ఢిల్లీ: పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానని ఎంపి విజయసాయి రెడ్డి తెలిపారు. వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో అన్నీ మాట్లాడాకే రాజీనామా చేశానని స్పష్టం చేశారు. ఇకపై భవిష్యత్‌లో రాజకీయాల గురించి మాట్లాడనని వివరణ ఇచ్చారు. రాజ్యసభ సభ్యత్వానికి విజయ సాయిరెడ్డి రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కడ్ ను కలిసి రాజీనామా లేఖ ఇచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తన రాజీనామాను ఉపరాష్ట్రపతి ఆమోదించారని, తనని ఎన్ని ఇబ్బందులు పెట్టినా అప్రూవర్‌గా మారలేదన్నారు. వెన్నుపోటు రాజకీయాలు తనకు తెలియవని తెలిపారు.
కాకినాడ పోర్ట్ వ్యవహారంలో తనకు సంబంధం లేదని, తాను దేవుడిని నమ్మానని, నమ్మక ద్రోహం చేయనని స్పష్టం చేశారు. తనలాంటి వాళ్లు వెయ్యి మంది పోయినా జగన్‌కు ప్రజాధరణ తగ్గదన్నారు. తన రాజీనామా పూర్తిగా వ్యక్తిగతమని, రాజకీయాల్లోకి వచ్చినప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కేసుల మాఫీ కోసమే తాను రాజీనామా చేశానని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏ కేసునైనా ఎదుర్కొనే ధైర్యం తనకు ఉందన్నారు. బిజెపిలో చేరడం కానీ, ఏ పదవి తీసుకోవడం కానీ జరగదని స్పష్టం చేశారు. తన రాజీనామా వల్ల రాజ్యసభ సీటు కూటమికి వెళ్తుందన్నారు. వైఎస్ వివేకా ఘటనపై విజయసాయిరెడ్డి స్పందించారు. వివేకానందరెడ్డి చనిపోయినట్టు తెలిసి షాక్ గురయ్యానని, వెంటనే ఎంపి అవినాష్‌రెడ్డికి ఫోన్ చేసి అడిగానని, అవినాష్ మరో వ్యక్తికి ఫోన్ ఇచ్చారన్నారు. గుండెపోటుతో వివేకా చనిపోయినట్టు వాళ్లు తనకు చెప్పడంతో తాను మీడియాకు చెప్పానన్నారు.