Monday, December 23, 2024

ప్రయోగశాలగా ప్రార్థనా స్థలం!

- Advertisement -
- Advertisement -

భారత దేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం ‘ఆర్యభట్ట’ అని చాలా మందికి తెలిసే వుంటుంది. కాని, ఆ ఆలోచన, ఆ కృషి శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్‌దని ఏ కొద్ది మందికో తెలిసి వుంటుంది. సైన్సు ఫలితాలను హాయిగా అనుభవించడం తప్ప, వాటి కోసం జీవితాలను అర్పించిన వారిని గుర్తుంచుకోవడం మన జనానికి ఇంకా అలవడలేదు. ఇతర గ్రహాలకు రాకెట్లు పంపుతున్నది మన శాస్త్రవేత్తలే అవి పక్కన పెట్టి, గ్రహ పూజలు చేస్తున్నది కూడా మన జనాలే! భారతీయ సమాజం వైజ్ఞానిక స్పృహతో ఎప్పుడు వ్యవహరిస్తుందో ఏమో. రష్యా స్పుత్నిక్ ఉపగ్రహం ప్రయోగించగానే, మన భారత దేశం కూడా అంతరిక్ష పరిశోధనలు ప్రారంభించాలని కలలు గన్నవారు విక్రమ్ సారాభాయ్.

ఉట్టి కలలు కనడమే కాదు, కలల్ని నిజం చేయడానికి పథకాలు వేసిన వారు. భారత ప్రభుత్వానికి తన ప్రణాళికలు సమర్పించి, ఒప్పించి 1962 లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసర్చ్ (INCOSPAR) రూపొందడానికి కారణమైన వారు. దానికి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన వారు. ఏడేళ్ళ తర్వాత 1969లో దాని పేరు మార్చి, ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ (ISRO)గా రూపుదిద్దినవారు. దానికి మళ్ళీ సలహదారుగా వెన్నుదన్నుగా నిలబడినవారు అన్నీ విక్రమ్ సారాభాయే! అటువంటి వాణ్ణి ప్రపంచం “భారతీయ అంతరిక్ష అధ్యయనానికి పితామహుడిగా గుర్తుంచుకొంది. ఈ దేశం పద్మభూషణ్ (1966), పద్మవిభూషణ్ (1972) లిచ్చి గౌరవించుకొంది. ఆ సమయం లో వైజ్ఞానిక స్పృహ గల దేశ తొలి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ ఉండడం… విక్రమ్ సారాభాయ్, హొమి జె. బాబా లాంటి ఎంతో మంది శాస్త్రవేత్తలకు స్ఫూర్తిదాయకమైంది. నెహ్రూ గొప్ప దార్శనికుడు గనుక, ఆయన తన కాలంలోనే దాదాపు అన్ని జాతీయ పరిశోధనా సంస్థలు ప్రారంభించారు. విక్రమ్ సారాభాయ్ దేశంలోనే మొట్టమొదటి రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని కేరళలోని తుంబా గ్రామంలో కొబ్బరి చెట్ల మధ్య ఏర్పాటు చేశారు.

ఆ గ్రామం తిరువనంతపురం విమానాశ్రయానికి దగ్గరగా వుంది. అక్కడే దగ్గర్లో వున్న సెంట్ మేరీ మగడెలినేస్ చర్చ్‌ని తమ ముఖ్య కార్యాలయంగా చేసుకొన్నారు. శాస్త్రవేత్తలంతా అక్కడి నుండే పని చేసేవారు. ఆ పక్కన వున్న బిషప్ ఇంటిని వర్క్ షాపుగా మార్చేశారు. దానికి ఆనుకొని వున్న పశువుల కొట్టం ప్రయోగశాల అయింది. ఆ ప్రయోగశాలలో యువ ఎపిజె అబ్దుల్ కలాం కూడా పని చేశారు. తర్వాత కాలంలో నెల్లూరు దగ్గర శ్రీహరి కోటలో ఇస్రో కేంద్రం అభివృద్ధి చెంది, ఘన విజయాలు సాధిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మారిన ఇప్పటి పరిస్థితుల్లో ప్రార్థనా స్థలాన్ని వైజ్ఞానిక ప్రయోగశాలగా మార్చడం ఎవరికైనా సాధ్యమవుతుందా? మరి ఆ రోజుల్లో విక్రమ్ సారాభాయ్ చేసి చూపారు. వైజ్ఞానిక ప్రగతి ముఖ్యం! అది సమాజానికి పని కొస్తుంది. అందరినీ కలుపుతుంది. మత విశ్వాసాలది ఆ తర్వాతి స్థానం. అవి వ్యక్తిగతం. వేరు వేరు మతాలు, వేరు వేరు విశ్వాసాలు, అవి జనాన్ని విడదీసేవి.

12 ఆగస్టు 1919న విక్రమ్ సారాభాయ్ ఒక సంపన్న వ్యాపార కుటుంబంలో పుట్టారు. తండ్రి అంబాలాల్ సారాభాయ్ అహ్మదాబాద్‌లో పెద్ద వ్యాపారస్థుడు. విక్రమ్ తలిదండ్రులు ప్రారంభించిన రిట్రీట్ స్కూల్లోనే చదివి ఆ తర్వాత అహ్మదాబాద్ కళాశాలలో భౌతిక శాస్త్రం చదివాడు. కాదలుచుకుంటే ఆయన దేశంలో పెద్ద పారిశ్రామిక వేత్త కాగలిగేవాడు. కుటుంబమే పెద్ద పారిశ్రామిక కుటుంబం. పైగా, స్వాతంత్య్ర సమరంలో చురుకుగా పాల్గొన్న కుటుంబం. కాని, యువ సారాభాయ్ అభిరుచి గణితం, భౌతిక శాస్త్రాలపై వుండేది. అందుకే ఇంగ్లాండు వెళ్ళి 1937 లో సెయింట్ జోన్స్ కళాశాలలో ఆ విషయాలతోనే మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నాడు. ఇరవై నాలుగవ ఏట చిన్న వయసులో కేంబ్రిడ్జి నుండి డాక్టరేట్ తీసుకొని స్వదేశం తిరిగొచ్చారు. 1943లో విక్రమ్ సారాభాయ్ తన ఇరవై నాలుగో ఏట కశ్మీర్‌లో హిమాలయాల మీదికి వెళ్ళారు.

ఎత్తయిన ప్రదేశాలలో (HIGH ALTITUDE )లో సూర్య కిరణాల (COSMIC RAYS) ప్రభావం ఎలా వుంటుందో పరిశోధన చేయాలన్నది ఆయన ఆశయం. ఎంతో ఉత్సాహంగా ఉద్వేగభరితంగా సాగిన ఆ అధ్యయనం ఆయనలో ఒక కొత్త కోరికకు బీజం వేసింది. సూర్య కిరణాలపై పరిశోధన కోసం ప్రత్యేకించి ఒక ప్రయోగశాలను నెలకొల్పాలని ఆయనకు అనిపించింది. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలయ్యాక, విక్రమ్ సారాభాయ్ బెంగళూరులోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌లో చేశారు. అప్పుడు అది ప్రసిద్ధ శాస్త్రవేత్త సి.వి. రామన్ నేతృత్వంలో పని చేస్తూ వుంది. రామన్ సహచర్యంలో సారాభాయ్ అనేక విషయాలు గ్రహించి బాగా రాణించారు. కాస్మిక్ కిరణాలపై ప్రారంభించిన ఆయన పరిశోధనలకు హోమి జె బాబా కూడా తన సహాయ సహకారాలు అందించారు.

ఆ తరువాత సారాభాయ్ అహ్మదాబాద్‌లో ఫిజికల్ రీసర్చ్ లెబోరెటరీ ప్రారంభించారు. దాంతో అంతరిక్షానికి, కాస్మిక్ రేస్‌కి సంబంధించిన పరిశోధనలు దేశంలో ప్రారంభమయ్యాయి. 1955లో కశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌లో ఆ సంస్థకు సంబంధించిన మరో శాఖను ప్రారంభించినపుడు దానిని అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభించారు. అలాగే కొడైకనాల్, తిరువనంతపురాలలో కూడా వెంట వెంటనే సారాభాయ్ శాఖలు ప్రారంభించారు. ఈ రోజు మన దేశం అంతరిక్ష రంగంలో దూసుకుపోతూ వుందంటే దానికి కారణం విక్రమ్ ఎ. సారాభాయే! అయితే ఆయన చేసిన కృషి ఫలితాలనిచ్చే సమయానికి ఆయన లేకుండా పోయారు. భారతదేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం ‘ఆర్యభట్ట’ శాటిలైట్ ఇన్‌స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్‌పరిమెంట్ (సైట్) రెండూ ఆయన మరణానంతరం ఉపయోగంలోకి వచ్చాయి.

తుంబా రాకెట్ ప్రయోగశాల నుండి ఆ ఉపగ్రహం ప్రయోగింపబడి వివిధ స్థాయిలలో దూరదర్శన్ ద్వారా విద్యా కార్యక్రమాలు ప్రసారం కావడం మనకు తెలుసు. 197576లలో SITE తొలి దశలో 2.400 భారతీయ గ్రామాలలోని ఐదు మిలియన్ల ప్రజానీకానికి విద్యా కార్యక్రమాలను అందించింది. ఈ రోజు దేశంలో కేబుల్ కనెక్షన్‌తో టెలివిజన్ లేని ఇల్లు వుండదేమో. దేశ ప్రజలకు కేబుల్ టివి అందుబాటులోకి రావడానికి కారకుడు కూడా విక్రమ్ సారాబాయే. ఆయన అమెరికాలోని నాసా పరిశోధనా కేంద్రం సలహా సంప్రదింపులతో సైట్‌కి 1975లో రూపకల్పన చేసినందు వల్లే కేబుల్ టివి ద్వారా ఇప్పుడు వందల చానళ్ళు చూడగలుగుతున్నాము.

అంతరిక్ష రంగానికి సంబంధించి ఎన్ని ప్రయోగాలు చేసినా సారాభాయ్ తన ధ్యేయాన్ని మరవలేదు. సూర్య కిరణాలపై తను చేయదలిచిన పరిశోధన కొనసాగిస్తూనే వచ్చారు. కాస్మిక్ రేస్ (సూర్య కిరణాలు) అంతరిక్షం నుండి భూమిపైకి ప్రసరించే ఒక శక్తి ప్రవాహం. ఇవి సూర్యునితోనూ, పర్యావరణంతోనూ, అయస్కాంత శక్తితోనూ ప్రభావం చెందుతూ వుంటాయి. అంతేకాదు కిరణాలు గ్రహాల మధ్య ప్రసరిస్తున్నప్పుడు కూడా అవి మరింత ప్రభావానికి లోనవుతాయి. సూర్య కిరణాలపై జరిపే పరిశోధనల మూలంగానే పర్యావరణాన్ని గురించి, భూ అయస్కాంత స్థితి గురించి, సూర్యుడి నైజం గురించి, విశాంతరాళం గురించి అనేక విశేషాలు బయటపడతాయని సారాభాయ్ చిన్న వయసులోనే ఊహించారు.

పరిశోధన ప్రారంభించారు. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు దేశంలో అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఫిజికల్ రీసర్చ్ లాబొరేటరీ, ఇస్రోలే కాక, ఆయన మరి కొన్ని సంస్థలను కూడా రూపకల్పన చేశారు. టెక్స్‌టైల్ పరిశ్రమను ఆధునీకరించేందుకు ఓ సంస్థ అతిర, యాజమాన్య నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్; విజ్ఞాన శాస్త్ర ప్రాచుర్యానికి ఓ సంస్థ; హైదరాబాద్‌లో ఇసిఐఎల్; జార్ఖండ్‌లో యురేనియం కార్పొరేషన్ మొదలైనవన్నీ ఆయన పథకం ప్రకారమే వెలుగు చూశాయి. హోమి.జె. బాబా మరణానంతరం అణు పరిశోధనా సంస్థ బాధ్యతలు కూడా సారాభాయ్ నిర్వహించారు. అణు పరిశోధనా రంగంలో, అంతరిక్ష పరిశోధనా రంగంలో మన దేశం ముందంజ వేసిందంటే అందుకు కారణం హోమి.జె. బాబా విక్రమ్ అంబాలాల్ సారాభాయ్; టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసర్చ్ నెలకొల్పి దేశాన్ని అణు పరిశోధనా రంగం వైపు మరల్చింది హోమి జె. బాబా అయితే, ఫిజికల్ రీసర్చ్ లాబోరేటరీ నెలకొల్పి దేశాన్ని అంతరిక్ష పరిశోధన వైపు మరల్చింది విక్రమ్ సారాభాయ్. దేశానికి అత్యుత్తమ వైజ్ఞానిక సేవలందించడంలో వీరిద్దరికీ కొన్ని పోలికలున్నాయి.

విక్రమ్ సారాభాయ్ (12 ఆగస్టు 1919 30 డిసెంబర్ 1971) భార్య మృణాళినీ సారాభాయ్ (11 మే 1918 21 జనవరి 2016) ప్రపంచ ప్రఖ్యాతి పొందిన నర్తకి. ఆమె కేరళ/ తమిళనాడులో పుట్టారు. బాల్యం స్విట్జర్లాండ్‌లో గడిపారు. పాశ్చాత్య నృత్యం అభ్యసించారు. వారిది కూడా స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబమే. తండ్రి సుబ్బరామ స్వామినాథన్ మద్రాస్ హైకోర్టులో లాయరు. తల్లి అమ్ము స్వామినాథన్ స్త్రీ హక్కుల నేత. లోక్‌సభలోనూ, రాజ్యసభలోనూ పార్లమెంటు మెంబర్‌గా వున్నారు. మృణాళినీ సారాభాయ్ అక్క లక్ష్మి, సుభాస్ చంద్రబోస్ ఆర్మీలో మహిళా రెజిమెంట్‌కు సారథ్యం వహించిన కెప్టెన్. ‘కెప్టెన్ లక్ష్మీ’గా ప్రసిద్ధురాలు. ఈ ఇద్దరు అక్కా చెళ్ళెళ్లూ భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ, పద్మభూషణ్‌లు స్వీకరించారు. మృణాళిని విక్రమ్ సారాభాయ్ దంపతుల కుమార్తే నర్తకి, నటి, సామాజిక కార్యకర్త మల్లికా సారాభాయ్. కొడుకు కార్తికేయ సారాభాయ్ పర్యావరణ పరిరక్షణ శాఖలో శాస్త్రవేత్త. విక్రమ్ సారాభాయ్ కన్నా మృణాళిని సంవత్సరం పైగా పెద్దది. ఆయన శాస్త్రవేత్త అని తెలియకుండానే ఆయన ఊటిలో టెన్నిస్ ఆడుతుండగా చూసి, ఆయనలోని క్రీడా నైపుణ్యానికి, స్ఫూర్తికి ముచ్చటపడ్డారు. తర్వాత ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది.

తను చేయదలచుకొన్న కార్యక్రమాలు చాలా వున్నాయని అందువల్ల పెండ్లి చేసుకోబోవడం లేదని చెప్పిన విక్రమ్, ఆరు నెలల తర్వాత ఆమెతో పెండ్లికి ఒప్పుకొన్నారు. కేరళలో పుట్టిన మృణాళిని భర్తతో పాటు అహ్మదాబాద్‌లో స్థిరపడి, అక్కడే కన్నుమూశారు. అహ్మదాబాద్‌కు చెందిన విక్రమ్ సారాభాయ్ కేరళ కోవలం బీచ్‌కు దగ్గర్లో కన్నుమూశారు. అయితే ఆరోగ్యంగా వున్న శాస్త్రవేత్త 52 ఏళ్ళకే అకాల మరణం చెందడం వివాదాస్పదమైంది. కారణాలేవైనా విచారణ జరుగలేదు. సుభాస్ చంద్రబోస్, లాల్ బహద్దూర్ శాస్త్రిల మరణాల వలే వీరి మరణం గూర్చి కూడా పూర్తి వివరాలు తెలియవు. ఏమైనా సైన్సుకూ, సమాజానికీ ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ ప్రపంచ వ్యాప్తంగా అనేక గౌరవాలు, పురస్కారాలు ప్రకటింపబడ్డాయి. ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్ ఆయన పేరు పెట్టుకొని గౌరవించింది. భారతీయ వైజ్ఞానిక రంగం కొత్త పుంతలు తొక్కడానికి నాంది పలికిన సారాభాయ్, మహోన్నత వ్యక్తిత్వంతో వైజ్ఞానిక దార్శనికుడుగా దేశానికి చేసిన సేవ ఎనలేనిది. మహాత్మా గాంధీ, విక్రమ్ సారాభాయ్ గుజరాత్‌కు చెందిన వారే. కాని ఇప్పుడు దేశాన్ని అమ్ముతున్న గుజరాత్ ప్రముఖులతో వారికి పోలికే లేదు. అహింసకు, మానవత్వానికి ప్రతీకగా నిలిచిన జైన మతం పాటించింది సారాభాయ్ కుటుంబం. మరి ఇప్పుడు మతం పేరుతో మనుషుల్ని నరుకుతున్న ఈ రాజకీయాలను ఏమనాలో తెలియడం లేదు. కుహనా దేశభక్తుల్ని మట్టి కరిపించి, సారాభాయ్ లాంటి దేశ భక్తుల్ని గుర్తు చేసుకోవాల్సి వుంది.

డా. దేవరాజు మహారాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News