న్యూఢిల్లీ : చైనా జాతీయ భద్రత అంశాలపై ప్రవీణుడుగా పరిగణన పొందిన దౌత్యాధికారి విక్రమ్ మిశ్రీ సోమవారం విదేశాంగ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఉప జాతీయ భద్రత సలహాదారు (ఎన్‌ఎస్‌ఎ)గా పని చేస్తున్న 1989 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారి మిశ్రీ విదేశాంగ శాఖ కార్యదర్శిగా వినయ్ క్వాత్రా స్థానంలో నియుక్తుడయ్యారు. తూర్పు లడఖ్ సరిహద్దు వివాదం దరిమిలా చైనాతో దెబ్బ తిన్న సంబంధాలు, రష్యా, ఉక్రెయిన్ పోరు పరిణామాలు సహా వివిధ భౌగోళిక, రాజకీయ సవాళ్లను అధిగమించాలని భారత్ చూస్తున్న సమయంలో 59 ఏళ్ల మిశ్రీ ఈ కీలక పదవిని చేపట్టారు.
నూతన బాధ్యతలు స్వీకరించిన మిశ్రీని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ అభినందించారు. ‘సోమవారం నూతన బాధ్యతలు స్వీకరించిన విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీకి అభినందనలు. ఆయనకు ఉత్పాదకతతో, జయప్రదంగా పదవీ కాలం సాగాలని ఆకాంక్షిస్తున్నా’ అని జైశంకర్ ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలిపారు. మిశ్రీ విదేశాంగ మంత్రిత్వశాఖ (ఎంఇఎ), ప్రధాని కార్యాలయంలోను, యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఉత్తర అమెరికాలో వివిధ భారత రాయబార కార్యాలయాల్లోను వివిధ హోదాల్లో సేవలు అందించారు. ఆయన ముగ్గురు ప్రధానులు ఇంద్ర కుమార్ గుజ్రాల్, మన్మోహన్ సింగ్, నరేంద్ర మోడీలకు వ్యక్తిగత కార్యదర్శిగా సేవలు అందించిన అరుదైన ఘనత పొందారు.
మిశ్రీ విదేశాంగ శాఖ కార్యదర్శిగా కనీసం రెండు సంవత్సరాల పదవీ కాలం ఉండనున్నది. ‘విక్రమ్ మిశ్రీ సోమవారం విదేశాంగ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. విదేశాంగ శాఖ కార్యదర్శి మిశ్రీకి ఎంఇఎ బృందం సాదర స్వాగతం పలుకుతున్నది, ఆయన పదవీ కాలం జయప్రదంగా సాగాలని ఆకాంక్షిస్తున్నది’ అని ఎంఇఎ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలిపారు. ఉప ఎన్‌ఎస్‌ఎగా నియామకానికి ముందు మిశ్రీ 2019 నుంచి 2021 వరకు చైనాలో భారత రాయబారిగా సేవలు అందించారు.