Wednesday, January 22, 2025

విజయమ్మ రాజీనామా

- Advertisement -
- Advertisement -

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో ప్రకటన
సభలో భావోద్వేగానికి గురైన విజయమ్మ

మనతెలంగాణ/హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సతీమణి, ఎపి సిఎం వైఎస్ జగన్ తల్లి విజయమ్మ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి శుక్రవారం నాడు రాజీనామా చేశారు. ఈక్రమంలో శుక్రవారం నాడు గుంటూరులో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ ఇలాంటి రోజు వస్తుందని తాను అనుకోలేదని, వక్రీకరణలకు, విమర్శలకు తావు లేకుండా ఉండేందుకే రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. తెలంగాణలో షర్మిలకు అండగా ఉండేందుకే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. షర్మిలకు రాజకీయంగా అండగా ఉంటానని, అలాగే ఒక తల్లిగా జగన్‌కు ఎప్పుడూ మద్దతు ఉంటుందన్నారు. తన కుమారుడు, కుమార్తెలిద్దరూ వేర్వేరు రాష్ట్రాలకు వేర్వేరు పార్టీలకు ప్రతినిధులుగా ఉన్నారని, తాను రెండు రాష్ట్రాలలో కొనసాగడం సరికాదన్నారు. తెలంగాణలో వైఎస్ షర్మిల ఒంటరిగా పోరాటం చేస్తోందని, షర్మిలకు అండగా ఉండాల్సిన బాధ్యత తనపై ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నానని తెలిపారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు తన రాజీనామాపై క్షమించాలని, ఆంధ్రప్రదేశ్‌లో తన సోదరుడు జగన్‌కు ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే షర్మిల తెలంగాణలో వైఎస్‌ఆర్‌టిపి ఏర్పాటు చేసిందన్నారు. వైఎస్‌ఆర్ సంక్షేమ పాలన అందించడానికే షర్మిల పోరాటం చేస్తోందని, ఆమెకు అండగా ఉండేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నానని విజయలక్ష్మి స్పష్టం చేశారు. తెలుగురాష్ట్రాల ప్రజల హృదయాల్లో వైఎస్‌ఆర్ సజీవంగా ఉన్నారని, వైఎస్‌ఆర్ బిడ్డగా షర్మిల తండ్రి ఆశయాల మేరకు ప్రజాసేవ చేయాలనే నిర్ణయించుకుందన్నారు. ఎపి ప్రజలతో నా అనుబంధం ఈనాటిది కాదు, 45 ఏళ్ల అనుబంధం ఉందని, ఇకపైనా ఈ అనుబంధం కొనసాగాలి అంటూ వైఎస్ విజయమ్మ భావోద్వేగానికి గురయ్యారు. అంతకుముందు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్, భారతి, వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల నివాళి అర్పించారు. సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

పార్టీ జెండా ఎగురవేసిన సిఎం జగన్

ఎపిలో గుంటూరులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాను ఎపి సిఎం సభా ప్రాంగణంలో పార్టీ జెండాను ఎగురవేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎపి సిఎం మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న కార్యక్రమాలను, ఇచ్చిన హామీల అమలును చూసి టిడిపి తన మేనిఫెస్టోను యూ ట్యూబ్ నుంచి తొలిగించిందన్నారు. మేనిఫెస్టో మాయం చేసిన ఘనత టిడిపిదేనని విమర్శించారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు రాష్ట్రాన్ని అన్ని రంగాలను ముంచేశారని అన్నారు. అతడు చేసిన అప్పులు, బకాయిలను తమ మూడేండ్ల పాలనలో తీర్చామని తెలిపారు. మంచి చేసిన చరిత్ర, మాటకు కట్టుబడి లేని ప్రతిపక్షానికి ఆరోపించే, విమర్శించే నైతిక లేదని అన్నారు. అసూయతో గిట్టని వారు పార్టీపై, ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్ 73వ జయంతిని పురస్కరించుకుని శుక్ర, శనివారాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు రోజుల పాటు ప్లీనరీ సమావేశాలను నిర్వహించనున్నాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News