తమిళగ వెట్రి కజగం(టివికె) పార్టీ వ్యవస్థాపకుడు, నటుడు విజయ్ శుక్రవారం తమిళనాడులో 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు ప్రధానంగా డిఎంకె, టివికెల మధ్యేనని శుక్రవారం అన్నారు. టివికె తొలి సాధారణ మండలి సమావేశం చెన్నైలో జరిగింది. ఈ సందర్భంగా విజయ్ వక్ఫ్ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలని కోరారు. ఆ బిల్లు ముస్లింల హక్కును లాగేసుకోగలదని అన్నారు. అంతేకాక డీలిమిటేషన్ ప్రక్రియను ఎన్‌డిఎ ప్రభుత్వం మానేయాలని కూడా సూచించారు. తమిళనాడులో బిజెపి తప్ప అన్ని ఇతర పార్టీలు వీటిని వ్యతిరేకిస్తున్నాయని కూడా ఆయన తెలియజేశారు. విజయ్ తన ప్రసంగంలో డిఎంకె పార్టీ వంశ పాలన రాజకీయాలను, మహిళల, పిల్లల భద్రత, శాంతి భద్రతల అంశాన్ని, అలాగే కేంద్ర ప్రభుత్వ డీలిమిటేషన్, త్రిభాషా సూత్ర ప్రక్రియను తూర్పారబట్టారు.
స్టాలిన్ తరచూ కేంద్ర విధానాలు ఫాసిస్టు విధానాలని అంటున్నారని, అయితే స్టాలిన్ విధానాలు ఫాసిస్టు విధానాలకు తక్కువేమి కావని విమర్శించారు. ‘పార్టీ కార్యకర్తలను, ప్రజలను కలువకుండా తనని ఆపడానికి మీరెవరు?’ అని ఆయన ముఖ్యమంత్రి స్టాలిన్‌ను నిలదీశారు. తాను తలచుకుంటే అన్ని ఆంక్షలను ఉల్లంఘించయినా వారిని కలుసుకుంటానని హెచ్చరించారు. కార్మిక వర్గానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని, తన పార్టీ వనరులు, వ్యవసాయంపై దుష్ప్రభావం చూపే ప్రాజెక్టులను వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ మీద ధ్వజమెత్తుతూ తమిళనాడు నుంచి జిఎస్టీనైతే సేకరిస్తున్నారు, కానీ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావలసిన నిధులను ఇవ్వడం లేదని, విద్యకు సంబంధించిన నిధులను కూడా విడుదలచేయడంలేదని దుయ్యబట్టారు. ఇప్పుడున్న లోక్‌సభ 543 నియోజకవర్గాలనే కొనసాగించాలన్నది తమ టివికె పార్టీ వైఖరని స్పష్టం చేశారు.