ప్రజలకు అందుబాటులో సి విజిల్ యాప్
ఫిర్యాదు చేసిన 100 నిమిషాల్లో ఫిర్యాదుకు పరిష్కారం
మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దిశా నిర్దేశం చేసే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండాక్ట్) అమల్లోకి వచ్చేసింది. ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో అక్రమాలకు, నిబంధనల ఉల్లంఘనలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటికి అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఇందులో పౌరులను సైతం భాగస్వాములను చేస్తోంది. సి విజిల్ యాప్ ద్వారా ఈ అవకాశం కల్పించింది. దాని గురించి తెలుసుకుని, నిబంధనలు ఉల్లంఘించే వారి పని పట్టాలి.
సి విజిల్ యాప్ అసలు.. ఏంటిది:
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన నాటి నుంచి ఈ ‘సి విజిల్’ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఎన్నికల ఉల్లంఘనలపై సాక్ష్యాలతో సహా అందులో పొందుపరచవచ్చు. ఫొటో,వీడియో, ఆడియో రూపంలో రికార్డ్ చేసి యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ఫిర్యాదు చేసిన 5 నిమిషాల్లో ఎన్నికల అధికారులు రంగంలోకి దిగుతారు. దీనిపై విచారణ చేపట్టి 100 నిమిషాల్లో సదరు ఫిర్యాదుపై కచ్చితమైన చర్యలు తీసుకుంటారు. దీనిని పౌరులు ఎవరైనా వినియోగించవచ్చు. పార్టీలకు అతీతంగా ఎవరు అవినీతికి పాల్పడినా ఈ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చు.
రిజిస్టర్ చేసుకునే విధానం:
ముందుగా గూగుల్ ప్లే స్టోర్‌లో కేంద్ర ఎన్నికల సంఘం వారి సి విజిల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీ చరవాణి నంబరు ద్వారా దానిలో రిజిస్టర్ చేసుకోవాలి. ఓటీపీ వస్తుందని దానిని నమోదు చేస్తే సి విజిల్ యాప్ సిద్ధమైనట్లే. దాని ద్వారా మీరు ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదు చేయవచ్చు.
ఎలాంటివి ఫిర్యాదు చేయవచ్చంటే:
ఎన్నికల ప్రవర్తనా నియమావళికి భిన్నంగా ఉన్న దేనిపైనైనా ఫిర్యాదు చేయవచ్చు. డబ్బు పంపకాలు, ఉచితాలు, బహుమతుల అందజేత, రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం, మద్యం, మత్తు పదార్థాల పంపిణీ, ఓటర్లను ప్రభావితం చేయడం, ఎన్నికల రోజు ఓటర్లను వాహనాల్లో తరలించడం. ఇలాంటి ఉల్లంఘనలను ఫొటో లేదా వీడియో, ఆడియో రికార్డ్ చేసి అప్‌లోడ్ చేయాలి.
యాప్ తెరవగానే ఎలా చేయాలంటే :
మీ యాప్ తెరవగానే తెరపై ఫొటో, వీడియో ఆడియో అనే మూడు ఆప్షన్లు ఉంటాయి. మీరు ఫొటో ద్వారా ఫిర్యాదు చేయాలనుకుంటే ఫోటో ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. మీ లోకేషన్ నమోదవుతుంది. ఉల్లంఘనకు సంబంధించిన ఫొటోను అప్‌లోడ్ చేయాలి. ఏ రాష్ట్రం, ఏ నియోజకవర్గం తదితర వివరాలను నమోదు చేయాలి. సదరు ఉల్లంఘనను క్లుప్తంగా వివరించాలి. ఇది ఎన్నికల సంఘానికి చేరుతుంది.
ఐదు నిమిషాల్లో రంగంలోకి అధికారులు:
యాప్‌లో వివరాలు పొందుపరచగానే జిల్లా ఎన్నికల అధికారి 5 నిమిషాల్లో దానిని ఫీల్ యూనిట్‌కు పంపిస్తారు. వారు 15 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకుంటారు. విచారించి ఆర గంటలలో వివరాలు సేకరిస్తారు. అనంతరం ఎన్నికల అధికారికి నివేదిస్తారు. ఆయన దానిపై 50 నిమిషాల్లో చర్యలు తీసుకుంటారు. ఇలా 100 నిమిషాల్లో సి విజిల్ యాప్‌లో చేసిన ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటారు. ఫిర్యాదు చేసిన స్టేటస్ కూడా తెలుసుకునే వెసులుబాటు ఉంది.
అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి:
తాయిలాలు పంచి, అక్రమాలకు పాల్పడి అధికార పీఠం ఎక్కాలనుకునే అరాచక రాజకీయ పార్టీలకు ఈ యాప్ ద్వారా చరమ గీతం పాడవచ్చు. అదే రోజు యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ఎక్కడైనా ఎన్నికల ఉల్లంఘన కనిపిస్తే ఫిర్యాదు చేయాలి. అక్రమాలకు అడ్డుకట్ట వేసి రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం మీ వంతు బాధ్యతను నిర్వహించాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు.