Saturday, January 25, 2025

రాజకీయాలకు విజయసాయిరెడ్డి గుడ్ బై

- Advertisement -
- Advertisement -

వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. శనివారం ఉదయం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని, ఏ పార్టీలోనూ చేరడం లేదని విజయసాయి రెడ్డి ఎక్స్ లో తెలిపారు. చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగత విభేదాలు లేవని, పవన్ కళ్యాణ్‌తో చిరకాల స్నేహం ఉందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. రాజ్యసభ సభ్యత్వానికి 25వ తేదీన రాజీనామా చేస్తున్నాను. ఏ రాజకీయపార్టీలో చేరడం లేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బు ఆశించి రాజీనామా చేరడంలేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను.

రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్‌కు, తనను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన భారతమ్మకు సదా కృతజ్ఞుడిని. జగన్‌కు మంచి జరగాలని కోరుకుంటున్నా. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్‌గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా. దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనో ధైర్యాన్నిచ్చి తెలుగురాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి, హోంమంత్రి అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు. టీడీపీతో రాజకీయంగా విభేదించా. కానీ చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ తో చిరకాల స్నేహం ఉంది. నా భవిష్యత్తు వ్యవసాయం. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన రాష్ట్ర ప్రజలకు, మిత్రులకు, సహచరులకి, పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నానని విజయసాయి రెడ్డి ఎక్స్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News