విజయ్ దేవరకొండ, సమంత జంటగా డైరెక్టర్ శివ నిర్వాణ రూపొందించిన సినిమా ‘ఖుషి’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా నేషనల్ వైడ్ అభిమానులతో క్యూ అండ్ ఏ నిర్వహించారు స్టార్ హీరో విజయ్ దేవరకొండ. యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్‌లో ఈ క్యూ అండ్ ఏ లైవ్ స్ట్రీమ్ అయింది. ఫ్యాన్స్‌తో జరిపిన ఈ ఇంటరాక్షన్‌లో ఖుషి మూవీ హైలైట్స్‌తో పాటు వ్యక్తిగత జీవితం గురించి వివరంగా మాట్లాడారు విజయ్. ఈ లైవ్ ఇంటర్వ్యూలో హీరోయిన్ సమంత, డైరెక్టర్ శివ నిర్వాణ, ప్రొడ్యూసర్ రవిశంకర్, సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహాబ్… ఖుషి మూవీ జర్నీ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ చెప్పిన విశేషాలు…
ఎవరి పని వాళ్లు కరెక్ట్‌గా…
ఖుషి సినిమాలో నటించడాన్ని ఎంజాయ్ చేశాం. ఈ సినిమాకు సమంత, శివ నిర్వాణ వంటి మం చి టీమ్ దొరికింది. వీళ్లంతా ఎవరి పని వాళ్లు కరెక్ట్‌గా చేస్తారు. అలా ఎవరి పని వాళ్లు కరెక్ట్‌గా చేస్తే సెట్‌లో ఇబ్బందే ఉండదు. ఈ సినిమా ఫస్టాఫ్‌లో నేను లవర్ బాయ్‌లా కనిపిస్తా. ఆ తర్వాత మ్యారీడ్ బాయ్‌గా కనిపిస్తా. నేను ఇప్పటిదాకా హజ్బెండ్ క్యారెక్టర్ చేయలేదు. ఫుల్ ఫన్ అండ్ డ్రామాతో సాగే సినిమా ఖుషి.
మంచి కామెడీ వర్కవుట్ అయింది…
దర్శకుడు శివకు సినిమా పిచ్చి. తన సినిమా ఎలా ఉండాలో ఖచ్చితంగా ఆయనకు తెలుసు. ఆ ఫ్రేమ్ నుంచి బయటకు రాడు. మనం ఏదైనా బాగుంటుందని చెబితే నచ్చితే తీసుకుంటాడు. అది కథకు అవసరం ఉండదు అనుకుంటే ఎందుకు ఉండదో చెబుతాడు. ఈ సినిమాలో ఎమోషన్, రొమాన్స్, యాక్షన్ కంటే ఫన్‌ను ఎక్కువగా ఎం జాయ్ చేశాను. ఫస్టాఫ్‌లో వెన్నెల కిషోర్‌తో మంచి కామెడీ వర్కవుట్ అయింది. అలాగే సెకండాఫ్‌లో రాహుల్ రామకృష్ణతో కలిసి నవ్విస్తాను.
అలా మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించాం…
ఈ సినిమాలోని ఖుషి టైటిల్ సాంగ్ వినగానే బాగా నచ్చింది. ఆ పాట ముందు మోషన్ పోస్టర్‌కు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అనుకున్నాం. పాట ఎంతో బాగుండడంతో సామ్, శివ, నేను కలిసి హేషమ్ తో మాట్లాడి దాన్ని ఫుల్ సాంగ్ చేశాం. ఖుషి పాటలను విన్నప్పుడు ఈ మ్యూజిక్ ను సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నాం. అలా మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించాం. ఆ మ్యూజిక్ కన్సర్ట్ టైమ్‌లో ఆరోగ్యం బాగా లేకున్నా సమంత పాల్గొంది. ఆ స్టేజీ మీద సమంతతో లైవ్ పర్‌ఫార్మ్ చేశాను.
మా ఇద్దరిలో చాలా పోలికలు ఉన్నాయి…
సమంత తెలివైన అమ్మాయి. శివ, నేను మూవీ గురించి చర్చించేటప్పుడు ఆమె మంచి ఐడియాస్ చెప్పేది. మా ఇద్దరిలో చాలా పోలికలు ఉన్నాయి. మేమిద్దరం మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం కాబట్టి డబ్బు, జీవితం గురించి ఒకేలా ఆలోచనలు ఉంటాయి. సమంతతో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంటుంది.
వాళ్ల ముఖాల్లో సంతోషం చూసేందుకు…
నాకు మంచి ఫ్యాన్స్ ఉన్నారు. లైగర్ మూవీ ఫ్లాప్ అయినప్పుడు ‘నెక్స్ మూవీ హిట్ కొట్టాలి అన్నా’ అనేవారు. వాళ్ల ముఖాల్లో సంతోషం చూసేందుకు ఖుషి మూవీతో హిట్ కొట్టబోతున్నాం.
నెక్స్ మూవీస్…
తమిళ్ డైరెక్టర్స్ అరుణ్ మాతేశ్వరన్, అరుణ్ ప్రభు ఇద్దరూ టాలెంటెడ్. వారితో స్క్రిప్ట్స్ వర్క్ జరుగుతున్నాయి. స్క్రిప్ట్స్ లాక్ అయితే వెంటనే మూవీస్ ప్రారంభిస్తా. సోషియో ఫాంటసీ మూవీ జోనర్స్‌లో మంచి స్క్రిప్ట్ వస్తే తప్పకుండా నటిస్తా. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో నా మూవీ తప్పకుండా ఉంటుంది. ఎప్పుడనేది మాత్రం చెప్పలేను.
అప్పుడే పెళ్లి చేసుకుంటా…
నన్ను మంచిగా చూసుకునే జీవిత భాగస్వామి కావాలని కోరుకుంటా. ఇప్పుడు మా అమ్మ నా గురించి జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ ఏడాది, వచ్చే ఏడాది అంటూ పెళ్లికి టైమ్, డేట్ ఫిక్స్ చేసుకోలేదు. పెళ్లి చేసుకోవాలని అనిపించినప్పుడు తప్పకుండా చేసుకుంటా. అయితే పెద్ద హడావుడి లేకుండా నా పెళ్లి జరగాలి. కానీ ఎవరికీ తెలియకుండా నేను ఆ విషయాన్ని దాచలేను.