- కలెక్టర్ అమోయ్ కుమార్
మేడ్చల్ జిల్లా: అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో నియోజకవర్గాల వారీగా నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల వివరాలను సంబంధిత అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వరం న్యాయం జరిగేలా పోలీసులతోపాటు సంబంధిత శాఖల అధికారులు చొరవ తీసుకోవాలని ఆదేశించారు. కేసులలో ఎప్పటి కప్పుడు ఛార్జిషీట్ దాఖలు చేయడంతో పాటు నిర్ణీత సమయంలోగా కేసులను పూర్తిచేయాలని అన్నారు. బాధితులకు ప్రభుత్వం తరపున ఆర్ధిక సహాయం సకాలంలో అందేలా చూడాలని అన్నారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో పారదర్శకంగా దర్యాప్తు చేపట్టి పూర్తి ఆధారాలతో సకాలంలో ఛార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. ప్రత్యేకంగా గ్రామాలలో కుల బహిష్కరణలు, సామాజిక బహిష్కరణలు విధించడంతోపాటు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు పెండింగ్ ట్రయల్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని, అట్రాసిటీ కేసుల్లో నిందితులు తప్పించుకోకుండా పూర్తి ఆధారాలు సేకరించి న్యాయస్థానంలో సమర్పించాలని సూచించారు.
విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని క్రమం తప్పకుండా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ అమోయ్ కుమార్ ఆదేశించారు. ఈ సమావేశంలో డీసీపీ జానకి, జిల్లా రెవెన్యూ అధికారి చంద్రావతి, జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి వినోద్, బాలాజీ, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు రాజు వస్తాద్, ధన్‌రాజ్ నాయక్, సఫాయి కర్మచారి సభ్యులు వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు.