Thursday, January 23, 2025

‘వికసిత్’ లక్ష్యానికి విద్వేషాల తూట్లు

- Advertisement -
- Advertisement -

వికసిత్ భారత్‌ను 2047 నాటికి సాధించగలమని మోడీ ప్రభుత్వం చెబుతోంది.ఈ నేపథ్యంలో అన్ని వర్గాల సామాజిక సంస్కృతులను, వారి జీవన వ్యవహారాలను సమానంగా ఆదరించకపోతే వికసిత్ భారత్ లక్షానికి చేరుకోవడం ఎలా సాధ్యం అన్నదే ప్రశ్న. మాల్స్, మల్టీప్లెక్స్‌లు, ఆకాశహర్యాలు, నేషనల్ హైవేలు, వందే భారత్‌లు ఇవేనా వికసిత్ భారత్ అంటే.. వీటి నుంచి సాధించిన జిడిపియేనా వికసిత్ భారత్ అంటే!.. దేశంలోని అన్ని కులాలను, మతాలను కలుపుకునే సమానత్వ సోదరత్వ భావాలను పాదుకొలిపిననాడే వికసిత్ భారత్ లక్షం వికసిస్తుంది. కానీ దేశంలో వర్గాలవారీగా, కులమతాల వారీగా విద్వేషాలు, హింసాత్మక సంఘటనలు గత కొన్నేళ్లుగా పెచ్చరిల్లుతున్నాయి. వీటిని ప్రభుత్వాలు ముఖ్యంగా బిజెపి పాలిత రాష్ట్రాలు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నాయి. గోరక్షణ పేరుతో కొంతమంది దుండగులు హింసాత్మక దాడులకు పాల్పడుతున్నా బాధితులకు న్యాయం సరిగ్గా జరగడం లేదు.

గత నెల మహారాష్ట్రలో రైలులో వెళ్తున్న అష్రఫ్ అలీ సయ్యద్ హుస్సేన్‌ను బీఫ్ (గొడ్డు మాంసం) తీసుకెళ్తున్నాడని ఒక గుంపు విపరీతంగా దాడిచేసింది. మరో కేసులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన 22 ఏళ్ల సబీర్ మాలిక్ గోమాంసం విక్రయిస్తున్నాడని హర్యానాలోని చర్ఖీదాద్రి జిల్లాలో గోరక్షకులు దాడిచేశారు. అదే కారణంతో హర్యానాలోని జాతీయ రహదారిపై 19 ఏళ్ల ఆర్యన్ మిశ్రాను ముస్లింగా, పశువుల దొంగ గా అనుమానించి గోరక్షకులు కాల్చిచంపారు. ఈ కేసులో హర్యానా పోలీస్‌లు ఐదుగురిని అరెస్టు చేసినప్పటికీ పొరపాటున తాము అరెస్టు చేశామని చెప్పివారిని విడిచిపెట్టారు. ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహాలో ఒక విద్యార్థి నాన్‌వెజిటేరియన్ బిర్యానీ తెచ్చుకున్నాడని ఆ స్కూలు ప్రిన్సిపాల్ ఆ విద్యార్థికి శిక్ష విధించాడు. బాధితుడైన విద్యార్థి తల్లి తన కుమారుడిని చితకబాది గదిలో మూడు నాలుగు గంటలు బంధించి చివరకు విడిచిపెట్టారని ఆరోపించింది. కానీ దీనికి తగిన సాక్షాధారాలు లేవని పోలీస్‌లు చేతులు దులుపుకున్నారు. 2016లో పశువుల కాపరులైన ఇద్దరు ముస్లింలను మార్కెట్‌కు పశువులను తీసుకెళ్తుండగా హింసించి చంపారు.వీరిలో ఒక కుర్రాడు జార్ఖండ్‌లోని లతేహార్ జిల్లా మారుమూల గ్రామస్థుడు. హర్యానాలో చార్కిదాద్రి జిల్లాలో వలస కార్మికుడు సబీర్ మాలిక్‌ను చచ్చేంతవరకు హింసించారన్న ఆరోపణపై పోలీస్‌లు ఐదుగురిని అరెస్టుచేశారు.

ఒడిశాలోని ఒక కాలేజీ హాస్టల్‌లో బీఫ్ వండారని ఏడుగురు విద్యార్థులను ప్రిన్సిపాల్ హాస్టల్ నుంచి బహిష్కరించారు. ఇలాంటి దారుణాలు వికసిత్ భారత్ లక్షం గల భారత్‌లో కొనసాగుతుండడం శోచనీయం. హిందువులు గోవులను ఆరాధిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. గోవధను గోమాంస క్రయవిక్రయాలను చాలా రాష్ట్రాలు నిషేధించాయి కూడా. కానీ గోరక్షణ పేరుతో హత్యలకు పాల్పడడమే ఘోరాతిఘోరమైన నేరం. గోవులను రక్షిస్తున్నామని చెప్పి హత్యలను సాధారణం చేసిన దేశం.. ప్రజాస్వామ్యం అన్న నినాదాన్ని ఎలా ఇవ్వగలుగుతుంది? గోరక్షణ పేరుతో సాటి మనిషిని హతమార్చడం హిందుత్వకు వ్యతిరేకమని సాక్షాత్తు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అధినేత మోహన్ భగవత్ ఒకసారి ప్రస్తావించడం గమనార్హం. 201017 మధ్యకాలంలో దేశంలో గోరక్షక దళాలు 63 సార్లు హింసాత్మక దాడులకు పాల్పడ్డాయని రాయిటర్స్ సంస్థ నివేదిక వెల్లడించింది. ఈ దాడుల్లో సగం బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే జరిగాయి.కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి ఏడేళ్లలోనే జరిగిన గోదాడుల్లో మృతి చెందిన 28 మందిలో 24 మంది ముస్లింలేనన్న ఆరోపణలు ఉన్నాయి.

ఈ దాడుల్లో సగానికి సగం కేవలం వదంతుల పైనే జరిగాయని తేలింది. ఏ సమాజం లేదా ఏ ప్రజల ఆహారంలోనైనా వారి ఎంపికను ఏ విధంగా ద్వేషిస్తాం? ఆహారం అన్నది వ్యక్తిగతమైన అవకాశం. జనాభాలో 90 శాతానికి పైగా ముస్లింలే ఉన్న లక్షద్వీప్‌లో జంతువధను నిషేధించడం ఆ వర్గం ఆహారాన్ని లక్షంగా చేసుకొని తీసుకున్న చర్య కాదా? ఇండోనేషియా, మలేషియాలను ఉదాహరణగా తీసుకుందాం. ఆగ్నేయాసియాలోని ఈ రెండు దేశాల్లో ముస్లింల జనాభాయే మెజారిటీ సంఖ్యలో ఉంటారు. ముస్లింలు సంప్రదాయంగా పోర్క్‌ను తీసుకోరని ప్రతివారికీ తెలుసు. అక్కడ పోర్కును తినవద్దని మైనార్టీలనుగాని, టూరిస్టులనుగాని ఎవరూ అడ్డగించరు. రెస్టారెంట్లలో పోర్క్‌పై ప్రకటనలు ఉన్నా ఎవరూ నిరోధించరు. నేషనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ సర్వే ప్రకారం 2019లో 47% మంది భారతీయులు వారానికి ఒకసారి మాంసాహారం తీసుకుంటారని బయటపడగా, ఇప్పుడు 57% మంది మాంసాహారం తీసుకుంటారని తేలింది. మరి మాంసాహారం తినవద్దని హిందువులమైన మనం శాసించగలమా ?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News