బ్యాంకులకు రూ. వేల కోట్ల రుణాలను చెల్లించకుండా దేశం వదిలి పారిపోయిన విజయ్ మాల్యా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తాను తీసుకున్న రుణాలకు అనేక రెట్లు బ్యాంకులు తననుంచి వసూలు చేశాయని, అందుకు సంబంధించిన అకౌంట్ స్టేట్‌మెంట్లను అందించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తనతోపాటు ప్రస్తుతం లిక్విడేషన్‌లో ఉన్న యూబీహెచ్‌ఎల్ తదితర సంస్థల నుంచి వసూలు చేసిన మొత్తాల వివరాలను అందించాలని కోరారు. తాజాగా న్యాయస్థానం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా మాల్యా తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ సుమారు రూ. 6200 కోట్ల రుణాన్ని తీసుకోగా, దీనికి సంబంధించి రూ. 14 వేల కోట్లను రికవరీ చేసినట్టు తెలిపారు. “ ఈ విషయం గురించి లోక్‌సభలో ఆర్థిక మంత్రి తెలియజేశారు.
మాల్యాకు చెందిన రూ. 14,131 కోట్ల విలువైన ఆస్తులను బ్యాంకులు రికవరీ చేశాయని తెలిపారు. ఆయన తీసుకున్న రుణంలో దాదాపు రూ. 10,200 కోట్లు చెల్లించినట్టు రికవరీ అధికారి కూడా తెలిపారు. పూర్తి రుణం చెల్లించినప్పటికీ, ఇంకా రికవరీ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. మాల్యాకు సంబంధించిన రికవరీ చర్యలపై స్టే విధించాలని కోర్టును కోరుతున్నాను. దీనికి సంబంధించి అన్ని బ్యాంకుల నుంచి అకౌంట్ స్టేట్‌మెంట్లను అందించాలి ” అని న్యాయవాది అభ్యర్థించారు. వాదనలు విన్న న్యాయస్థానం , ఈ అంశంపై స్పందించాలంటూ ఎస్‌బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు సహా 10 బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 13 లోగా స్పందన తెలియజేయాలంటూ గడువు విధించింది. ఇదిలా ఉండగా, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణాల విషయంలో మోసం చేసినట్టు విజయ్ మాల్యా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దేశం విడిచివెళ్లి పోయిన ఆయన మార్చి 2016 నుంచీ బ్రిటన్ లో నివసిస్తున్నారు. మాల్యాను భారత్‌కు రప్పించడానికి కేంద్రం ప్రయత్నిస్తున్న విషయం విదితమే. ఈ క్రమం లోనే ఆయన హైకోర్టును ఆశ్రయించగా, బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చింది.