బండిపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ : బిజెపి నాయకత్వంపై ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి అసంతృప్తిని వ్యక్తం చేశారు. గురువారం నాడు హైదరాబాద్‌లో విజయశాంతి మీడియాతో మాట్లాడారు. గురువారం బిజెపి కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మణ్ ప్రసంగంతో కార్యక్రమం ముగిసింది. పార్టీ కార్యక్రమాల్లో మాట్లాడే అవకాశం లేకపోవడంతో ఆమె అసంతృప్తిని వ్యక్తం చేశారు. మాట్లాడడానికి తనకు అవకాశం ఎకందుకు ఇవ్వలేదో పార్టీ నేతలనే అడగాలని ఆమె మీడియా ప్రతినిధులను కోరారు. తన సేవలను ఎలా ఉపయోగించుకొంటారో బండి సంజయ్, లక్ష్మణ్‌లకు తెలియాలన్నారు. తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలో పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని ఆమె చెప్పారు. కరోనా కారణంగా పార్టీకి కొద్దికాలం దూరంగా ఉన్నానని తెలిపారు. 24 ఏళ్ళు బిజెపి పార్టీలో పనిచేశానని ఆమె గుర్తు చేశారు. పార్టీ తనకు ఏమీ బాధ్యత ఇచ్చారని పార్టీలో పనిచేయాలని విజయశాంతి ప్రశ్నించారు. ఒకరిద్దిరితో పార్టీలో పనులు జరగవన్నారు. ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్న వాళ్లను ముందులో వరసగా ఉంచాలని ఆమె నాయకత్వాన్ని కోరారు. బాధ్యత కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పార్టీ తనను ఉపయోగించు కోవడం లేదనే భావిస్తున్నానని విజయశాంతి కుండబద్దలు కొట్టారు. పార్టీలో ఏ పదవి ఇచ్చినా స్వీకరిస్తానని చెప్పారు.