Wednesday, January 22, 2025

బ్రిటన్‌లో భారతీయ హైకమిషనర్‌పై ఖలీస్థానీ జబర్దస్తీ

- Advertisement -
- Advertisement -

గ్లాస్గో : బ్రిటన్‌లోని భారతీయ హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామికి ఖలీస్థానీ తీవ్రవాదులు షాకిచ్చారు. దొరైస్వామిని స్కాట్లాండ్‌లోని గురుద్వారాలోకి వెళ్లనివ్వలేదు. గురుద్వారా సిబ్బందిని బెదిరించడంతో కొద్ది సేపు అక్కడ ఘర్షణ చెలరేగింది. కెనడాలో ఖలీస్థానీ శక్తుల ఆగడాల ప్రభావం ఇప్పుడు బ్రిటన్‌కు సోకింది. అల్బర్ట్ డ్రైవ్ ప్రాంతంలోని గ్లాస్గో గురుద్వారా వద్ద హైకమిషనర్‌ను ఖలీస్థానీలు అడ్డుకుంటున్న వైనం తెలిపే వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వెలుగులోకి వచ్చింది. గురుద్వారా వద్దకు వచ్చిన హై కమిషనర్ కారు వద్ద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు నిలబడి ఉండటం, లోపలి నుంచి లాక్ చేసి ఉన్న కారును తెరిచేందుకు వీరు దూకుడుగా యత్నించడం, దీనిని గమనించి వెంటనే అక్కడి నుంచి కారు వేగంగా వెళ్లిపోవడం ఈ వీడియోలో కన్పించింది. కెనడా, బ్రిటన్, అమెరికాలలోని భారతీయ ఎంబసీలకు ఇటీవలి కాలంలో ఖలీస్థానీ వర్గాల నుంచి బెదిరింపులు ఎక్కువయ్యాయి.

స్కాట్లాండ్ గురుద్వారా కమిటీ నుంచి ఇండియా హై కమిషనర్‌కు ఆహ్వానం అందింది. ఈ మేరకు దొరైస్వామి అక్కడికి వెళ్లారు. ఖలీస్థానీ వ్యక్తులు అప్పటికే అక్కడికి చేరుకుని గురుద్వారా సిబ్బందిని బెదిరించడం, అక్కడికి వచ్చిన హై కమిషనర్ కారు తలుపులును బలవంతంగా తెరిచేందుకు జబర్దస్తీగా వ్యవహరించడం ఇప్పుడు వైరల్ అయింది. సిక్కు యూత్ యుకె ఇన్‌స్టాగ్రామ్ ఛానల్‌లో ఈ వీడియో వెలువరించారు. ఈ ఖలీస్థానీలు హై కమిషనర్ కారు ఆగి ఉంటే దాడికి దిగి ఉండేవారని వెల్లడైంది. ఇక్కడి గురుద్వారా వద్ద జరిగిన ఘటనపై హైకమిషనర్ అధికారులు స్థానిక పోలీసు వర్గాలకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడైంది.భారత హైకమిషనర్‌ను ఖలీస్థానీలు అడ్డుకున్న విషయంపై బ్రిటన్ విదేశాంగ కార్యాలయానికి భారతదేశం తన ఆందోళన వ్యక్తం చేసింది.

భారతీయ అధికారులపై నిషేధం ః సిక్కు యూత్ యుకె
భారతీయ దౌత్య అధికారి రాకను ముందు తెలుసుకుని సిక్కు యూత్ యుకె సరైన వ్యూహంతో వ్యవహరించిందని వెల్లడైంది. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన వీడియోలో ఓ వ్యక్తి కెమెరా వైపు చూస్తూ భారతీయ దౌత్యవేత్త కానీ, ఏ ఇతర భారతీయ అధికారి కానీ గురుద్వారాలకు వస్తే ఏం జరుగుతుందనేది చెప్పడానికి ఇదో మచ్చుతునక అని ఈ వ్యక్తి చెప్పడం విన్పించింది. భారతీయ అధికారులు ఎవరూ కూడా అధికారిక హోదాలో గురుద్వారాలకు రావడానికి వీల్లేదనే తమ నిషేధం అమలులో ఉందని సిక్కు యూత్ యుకె తెలిపింది. కెనడాలో సిక్కుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని, ప్రతి సిక్కు దీనిని నిరసించాల్సి ఉందని, ఇప్పుడు గ్లాస్గోలో జరిగినట్లుగానే ఇతర చోట్ల కూడా భారతీయ అధికారులను నిలువరించాలని ఖలీస్థానీ చెప్పడం వీడియోలో ఉంది.

అధికారుల ఆటలు అన్ని తమకు తెలుసునని, కెనడాలో ఏం జరుగుతున్నదో కూడా తెలుస్తూనే ఉందని , చివరికి కెనడా ప్రధాని బహిరంగంగా ఇండియా చర్యలను తిట్టిపోశారని, చివరికి భారతీయ దౌత్యవేత్తలను బహిష్కరించారని చెపుతూ తమ కార్యక్రమం గురించి చెప్పడం జరిగింది. భారతీయ దౌత్యాధికారిని నిలిపివేయడం లేదా దౌర్జన్యానికి యత్నించడం పట్ల సిక్కుల ప్రధాన సంస్థ ఎస్‌జిపిసి నిరసన వ్యక్తం చేసింది. ఘటనను ఖండిస్తున్నట్లు సంస్థ ప్రధాన కార్యదర్శి గ్రెవాల్ ఓ ప్రకటన వెలువరించారు. గురుద్వారాలు ప్రతి మతం వారిని సాదరంగా ఆహ్వానిస్తామని , బ్రిటన్‌లోని రాయబారిని అడ్డుకోవడం తగదని తెలిపారు.

ఘటనపై బ్రిటన్ ప్రభుత్వ స్పందన ..చర్యలకు హామీ
భారత హైకమిషనర్‌ను గురుద్వారాలోకి రాకుండా చేసిన ఘటనపై వెంటనే బ్రిటన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. విషయం తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. యుకెలోని గురుద్వారాలలోకి భారతీయులకు , భారతీయ సమాజానికి ఎప్పుడు ఆహ్వానం ఉంటుంది. అడ్డుకోవడం ఇతరత్రా చర్యలతో సామాజిక మాధ్యమాలలో ప్రచారం దక్కించుకునేందుకు అతివాదభావజాలం వ్యక్తులు ఈ విధంగా వ్యవహరిస్తుంటారని, వీరిని అరికడుతామని హామీ ఇచ్చినట్లు బ్రిటన్ మీడియా తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News