Monday, January 27, 2025

వైసిపిలో ఏం జరుగుతోంది..?

- Advertisement -
- Advertisement -

వైసిపిలో ఏం జరుగుతోంది? తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. వైసిపి నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆళ్ల నానీల తర్వాత ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా రాజీనామా చేశారు. ముందు ముగ్గురు రాజీనామాల్లో అంత ప్రత్యేకత ఏమీ లేకపోయినా స్వయం ప్రకటిత జగన్ ఆత్మఅయిన విజయసాయిరెడ్డి రాజీనామా ప్రత్యేకమైనది. జగన్‌కి మంచి జరగాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేసిన ఆయన, జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు, అది కూడా జగన్ లండన్‌లో ఉన్న సమయంలో హ్యాండ్ ఇచ్చారు. ఇలా ముఖ్యనాయకులు బయటకు వెళ్లిపోవడం వల్ల వైఎస్‌ఆర్‌సిపి బలహీనపడుతుందా? కాకినాడ పోర్టు విషయంలో జరిగిన అక్రమాల కేసులో విజయసాయిరెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ‘తిమింగలం తెలివిగా వల నుంచి తప్పించుకోవడానికే రాజీనామా చేసింద’ని క్షేత్రస్థాయిలో ప్రచారం జరుగుతోంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి, కష్టకాలంలో విడిచిపోతున్నారని, ‘పదవులూ ఆస్తులూ మీకూ, కేసులు మాకా?’ అని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. అయినా సరే, విజయసాయి రెడ్డి విషయంలో నాయకులనుంచి కార్యకర్తలవరకూ ఎవరూ సానుభూతి ప్రకటించడం లేదు.

ఎవరూ రాజీనామా చేసినా… పోతే పోనీ అన్నట్లుగానే వ్యవహారం ఉంది. వైఎస్‌ఆర్‌సిపి ఏర్పడి దాదాపు 12 ఏళ్లు కావొస్తున్నా.. ఆ పార్టీకి ఓటర్లు ఉన్నారు కానీ, సంస్థాగత నిర్మాణం సరిగా లేదు. 2024 ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత కూడా అధినేత ఏకపక్ష నిర్ణయాలను మానుకోవడం లేదు. నాయకులు రాజీనామా చేసినప్పుడు సయోధ్య చేసే ప్రయత్నాలు కూడా చేయకపోవడం దీనికి నిదర్శనం. వైఎస్ షర్మిల మొదలుకొని, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, విజయసాయి రెడ్డి లాంటి జగన్ ఆప్తులు బయటకెళ్లడం వల్ల వైఎస్‌ఆర్‌సిపి పనైపోయిందనుకోవడం అపోహ మాత్రమే. ఆప్తులు బయటకు వెళ్లడం వల్ల జగన్ నైతిక స్థైర్యం దెబ్బతింటుందేమోగానీ, పార్టీ దెబ్బతినే అవకాశం లేదు. ప్రాంతీయ పార్టీలు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న నాయకులే ముసలం సృష్టించే ప్రయత్నం చేస్తారు.

2019లో టిడిపి ఓడగానే ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు సిఎం రమేశ్, సుజనా చౌదరి, టిజి వెంకటేశ్, గరికపాటి మోహన్ రావు రాజీనామా చేసి, బిజెపిలో చేరారు. వీరు కూడా చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితులుగా పేరుపొందినవారే. వీళ్లు పార్టీనుంచి వేరుపడటంవల్ల టిడిపికి కలిగిన నష్టం సున్నా. అప్పుడు చంద్రబాబు నాయుడి కుటుంబం విదేశాల్లో ఉన్నప్పుడే టిడిపి రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసినట్లు, ఇప్పుడు జగన్ విదేశాల్లో ఉన్నప్పుడే సాయిరెడ్డి రాజీనామా చేయడం యాదృచ్ఛికమా? బిజెపి ప్లానా? అనే అనుమానాలు ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రాల్లో కర్మ ఏంటంటే… అటు టిడిపి, ఇటు వైఎస్‌ఆర్‌సిపి కేసుల్లో చిక్కుకోవడంవల్ల బిజెపి ప్రాంతీయ పార్టీల భుజం మీద తుపాకీపెట్టి కాలుస్తోంది. 2019 నుంచి 2024 మధ్య వైసిపి భుజం మీద తుపాకీ పెట్టి టిడిపిని కూల్చాలని ప్రయత్నించిన బిజెపి, ఇప్పుడు టిడిపి భుజం మీద తుపాకీ పెట్టి వైఎస్‌ఆర్‌సిపిని కూల్చే ప్రయత్నం చేస్తోందని చర్చించుకుంటున్నారు.కానీ, బిజెపి, టిడిపి కలిసి వైఎస్‌ఆర్‌సిపిని అంతం చేయడం కల్లగానే భావించాలి. మాయల ఫకీర్ ప్రాణం పక్షిలో ఉన్నట్టు… వైఎస్‌ఆర్‌సిపి భవిష్యత్తు కాంగ్రెస్ మీదే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం వైఎస్‌ఆర్‌సిపి ఓటర్లంతా కాంగ్రెస్ ఓటర్లే.

కాంగ్రెస్ పార్టీకి గతంలో బలంగా మద్దతిచ్చిన ఎస్‌సి మాల, ముస్లింలు, రెడ్లు, కాపులు, క్రిస్టియన్లు, బ్రాహ్మణులే… ఇప్పుడు వైఎస్‌ఆర్‌సిపి ప్రధాన ఓటర్లుగా ఉన్నారు. వీళ్లు ఎప్పుడూ టిడిపికి, దానితో కూటమికట్టే పార్టీలకు వ్యతిరేకంగానే ఉంటారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి అకాల మరణం, తెలంగాణ ఉద్యమం కలిసి ఆంధ్రాలో కాంగ్రెస్‌ని పాతాళంలోకి తొక్కాయి. 2014 నాటికి నోటాతో పోటీపడే స్థాయికి పరిస్థితి దిగజారింది. 2014లో నందిగామ ఎన్నికలో వైఎస్‌ఆర్‌సిపికి 46.9 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్‌కి 1.3 శాతం ఓట్లు వచ్చాయి. అక్కడి నుంచి గెలిచిన టిడిపి అభ్యర్థి తంగిరాల ప్రభాకర్ రావు మరణించడంతో వెంటనే ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికలో వైఎస్‌ఆర్‌సిపి పోటీనుంచి తప్పుకోవడంతో వైఎస్‌ఆర్‌సిపి ఓట్లు బదిలీ అయ్యి 19.5% ఓట్లతో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. 2015లో తిరుపతిలో జరిగిన ఉప ఎన్నికలో కూడా వైఎస్‌ఆర్‌సిపి పోటీనుంచి తప్పుకోవడంతో ఆ ఓట్లన్ని కాంగ్రెస్‌కి బదిలీ అయ్యాయి.

2014 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్‌ఆర్‌సిపికి 44.6% ఓట్లు రాగా, కాంగ్రెస్ కేవలం 2.8 శాతానికే పరిమితమయ్యింది. విభజన తర్వాత కాంగ్రెస్ బలం, బలగం అంతా కాంగ్రెస్ నుంచి జగన్ పెట్టిన వైఎస్‌ఆర్‌సిపికి బదిలీ అయ్యాయని చెప్పడానికి ఇవే నిదర్శనాలు. కాబట్టి, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ పెరిగినప్పుడు మాత్రమే జగన్ ఆందోళన చెందాలి గానీ, విజయసాయిరెడ్డి లాంటి నాయకులు వెళ్లిపోయినప్పుడు కాదు. ఆర్ధిక వనరులు సమకూర్చేవారు, లాబీయింగ్ చేసేవారు ఏ పార్టీకయినా అవసరమే. కానీ వాళ్లను తెర వెనుకకే పరిమితం చేయాలి తప్ప బడా లీడర్లుగా ప్రమోట్ చేయొద్దు. అధ్యక్షుడు అందర్నీ సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే భావన కలిగించడం వల్ల క్షేత్రస్థాయిలో పార్టీ బలపడుతుంది.

ఏనాడు ప్రత్యేక్ష ఎన్నికల్లో గెలవని సాయి రెడ్డి వల్ల ఒక్క ఓటు కూడా రాదు. ఆయన ఒక అవినీతిపరుడు అనేది మిడిల్ క్లాస్ ప్రజల్లో ఒక అభిప్రాయంగా ఉంది. ప్రజల్లో సానుకూల ఇమేజ్ తెచ్చుకోవాలని సాయిరెడ్డి ఏనాడూ ప్రయత్నించలేదు. సాయిరెడ్డితో పాటు కొడలి నాని, అంబటి రాంబాబు, రోజా, జోగి రమేశ్ వంటి నాయకుల దిగజారుడు భాషతో పార్టీకి నష్టం జరిగింది. అజాత శత్రువుగా గుర్తింపు పొందిన అశోక్ గజపతిని వేధించిన తీరును కూడా ప్రజలు అసహ్యించుకున్నారు. సాయిరెడ్డి నిష్క్రమణ వైఎస్‌ఆర్‌సిపి పట్ల ప్రజల్లో ఉన్న ప్రతికూలతను కొంత తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. కార్పొరేట్ కంపెనీగా కాకుండా ఒక రాజకీయ పార్టీగా వ్యవహారాలు సాగించాలని, ఈ ఉదంతం నిరూపించింది. 40% ఓటు బ్యాంకు ఉన్న పార్టీని ఎంతమంది వీడిపోయినా అది టీ కప్పులో తుఫాన్ మాత్రమే.

జంపాల ప్రవీణ్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News