“విజయకృష్ణా సిల్వర్ క్రౌన్ అవార్డ్ తీసుకోవడం చాలా సంతోషంగా వుంది. కృష్ణ రియల్ సూపర్ స్టార్. విజయ నిర్మల ఆడపులి. వారి పేరు మీద ఈ అవార్డ్ ని తీసుకోవడం గర్వంగా ఫీలవుతున్నాను”అని అన్నారు బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. శ్రుతిలయ సీల్ వెల్ కార్పోరేషన్- కళాకారుల ఐక్యవేదిక సమక్షంలో ప్రముఖ నటీమణి, దర్శకురాలు విజయనిర్మల జయంతి సందర్భంగా ప్రముఖ రచయిత, దర్శకులు జంధ్యాల 75 సం.ల వజ్రోత్సవ సంచిక ఆవిష్కరణతో పాటు బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి విజయకృష్ణా సిల్వర్ క్రౌన్ అవార్డ్ 2025ని బహుకరించారు.
డాక్టర్ నరేష్ వికె సమక్షంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకకు రాష్ట్ర శానన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. హీరో మంచు విష్ణు, శివబాలాజీ, పవిత్ర లోకేష్, జంధ్యాల అన్నపూర్ణ, శ్రీలక్ష్మీ, ప్రదీప్, సాయినాథ్ తో పాటు అనేక మంది ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయకృష్ణా సిల్వర్ క్రౌన్ అవార్డ్ గ్రహీత డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ “కృష్ణ, విజయ నిర్మల పేరు మీద ఈ అవార్డ్ ని తీసుకోవడం గర్వంగా ఫీలవుతున్నాను. ఇలాంటి అవార్డ్ నాకు అందించిన నరేష్‌కు ధన్యవాదాలు.
ఈ రోజు నేను కామెడీ పండిస్తున్నానంటే ఆ క్రెడిట్ జంధ్యాలకి దక్కుతుంది. నవ్వు ద్వారా ప్రజలకు దగ్గరైనందుకు గర్వంగా ఫీలవుతున్నాను”అని అన్నారు. నరేష్ వికే మాట్లాడుతూ “అనిల్ రావిపూడికి విజయకృష్ణ సిల్వర్ క్రౌన్ 2025 అవార్డు అందజేయడం చాలా సంతోషంగా వుంది. సంక్రాంతికి వస్తున్నాం… మేము కలసి చేసిన మొదటి సినిమా కావడం నా అదృష్టం. అనిల్‌ని చూస్తే జంధ్యాల గుర్తుకు వస్తారు”అని తెలిపారు.