మాస్కో: రష్యా విమాన ప్రమాదంలో మరణించినవారి మృతదేహాల ఆచూకీ లభించిందని స్థానిక అధికారులు తెలిపారు. 22మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో వెళ్తున్న ఆంటోనోవ్ ఎఎన్26 విమానం మంగళవారం కూలిపోయిన విషయం తెలిసిందే. రష్యాలోని మారుమూల ప్రాంతం కామ్‌చట్కాలోని పలానా పట్టణ సమీపంలోని విమానాశ్రయంలో దిగాల్సి ఉన్న విమానం ప్రతికూల వాతావరణం వల్ల ప్రమాదానికి గురైంది. మంగళవారం సాయంత్రం రన్‌వేకు 5 కిలోమీటర్ల దూరంలోని సముద్ర తీరంలో విమాన శకలాలను గుర్తించారు. బుధవారం ఉదయం తిరిగి రెస్కూ ఆపరేషన్‌ను ప్రారంభించినట్టు కామ్‌చట్కా గవర్నర్ వ్లాదిమిర్ సోలోడోవ్ తెలిపారు. నీళ్లలోంచి కొన్ని మృతదేహాలను బయటకు తీసినట్టు ఆయన వెల్లడించారు. అయితే, ఎన్ని అనేది స్పష్టం చేయలేదు. ఈ ప్రమాదంలో ఏ ఒక్కరూ బతికే అవకాశంలేదని ఇప్పటికే స్థానిక అధికారులు తెలిపారు.
Victims bodies found in Russia plane crash