ప్రయాగ్‌రాజ్ : కుంభమేళాలో ఇప్పటివరకు 55 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. ఈ క్రమంలో కుంభమేళాలో స్నానం చేస్తున్న మహిళా భక్తుల వీడియోలు విక్రయిస్తున్న రెండు సామాజిక ఖాతాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈమేరకు యూపీ పోలీస్ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మహిళల గోప్యత, గౌరవానికి భంగం కలిగించే ఇలాంటి వీడియోలను కొన్ని ప్లాట్‌ఫామ్‌ల్లో అప్‌లోడ్ చేసుకున్నాయి. సోషల్ మీడియా మోనిటరింగ్ టీమ్ దీన్ని గుర్తించింది. దీనిపై కోత్వాల్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలో ఆ వీడియోలు అప్‌లోడ్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను గుర్తించేందుకు మెటా నుంచి వివరాలు కోరినట్టు పోలీసులు వెల్లడించారు. మరోవైపు టెలిగ్రామ్ ఛానళ్లతో ఈ వీడియోలు విక్రయిస్తున్నట్టు మరో కేసు నమోదైంది. వీటిపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. మహాకుంభమేళాకు సంబంధించి అభ్యంతరకరమైన , తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే సామాజిక మాధ్యమాలపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.