మనతెలంగాణ/వరంగల్‌క్రైం: కొబ్బరి బోండాల మాటున గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న గ్రామ ఉపసర్పంచ్‌తో సహా నలుగురు ముఠా సభ్యులను టాస్క్‌ఫోర్స్, ఆత్మకూరు పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్ట్ చేశారు. వీరి నుండి రూ.34 లక్షల విలువగల 170 కిలోల గంజాయి, ఒక కారు, గంజాయి రవాణకు వినియోగించిన ఒక బొలెరో సరుకు రవాణ వాహనం, మూడు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈఅరెస్ట్‌కు సంబంధించి ఈస్ట్‌జోన్ డిసిపి కరుణాకర్ వివరాలు వెల్లడించారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో రాయినేని శంకర్ రేగొండ మండలం భూపాలపల్లి, ముసిక లక్ష్మన్ నీరుకుళ్ల గ్రామ ఉపసర్పంచ్, ఆత్మకూరు మండలం వరంగల్ జిల్లా, మాట్ర మహేష్ బండారుపల్లి గ్రామం ములుగు జిల్లా, గండికోట సతీష్ పస్రా ములుగు చెందిన వారని తెలిపారు. నిందితుల్లో రాయినేని శంకర్, నీరుకుళ్ల గ్రామ ఉపసర్పంచ్ ముసిక లక్ష్మన్‌లు సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారు.
ఆంధ్ర రాష్ట్రంలో గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయించడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా నిందితులు మిగతా ఇద్దరు నిందితులతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని నర్సీపట్నంలోని నూక రాజు(ప్రస్తుతం పరారీలో ఉన్నాడు) ద్వారా 170 కిలోల గంజాయిని కొనుగోలు చేసి దానిని రెండు కిలోల ప్యాకెట్ల చొప్పున బొలెరొ వాహనంలో ఎవరికి అనుమానం రాకుండా కొబ్బరిబోండాల మధ్యలో రహస్యంగా భద్రపరిచి వరంగల్‌కు తరలించారు. ఈగంజాయిని తరలించే క్రమంలో ప్రధాన నిందితులు శంకర్, గ్రామ ఉపసర్పంచ్ లక్ష్మన్‌లు మరోకారులో గంజాయికి తరలిస్తున్న కారుకు ఎస్కార్ట్‌గా వ్యవహరించేవారు.
పోలీసులకు అందిన సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్, ఆత్మకూరు పోలీసులు ఆత్మకూరు గ్రామ శివారు ప్రాంతలో మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో అనుమానస్పదంగా వస్తున్న నిందితుల వాహనాలను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా బొలెరో వాహనంలో కొబ్బరిబోండాల మధ్యలో గంజాయి ప్యాకెట్లను గుర్తించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పరకాల ఎసిపి శివరామయ్య, టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌పెక్టర్లు కె.శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, ఆత్మకూరు ఇన్స్‌పెక్టర్ బి.కుమార్, టాస్క్‌ఫోర్స్ ఎస్సైలు లవన్‌కుమార్, నిసార్‌పాషా, హెడ్‌కానిస్టేబుళ్లు, సిబ్బందిని ఈస్ట్‌జోన్ డిసిపి అభినందించారు.