంకోర్టు కొట్టివేసిన ఉదంతాలు చాలా వున్నాయి. పార్లమెంటు చేసే చట్టాలు వివాదాస్పదమైనప్పుడు వాటి మంచి చెడ్డలను లోతుగా పరిశీలించి వాటిని సుప్రీంకోర్టు కొట్టివేసిన ఉదాహరణలూ వున్నాయి. రాజ్యాంగాన్ని ఉల్లంఘించే రీతిలో చట్టసభలు చేసే చట్టాలను గాని, ప్రభుత్వాలు తీసుకొనే చర్యలను గాని రద్దు చేసే అధికారం సుప్రీంకోర్టుకు వుంది. ఉపరాష్ట్రపతి పదవిలోని జగ్దీప్ ధన్‌ఖడ్‌కు ఈ సూక్ష్మం తెలియకపోడం ఆశ్చర్యకరం. మూడు వ్యవస్థలనూ అదుపు చేసే పర్యవేక్షక వ్యవస్థ రాజ్యాంగం.

న్యాయమూర్తుల నియామకం విషయంలో న్యాయ వ్యవస్థదే పైచేయి అనేది రాజ్యాంగ మౌలిక నిర్మాణంలోనే వున్నదని 2015లో ఎన్‌జెఎసిని రద్దు చేసి కొలీజియం పునరుద్ధరణకు అవకాశమిస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చెప్పిన తీర్పులోనే వుంది. మన దేశంలో పౌర సమాజం ఇంకా పూర్తి పరిణతిని పొందలేదని అందుచేత జడ్జీల నియామక విషయాలను రాజకీయ కార్యనిర్వాహక వ్యవస్థలతో పంచుకోలేమని ఆ తీర్పు స్పష్టం చేసింది. కొలీజియం వ్యవస్థను యథాతథంగా పునరుద్ధరించాలని చెబుతూ అందులోనూ లోపాలున్నాయని చెప్పింది. వాటిని తొలగించుకొని ఆ వ్యవస్థను మరింత మెరుగుపరచుకోడం తప్ప వేరే దారి లేదు. ఏడేళ్ళ క్రితం ఆ తీర్పు వచ్చినప్పడు ఇప్పటి ఎన్‌డిఎ కూటమే కేంద్రంలో అధికారంలో వుంది. ఇంత కాలమూ కొలీజియం వ్యవస్థను అరకొరగానైనా గౌరవిస్తూ వచ్చిన ప్రధాని మోడీ ప్రభుత్వం వున్నట్టుండి దానిని రద్దు చేయించి జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ను తిరిగి తీసుకు రావాలని కోరుకోడాన్ని అనుమానించి తీరాలి.

అందుకోసం మరో రాజ్యాంగ సవరణను పార్లమెంటు చేత ఆమోదింప జేసుకొనే కుయుక్తి సాగుతూ వుండవచ్చు. అయితే దానిని కూడా కొట్టివేయడానికి సుప్రీంకోర్టు వెనుకాడకపోవచ్చు. న్యాయ వ్యవస్థను తమకు ఇష్టులైన వారితో నింపివేయడమే మోడీ ప్రభుత్వ ఆంతర్యమని అనుకోక తప్పదు. అమెరికాలో ట్రంప్ అధికారంలో వున్నప్పుడు పచ్చి మితవాదులను ఉన్నత న్యాయమూర్తులుగా నియమించిన ఫలితంగానే అబార్షన్ హక్కు రద్దు అక్కడి స్త్రీల మెడకు చుట్టుకొన్నది. గొప్ప ప్రజాస్వామిక దేశమని చెప్పుకొనే అమెరికాలో అప్రజాస్వామిక న్యాయం ఆ రకంగా ఊడిపడింది. అందుచేత రాజ్యాంగ ధర్మాన్ని గ్రహించిన వారితో కూడిన న్యాయ వ్యవస్థకే అంతిమ నిర్ణయాధికారం వుండడం కొన్ని సందర్భాల్లో అవసరం. రాజ్యాంగం గీటురాయిని నిజాయితీతో, చిత్తశుద్ధితో వినియోగించే న్యాయమూర్తుల వల్లనే దేశానికి మేలు జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News