పల్లెల సాధికారికతకే పంచాయతీరాజ్
బీహార్ సభలలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు
పేదలకు చేరితేనే ప్రగతి ఫలాలు పరిపూర్ణం
న్యూఢిల్లీ : గ్రామాలను తీర్చిదిద్దితేనే భారతదేశం సమగ్ర రీతిలో అభివృద్ధి చెందుతుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. బీహార్‌లోని మధుబనిలో రూ 13,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన సందర్భంగా గురువారం ఆయన మాట్లాడారు. ఇదే క్రమంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం కూడా కావడంతో ఈ రోజు ప్రత్యేకతను వివరించారు. బీహార్‌లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారధ్యపు ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాల పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
సంపన్న బీహార్ సుసంపన్న భారత్‌కు దారితీస్తుంది. ప్రగతి ఫలాలు పేదలకు నేరుగా చేరేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని,ఈ దిశలోనే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం అభినందనీయం అన్నారు. పల్లెల ప్రగతితో, ఇక్కడి సాధికారికతతోనే భారతదేశ వికాసం సాధ్యమని , లేకపోతే లక్ష సాధన కష్టమని జాతిపిత మహాత్మా గాంధీ చెప్పిన మాటలను ఆయన ప్రస్తావించారు. ఈ బీహార్ నేల నుంచే గాంధీ జీ అప్పట్లో తమ సత్యాగ్రహ మంత్రాన్ని బలోపేతం చేసుకున్నారు. ఈ విధంగా బీహార్‌కు ప్రత్యేకత ఉందన్నారు గ్రామాలు బలీయంగా ఉంటే దేశం జాతి పటిష్టం అవుతుందనేది గాంధీజి విశ్వసించిన సత్యం అని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు రైతులు వెన్నెముక వంటి వారు.
జాతి ఆత్మ విశ్వాసంతో నిటారుగా నిలబడటానికి వ్యవసాయదార్లు, గ్రామీణ పేదల అంకిత భావం ఆయువుపట్టు అవుతుందని తెలిపారు. గ్రామీణ స్వరాజ్యమే పంచాయతీ రాజ్ అంతర్భాగం అని తెలిపారు. సామూహిక జనజీవనానికి పంచాయతీరాజ్ ప్రాతిపదిక అవుతుంది. ఈ పునాది ఉండాల్సిన స్థాయిలో బలీయంగా ఉండాల్సిందే. లేకపోతే యావత్తూ వ్యవస్థ బలహీనపడుతుందని అభిప్రాయపడ్డారు. సామాజిక విప్లవానికి పంచాయతీరాజ్ కీలక భూమిక పోషించిందని చెప్పారు. బీహార్ అన్ని రంగాలలో గణనీయ ప్రగతిని సాధిస్తోంది. ధర్బాంగలో ఎయిమ్స్ స్థాపన జరుగుతుందని, నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. మోడీ పర్యటన దశలోనే గురువార నాలుగు కొత్త రైళ్లకు పచ్చజెండా చూపారు. ఈ విధంగా రాష్ఠ్రంలో మరిన్ని గ్రామాలకు సరికొత్తగా రైలు మార్గాలు ఏర్పడుతాయి. బీహార్ అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరుగుతాయి.