కేంద్ర సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడానికి బిజెపి యాత్రలు
నాలుగు చోట్ల యాత్రలను ప్రారంభించిన అగ్రనేతలు
మేడారం జాతర నేపథ్యంలో భద్రకాళి కాకతీయ యాత్ర 25కు వాయిదా
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో బిజెపి చేపట్టిన విజయ సంకల్ప యాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. మంగళవారం ఒకే రోజు నాలుగు ప్రాంతాల్లో యాత్రలు చేపట్టారు. సమక్క జాతర సందర్భంగా భద్రకాళి కాకతీయ యాత్రను ఈనెల 25వ తే దీకి వాయిదా వేశారు. విజయ సంకల్ప యాత్రలను ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇద్దరు కేంద్ర మంత్రులు హాజరై స్థానిక నాయకులతో జెండా ఊపి ప్రారంభించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కమలనాథులు 10 ఏళ్లు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి మరోసారి అధికారం అప్పగించాలని ఓటర్లను కోరనున్నారు. అందులో భాగంగా సోమవారం విజయ సంకల్ప యాత్రలకు శ్రీకారం చుట్టింది. ఈయాత్రలు రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలు, 114 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 5,500 కిలోమీటర్లు నిర్వహించనున్నారు. 106 సమావేశాలు, 102 రోడ్ షోలు ఇతర కార్యక్రమాలు ఉంటాయని ఆపార్టీ నేతలు వివరించారు. మార్చి 2వ తేదీన ముగిస్తుంది.
నారాయణ పేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ గ్రామం వద్ద కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి యాత్ర ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి ఏ రాజకీయ పార్టీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగానే 17 పార్లమెంట్ స్థానాల్లో తమ అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేసేందుకు ఒకేసారి ఐదు యాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అగ్రనేతలు అన్ని నియోజకవర్గాల్లో పర్యటించేందుకు వీలుగా ఒకేసారి ఐదు ప్రాంతాల్లో యాత్రలు చేపట్టామన్నారు. బిజెపికి తెలంగాణలో పూర్తి మద్దతు ఉందని, తాము ఒంటరిగానే గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్‌తో బిజెపి పొత్తు అంటే ఎవరైనా దాన్ని తిప్పికొట్టాలనుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆపార్టీతో ఎట్టి పరిస్ధితిలో జత కట్టమని ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లుతామని తేల్చిచెప్పారు. అన్ని స్ధానాల్లో పోటీ చేసి మెజారిటీ స్థానాల్లో గెలుపొందడమే లక్షంగా పనిచేస్తామని, మునిగిపోతున్న బిఆర్‌ఎస్‌తో స్నేహం ఉండదని స్పష్టం చేశారు.
గతంలో ఎప్పుడు తమ పార్టీ బిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోలేదని గుర్తు చేశారు. కొందరు నాయకులు కుట్రపూరితంగా బిఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేస్తారని ప్రచారం చేస్తున్నారని, బుద్ధి లేని వ్యక్తులు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరారు. రాష్ట్ర ప్రజలు బిజెపి శ్రేణులను ఆశీర్వదించాలని, బహిరంగ సభలు ఉండవని, రోడ్ షోలతో ప్రజల్లోకి వెళ్తామన్నారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు తొలి సమావేశంలోనే తెలంగాణ ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఈ యాత్రలు పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు యాత్రలు సమాంతరంగా ప్రారంభమవుతాయని, మేడారం జాతరతో వరంగల్ యాత్ర కొన్ని రోజులు ఆలస్యంగా ప్రారంభమవుతుందన్నారు. యాత్రలో భాగంగా రైతులు, చేతివృత్తిదారులు, నిరుద్యోగులు, పొదుపు సంఘాల మహిళలు, అన్ని వర్గాల ప్రజలను కలుస్తారని వెల్లడించారు.
కొమురం భీం విజయ సంకల్ప యాత్ర
దేశంలో ఒకే గ్యారెంటి నడుస్తుందని, అది మోడీ గ్యారెంటీ మాత్రమేనని అసోం సిఎం హిమంత్ బిస్వశర్మ స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లా బైంసాలో జరిగిన సభలో తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన మోడీకి తెలుగు భాషపై అమితమైన ప్రేమ ఉందన్నారు.