చెన్నై: తమిళ సూపర్‌స్టార్ విజయ్ గత ఏడాది ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(గోట్)’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా తర్వాత ఆయన రాజకీయాల్లో పూర్తిగా బిజీ అయిపోయారు. అయితే విజయ్ నటిస్తున్న 69వ చిత్రం ‘జన నాయగన్’. ఇదే ఆయన చివరి సినిమా అని కోలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. హెచ్.వినోద్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. పొంగల్ కానుకగా వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్‌ని కూడా వదిలింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తుండగా.. బాబీ డియోల్, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఇదే విజయ్ నటిస్తున్న చివరి సినిమానా.. లేక ఆయన కొంతకాలం బ్రేక్ తీసుకొని మళ్లీ సినిమాల్లో నటిస్తారా.. అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.