ప్రభుత్వం నుండి మూడు నెలలుగా తమకు రావాల్సిన పాల బిల్లులు రావడం లేదని, దీంతో పాడి పోషణకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని నిజామాబాద్ జిల్లా, కోటగిరి మండల కేంద్రానికి చెందిన విజయ డైరీ పాడి రైతులు బుధవారం రోడ్డెక్కారు. పోతంగల్=రుద్రూర్ ప్రధాన రహదారిపై సుమారు గంటపాటు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఉదయం పూట రాస్తారోకో చేయడంతో స్కూల్ బస్సులకు, ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్థానిక ఎస్‌ఐ సందీప్ ఘటన స్థలానికి చేరుకొని సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరలో బిల్లులు చెల్లించేలా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో పాడి రైతులు శాంతించారు.
ఈ సందర్భంగా పలువురు పాడి రైతులు మాట్లాడుతూ.. పాడి మీదే జీవనం కొనసాగిస్తున్న తమకు మూడు నెలలుగా బిల్లులు చెల్లించకపోయే సరికి గేదెలకు దాణా కూడా తేలేని పరిస్థితి నెలకొందని వాపోయారు. గతంలో 15 రోజులలోపు బిల్లులు చెల్లించేవారని, కానీ ఇప్పుడు ఎందుకు జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే ప్రభుత్వం చెల్లించాలని పాడి రైతులు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో విజయ డైరీ అధ్యక్షుడు దమ్మల పాటి ఉదయ్, పాడి రైతులు శ్రీధర్, నెక్కంటి రమేష్, మామిడి సవేష్, యార్లగడ్డ సంతోష్, చిలకపాటి ప్రశాంత్, తేళ్ల శ్రీనివాస్, గైని ఆనంద్, సానిపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.