న్యూఢిల్లీ: లఖీంపుర్ ఖేర్ హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడు, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్ పై ఫిబ్రవరి 15న విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఆశిష్ మిశ్రా బెయిల్‌ను సవాల్ చేస్తూ రైతు కుటుంబాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. రైతులను జీపుతో తొక్కించినట్టు బలమైన సాక్షాలు ఉన్నప్పటికీ నిందితుడు బెయిల్‌పై విడుదల కావడాన్ని రైతుల కుటుంబాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ద్వారా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశాయి. హేయమైన నేర స్వభావాన్ని పరిగణ లోనికి తీసుకోకుండా హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని పిటిషన్‌లో రైతు కుటుంబాలు పేర్కొన్నాయి. ఛార్జిషీట్‌లో నిందితుడికి వ్యతిరేకంగా బలమైన సాక్షాలు ఉన్నాయని, సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలు కూడా బలంగా ఉన్నాయని వివరించాయి. నిందితుడు మరోసారి ఇలాంటి నేరాలకు పాల్పడే అవకాశం ఉందని ఆరోపించాయి. అలాగే ఈ కేసులో సాక్షాల్ని తారుమారు చేసే అవకాశం ఉందని ఆరోపించాయి.
దీనివల్ల న్యాయమైన విచారణకు ఆటంకం ఏర్పడుతుందని పేర్కొన్నాయి. జనవరి 18న బెయిల్ విచారణ నిమిత్తం తమ తరఫు న్యాయవాదికి అనుమతి లభించక పోవడం వల్ల సమర్థవంతమైన వాదనలు వినిపించలేకపోయామని, ఈ విషయమై కోర్టును పలుమార్లు ఆశ్రయించినప్పటికీ అవకాశం లభించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. బెయిల్ మంజూరు చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయడంలో విఫలమైనందున తాము సుప్రీం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. ఆశిష్ మిశ్రా బెయిల్‌పై దాఖలైన రెండో పిటిషన్ ఇది. ఆయన విడుదలైన రెండు రోజుల తరువాత అత్యున్నత న్యాయస్థానంలో ఒక పిటిషన్ దాఖలైంది. అందులో పిటిషనర్లు సాక్షాలను తారుమారు చేయడం, సాక్షులను బెదిరించే అవకాశం ఉన్నాయనే అభ్యంతరాలను లేవనెత్తారు.
Victims Farmers challenge bail of Ashish Mishra in SC