కేరళలో ఎల్‌డిఎఫ్ అఖండ విజయం వెనుక విజయన్ నాయకత్వ నైపుణ్యం
కొచి : కేరళలో విపక్షం యుడిఎఫ్ పై అధికార పార్టీ ఎల్‌డిఎఫ్ అఖండ విజయం సాధించడం వెనుక గత కొన్ని దశాబ్దాలుగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ చూపించే రాజకీయ చతురత, నైపుణ్యమే ప్రధాన కారణాలు. గత నాలుగు దశాబ్దాల చరిత్రలో కేరళలో అధికార పార్టీ రెండోసారి విజయం సాధించిన సందర్భాలు లేవు. కానీ ఈసారి ముఖ్యమంత్రి విజయన్ నేతృత్వం లోని ఎల్‌డిఎఫ్ కూటమి ఆ చరిత్రను తిరిగి రాయగలిగింది. కాంగ్రెస్ లోని వ్యవస్థాపరమైన బలహీనత, బిజెపి సంప్రదాయ వామపక్ష వ్యతిరేక భావజాలాన్ని బలవంతంగా చొప్పించడం ఎల్‌డిఎఫ్ విజయానికి మార్గం సుగమం చేశాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించడమే కాక, ప్రజలకు వాటి ఫలితాలు సజావుగా, నేరుగా అందేలా పాలనా విధానాన్ని చక్కగా విజయన్ నెరవేర్చ గలుగుతుండడమే ఇప్పటి విజయానికి దోహదం చేసింది.
2019 లోక్‌సభ ఎన్నికల్లో 20 స్థానాలను కోల్పోయిన అనుభవాన్ని గుణపాఠంగా ఎల్‌డిఎఫ్ నేర్చుకుని జాగ్రత్త పడింది. బహిష్టు దశ లోని యువతులకు శబరిమలై ఆలయ ప్రవేశంపై కోర్టు తీర్పు ప్రకారం గట్టిగా నిలిచింది. 2018 వరదల్లో, 2019 నిఫా వైరస్ విజృంభణలో ప్రజలకు అండగా ఉండి సహాయ హస్తాన్ని అందించింది. ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీ, కిట్ల పంపిణీ, కరోనా నివారణ చర్యలు, ప్రజారోగ్య భద్రత, పెన్షన్లు సరిగ్గా అందేలా ఏర్పాట్లు ఇవన్నీ విజయన్ నాయకత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టాయి.