సింగపూర్‌కు చెందిన భారత సంతతికి చెందిన కళాకారిణి విజయలక్ష్మి మోహన్, సింగపూర్ సమాజానికి, యువతరానికి తమ సాంస్కృతిక వారసత్వం, నైపుణ్యాలు, సంప్రదాయాలను ప్రోత్సహించి, అందించినందుకు గాను ‘సాంస్కృతిక వారసత్వ అవార్డు’ను అందుకున్నారు. ఆమె సహా మొత్తం ఐదుగురికి ఈ అవార్డు దక్కింది. సింగపూర్ సంస్కృతి, సమాజం, యువ శాఖ మంత్రి ఎడ్విన్ టోంగ్ శుక్రవారం నేషనల్ గ్యాలరీ సింగపూర్‌లో అవార్డును ప్రదానం చేశారు. 66 ఏళ్ల విజయలక్ష్మి మోహన్ తిరుచ్చికి చెందిన 5000 ఏళ్ల నాటి ముగ్గు(రంగోలి)ను సుష్ఠు, రేఖాగణిత(సిమ్మెట్రికల్ అండ్ జామెట్రికల్) షేపులో వేసి మెప్పించి అవార్డును అందుకున్నారు.
తమిళనాడు తిరుచ్చిలో పుట్టిపెరిగిన ఆమె తన తల్లి నుంచి ప్రతి రోజు ఉదయం వాకిట్లో ముగ్గులు వేయడం నేర్చుకుంది. తమిళనాడులో తెల్ల సున్నపు పొడితో ముగ్గు(కోలం) వేస్తుంటామని ఆమె తెలిపారు. ఆ ముగ్గులు కూడా ఓ పద్ధతి ప్రకారం రేఖాగణితం రీతిలో వేస్తుంటామని ఆమె అన్నట్లు ‘ద స్ట్రెయిట్స్ టైమ్స్’ పేర్కొంది. విజయలక్ష్మి మోహన్ 1992లో సింగపూర్ వెళ్లారు. తర్వాత 2005లో అక్కడి పౌరసత్వం పొందారు. ఆమె ప్రతి రోజు ఉదయం 6.30 గంటలకు తన ఇంటి వాకిట బియ్యపు పొడితో ముగ్గులు(రంగోలి) వేస్తుంటారు. ఆమెకు అవార్డు కింద 5000 సింగపూర్ డాలర్ల బహుమానం, దాంతోపాటు 20000 సింగపూర్ డాలర్లు ప్రాజెక్ట్ గ్రాంట్‌గా పొందేందుకు అర్హత పొందారు.