Tuesday, September 24, 2024

చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరమే: సుప్రీం కోర్టు కీలక తీర్పు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు తీర్పును వెలువరించింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం, ఆ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవడం పోక్సో చట్టం కింద నేరమేనని వెల్లడించింది. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం తోసిపుచ్చింది. ఇలాంటి తీర్పునిచ్చి మద్రాస్ హైకోర్టు ఘోరమైన తప్పిదం చేసిందని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వం లోని ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి అనేక సూచనలు చేసింది.

పోక్సోచట్టం లోని చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదానికి బదులు “చైల్డ్ సెక్సువల్లీ అబ్యూసివ్ అండ్ ఎక్స్‌ప్లాయిటేటివ్ ”అన్న పదం వినియోగించేలా చట్టంలో సవరించాల్సిన అంశంపై పార్లమెంట్ తీవ్రంగా పరిగణించాల్సి ఉందని సూచించింది. ధర్మాసనం ఈమేరకు సోమవారం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఆ సవరణలు అమలు లోకి వచ్చేవరకు ఆర్డినెన్స్ జారీ చేసుకోవచ్చని, ఇకపై కోర్టులు ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ పదాన్ని .జ్యుడీషియల్ ఉత్తర్వుల్లో కానీ తీర్పుల్లో కానీ ఉపయోగించ రాదని ధర్మాసనం ఆదేశించింది. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ ( పోక్సో) చట్టం 2012, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) చట్టం ప్రకారం చైల్డ్ పోర్నోగ్రఫీ ఫుటేజీని పబ్లిష్ చేయడం కానీ, షేర్ చేయడం కానీ, కలిగి ఉండడం, చూడడం నేరమే అవుతుంది. పిల్లలను పోర్నోగ్రఫీ అవసరాల కోసం వినియోగించడం కూడా నేరమే అవుతుంది. ఈ నేరానికి 5 ఏళ్ల జైలుశిక్ష, జరిమానా పడుతుంది.

ఒకసారి తప్పుచేసి శిక్ష అనుభవించిన వారు మళ్లీ ఇదే తప్పు చేస్తే 7 ఏళ్ల జైలు, జరిమానా విధిస్తారు. చైల్డ్ పోర్నోగ్రఫీని డౌన్‌లోడ్ చేసుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడిపై క్రిమినల్ చర్యలను నిలిపివేస్తూ జనవరి 11న మద్రాస్ హైకోర్టు ఆదేశాలిచ్చింది. పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం చైల్డ్ పోర్నోగ్రఫీని చూడటం తప్పేమీ కాదంటూ ఆ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న 28 ఏళ్ల యువకుడు హరీష్ వీడియోలు చూడటం తప్ప ఏమీ చేయలేదని, వాటిని ఇంతరులకు పంపలేదని పేర్కొంది. పోర్నోగ్రఫీకి అలవాటు పడిన యువతను శిక్షించడం కన్నా వారిని సరైన మార్గం వైపు నడిపిండంపై దృష్టి పెట్టాలని అభిప్రాయపడింది.

ఈ తీర్పుపై పలు ఎన్జీవోలు, చిన్నారుల సంక్షేమ సంఘాలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. వీటిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ధర్మాసనం , హైకోర్టు తీర్పును తోసిపుచ్చింది. ఆ యువకుడిపై క్రిమినల్ చర్యలను పునరుద్ధరించింది. ధర్మాసనం తన 200 పేజీల తీర్పులో అనేక సూచనలు చేసింది. సెక్సు ఎడ్యుకేషన్ కార్యక్రమాలను సమగ్రంగా అమలు చేయాలని, చట్టపరమైన, నైతిక పరమైన సమాచారం అందించాలని, దీనివల్ల నేరాలు చేయకుండా నివారించడానికి వీలవుతుందని వివరించింది. ఈ కార్యక్రమాల వల్ల సాధారణమైన తప్పుడు అభిప్రాయాలు తొలగిపోతాయని, యువకుల్లో స్పష్టంగా ఈ పోర్నోగ్రఫీని అర్ధం చేసుకునే అవకాశం కలుగుతుందని పేర్కొంది. ఈ విషయంలో విద్యార్థుల్లో ప్రాథమిక స్థాయి నుంచి అవగాహన కల్పించడానికి పాఠశాలలు కీలక పాత్ర వహించగలవని సూచించింది.

విద్యార్థుల్లో అరోగ్యకరమైన సంబంధాలు, అభిప్రాయాలతోపాటు సరైన ప్రవర్తనకు ఇవన్నీ దోహదం చేస్తాయని పేర్కొంది. ఈ సూచనలన్నిటినీ అర్థవంతంగా అమలు చేయడానికి నిపుణుల కమిటీని నియమించడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని ధర్మాసనం సూచించింది. బాధితులకు సహాయపడేలా పునరావాస కార్యక్రమాలు కల్పించాలని కూడా సూచించింది. బాధితులకు కలిగే హానిని వివరించే వైద్యచికిత్స విధాన ప్రక్రియలను నిర్వహించాలని, ప్రజలకు విరివిగా వీటిపై ప్రచారం సాగించాలని కోరింది. ఇలాంటి నేరాలకు పాల్పడే రిస్కు ఉన్న వారిని( ప్రోబ్లమేటిక్ సెక్సువల్ బిహేవియర్స్ పిఎస్‌బి) మొదట్లోనే గుర్తించేందుకు వివిధ విద్యావంతులను, ఆరోగ్యభద్రతా అధికారులను, న్యాయనిపుణులను, చిన్నారుల సంక్షేమ సర్వీస్‌లను భాగస్వాములతో శిక్షణ కార్యక్రమాలను నిర్వర్తించాలని ధర్మాసనం సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News