Sunday, December 22, 2024

విదేశాంగ శాఖ కొత్త కార్యదర్శిగా విక్రమ్ మిస్రీ

- Advertisement -
- Advertisement -

ఉప జాతీయ భద్రత సలహాదారు (ఎన్‌ఎస్‌ఎ) విక్రమ్ మిస్రీని విదేశాంగ శాఖ కొత్త కార్యదర్శిగా నియమించినట్లు శుక్రవారం ప్రభుత్వ నోటిఫికేషన్ వెల్లడించింది. 1989 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారి విక్రమ్ మిస్రీ విదేశాంగ కొత్త కార్యదర్శిగా జూలై 15 నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. వినయ్ క్వాత్రా స్థానంలో మిస్రీ నియామకం జరిగింది. ‘వినయ్ క్వాత్రా స్థానంలో విదేశాంగ శాఖ కార్యదర్శి పదవిలో జాతీయ భద్రత కౌన్సిల్ సెక్రటేరియట్‌లో ఉప జాతీయ భద్రత సలహాదారు 1989 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారి విక్రమ్ మిస్రీ నియామకాన్ని క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది’ అని కేంద్ర సిబ్బంది మంత్రిత్వశాఖ జారీ చేసిన ఉత్తర్వు తెలియజేసింది. ఉప ఎన్‌ఎస్‌ఎగా మిస్రీ పదవీ కాలం కుదింపును కూడా కమిటీ ఆమోదించినట్లు ఆ ఉత్తర్వు తెలిపింది.

విదేశాంగ శాఖ ప్రస్తుత కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా పదవీ కాలాన్ని ఆరు నెలల పాటు గత మార్చి నెలలో పొడిగించడం గమనార్హం. అయితే, ఆ ఉత్తర్వును ఇప్పుడు సవరించారు. క్వాత్రా పదవీ కాలం జూలై 14న ముగుస్తుంది. దౌత్య వ్యవహారాల్లో మిస్రీకి అపార అనుభవం ఉంది. ఆయన ముగ్గురు ప్రధానులు ఐకె గుజ్రాల్, మన్మోహన్ సింగ్, నరేంద్ర మోడీ వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పని చేశారు. చైనాపై విదేశాంగ మంత్రిత్వశాఖలోని అత్యంత నిపుణుల్లో ఒకరైన మిస్రీ ఈ మధ్య కాలం వరకు బీజింగ్‌లో రాయబారిగా వ్యవహరించారు. మిస్రీని 2022 జనవరిలో జాతీయ భద్రత కౌన్సిల్ సెక్రటేరియట్‌లో నియమించారు. భారత, చైనా సైనిక దళాల మధ్య 2020లో తూర్పు లడఖ్‌లోను, ఆ తరువాత గాల్వన్ లోయలోను సంఘర్షణల నేపథ్యంలో చైనాలో షీ జిన్‌పింగ్ ప్రభుత్వంతోసంప్రదింపులు సాగించడంలో కూడా మిస్రీ ప్రధాన పాత్ర పోషించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News