Wednesday, January 22, 2025

గుండెకోత

- Advertisement -
- Advertisement -

ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో
నాలుగు గంటలపాటు కుంభవృష్టి
12గంటలు ఏకధాటిగా వర్షం
నిండుకుండల్లా ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలు
చాదర్‌ఘాట్ బ్రిడ్జ్‌ను ఆనుకొని ప్రవహిస్తున్న వరద, మూసారాంబాగ్ వంతెనపై
రాకపోకలు నిషిద్ధం
వికారాబాద్‌లో 14 సెం.మీ
వర్షపాతం నమోదు,
జిల్లాలో నేడు స్కూళ్లకు సెలవు

మన తెలంగాణ/న్యూస్ నెట్‌వర్క్ : పన్నెండు గంటలుగా ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి రంగారెడ్డి, రాజధాని హైదరాబాద్, నల్లగొండ జిల్లాలు అతలాకుతలమ య్యా యి. నిర్మల్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో ఓ మో స్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతోపాటు మహానగరం హైదరాబాద్‌లో కురిసిన వర్షాలతో పల్లపు ప్రాంతాలు నదులను తలపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాగులు, వం కలు పొంగిపొర్లుతున్నాయి. పరిగి, వికారాబాద్, షాబాద్, తాండూరు, శంషాబాద్ ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామునుంచి 4గంటలపాటు ఒక్క ఉదుటున కురిసిన వర్షంతో వాగులు, వంకలు నిండుకుండల్లా మారిపోయాయి. రెండు రోజులుగా ఎడతేరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో రోడ్లు, కల్వర్టులపై నుంచి ప్రమాదస్థాయిలో వరదనీరు పొంగి ప్రవహిస్తోంది. పలు చోట్ల ఇళ్లు నాని కూలిపోయాయి. వికారాబాద్, తాండూర్‌లలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. కాగ్నా నది ప్రమాదస్థాయిలో పొంగడంతో తాండూర్‌కు రాకపోకలు స్తంభించాయి. వికారాబాద్ నుంచి తాండూర్, తాండూర్ నుంచి సంగారెడ్డి రూట్‌లో వాగులు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి.

వికారాబాద్ జిల్లాలోని కోట్‌పల్లి, సర్పన్‌పల్లి, లక్నాపూర్ ప్రాజెక్టులతో పాటు అన్ని చెరువులు నిండుకుండలా మారి మత్తడి దూకుతున్నాయి. వికారాబాద్ జిల్లాతో పాటు ఈసి, మూసీ ఎగువ ప్రాంతంలోని షాబాద్, శంకర్‌పల్లి మండలాల్లో భారీ వర్షం కురవడంతో నదులు ఉధృత్తంగా ప్రవహిస్తున్నాయి. మొయినాబాద్ మండలం పరిధిలోని అమ్డాపూర్ వద్ద ఈసీ వాగు పంట చేనులను ముంచెత్తింది. చిన్నచిన్నవాగుల నుంచి పెద్ద పెద్ద వాగులన్నీ పొంగిపొర్లాయి. చెరువులన్నీ పూర్తిగా నిండిపోయి ప్రమాదకరస్థాయిలో అలుగు పారుతున్నాయి. ప్రమాదకర స్థాయిలో వచ్చిన వరదలతో పంట పొలాలు పూర్తిగా జలమయమయ్యాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురవడంతో వికారాబాద్ జిల్లా కేంద్రంలో రోడ్లన్నీ జలమయంగా మారాయి.

ప్రధాన రోడ్లు పూర్తిగా వరద నీరు నిండి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. రాజీవ్ గృహకల్ప, గంగారం, శివరాం నగర్ కాలనీల్లీ వరద నీరు ఇళ్ళలోకి చేరింది. గిరిగిట్ పల్లి రోడ్డు మార్గంలో రైల్వే బ్రిడ్జి కింద ప్రమాదకరంగా వరద నీరు పారుతోంది. వికారాబాద్ పరిగి రోడ్డు మార్గంలోని మద్గుల్ చిట్టెంపల్లి వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. వర్షాలతో లక్నాపూర్ ప్రాజెక్ట్ పూర్తిగా నిండి అలుగు పారుతుంది. మంగళవారం ఉదయానికి 18 అడుగుల మేర నిండిన ఈ ప్రాజెక్ట్ 10 గంటల నుంచే మరో రెండు అడుగులమేర పెరిగి అలుగు పారడం మొదలై.. గంటగంటకు వరద ఉధృతంగా పెరిగింది. ధారూర్ మండలం బాచారం వాగు నిర్మాణ దశలో ఉండగా పక్కనుండి ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డుపై నుండి భారీగా నీరు పారుతోంది. దీంతో వికారాబాద్ తాండూర్ రోడ్డు మార్గంలో రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. తాండూరు, -వికారాబాద్, పరిగి-, వికారాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కోట్‌పల్లి ప్రాజెక్టు అలుగు పారుతుండడంతో ధారూర్, నాగసమందర్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచి పోయాయి. దాచారం వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిపై నుంచి నీరు పారుతుండటంతో తాండూరుహైదరాబాద్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

జంట జలాశయాలు పరవళ్లు..

వికారాబాద్, చేవెళ్ల, శంకర్‌పల్లిలో భారీగా వర్షం కురుస్తుండడంతో.. గండిపేట జలాయశానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అక్కడ నుంచి నీరు మూసీ నదిలోకి రావడంతో ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అధికారులు మూసీ పరివాహక ప్రాంతాలను అప్రమత్తం చేశారు. ఉస్మాన్‌సాగర్ ఆరు గేట్లు 6 అడుగులమేర ఎత్తి మూసిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. అటు హిమాయత్‌సాగర్ నాలుగు గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. జంట జలాశయాల గేట్లు ఎత్తివేయడంతో మూసీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు మూసీ పరివాహక ప్రాంతాల్లో మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేశారు. చాదర్‌ఘాట్, మూసారాంబాగ్ బ్రిడ్జిల వద్ద మూసీ ప్రవాహం ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. బాపూఘాట్, శంకర్‌నగర్, చాదర్ ఘాట్, మూసారాంబాగ్ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జిహెచ్‌ఎంసి హెచ్చరించింది.

ఈసి వాగులో చిక్కుకున్న వికారాబాద్ యువకుడు
రక్షించిన ట్రాఫిక్ పోలీసులు

హిమాయత్ సాగర్ పోటెత్తడంతో ఈసీ వాగు ఉప్పొంగడంతో ఈద్గా వంతెన వద్ద వాగు వరద నీటితో సర్వీస్ రోడ్డుపైన ఓ యువకుడు బైక్‌ను ముందుకు పోనిచ్చాడు. దీంతో వరద నీటి ఉధృతితో రోడ్డు మధ్యలో ఆ యువకుడు నిలిచిపోయాడు. వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండలం దుపచెర్ల గ్రామానికి చెందిన అర్వింద్ గౌడ్ బైక్‌ను నడుపుతూ వరద నీటి మధ్యలో రోడ్డుపై ఉండిపోయాడు. ఎటువెళ్లే పరిస్థితి లేకపోవడం, సర్వీస్ రోడ్డుకు ఇరువైపులా ఇనుప గ్రిల్స్ ఉండటంతో వాహనదారుడు వాటిసాయంతో ప్రాణాలతో బైటపడ్డాడు. గ్రిల్స్‌ను ఆసరాగా చేసుకొని అక్కడ ఉండి నిలదొక్కుకుని పోలీసుల సాయంతో బైటపడ్డాడు.

వాగు దాటుతూ బయటపడిన రైతు

మంగళవారం కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగిపోర్లడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్మల్ జిల్లా దొనిగాం ప్రాజెక్ట్ నుంచి కంకెట వెళ్లే రహదారిపై వాగు ప్రవహిస్తుండగా రైతు బొమ్మెన లస్మన్న వాగు దాటే ప్రయాత్నం చేయగా ప్రవాహానికి కొట్టుపోయి కొద్దిదూరంలో ఒడ్డుకు చేరుకున్నాడు.

నూనెగూడెంగుండాల మధ్య తెగిన కల్వర్టు

భారీ వర్షానికి యాదాద్రి భవనగిరి జిల్లా గుండాల గ్రామం సమీపంలో నూనె గూడెం కల్వర్టు తెగిపోయింది. రెండు గ్రామాల మధ్యన రాకపోకలు బంద్ కావడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు ప్రతిరోజు నూనె గూడెం విద్యార్థులు పాఠశాలకు రావడానికి ఇబ్బంది ఏర్పడింది. గుండాల గ్రామం సంబంధించిన వ్యవసాయ భూములు వాగు అవతల ఉండడంతో వాగు దాటి వెళ్లలేకపోతున్నారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగ గుండాల-నూనె గూడెం గ్రామాల మధ్యఉన్న వాగు బ్రిడ్జికి రెండు వైపులా మట్టి రోడ్డు పూర్తిగా తెగిపోయింది. దీంతో నూనె గూడెం-గుండాల గ్రామాల మద్యరాకపోకలు బంద్ కావడంతో గ్రామస్థులు, రైతులు ఇబ్బందిపడుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News