Monday, December 23, 2024

తెలంగాణలో ఉత్తమ గ్రామీణాభివృద్ధి

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వ సుపరిపాలన, స్థానిక సంస్థల సమష్టి కృషితో గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం యావత్ భారత దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్రానికి వస్తున్న అవార్డులే చెప్తున్నాయి. ఎందుకంటె దేశంలోనే మరెక్కడాలేని విధంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో నర్సరీలు, డంపింగ్ యార్డ్, వైకుంఠధామం, హరితహారం అమలు, పల్లె ప్రకృతి వనాలు, ఇంటింటికి శుద్ధి జలాలు లాంటి వివిధ అంశాలను ప్రాతిపదికగా చేసుకొని కేంద్రం అందించే అవార్డులు తెలంగాణకు రావటం హర్షణీయం, దీనికి కారణం పల్లె ప్రగతి కార్యక్రమమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటికీ నుండి చూస్తే 2015 నుండి 2022వ సంవత్సరం వరకు ఏకంగా తెలంగాణ రాష్ట్రం 79 జాతీయ గ్రామీణ అవార్డులను వివిధ అంశాలలో సాధించింది. గత సంవత్సరం 2022లో సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన కింద దేశవ్యాప్తంగా 20 ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేయగా, అందులో 19 అవార్డులు తెలంగాణకే వచ్చాయంటే పల్లె ప్రగతి ఫలితాలు ఎలా ఉన్నాయో అందరికి అర్ధం అవుతుంది.

అలాగే స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులలోనూ తెలంగాణ రాష్ట్రమే అగ్రతాంబూలం దక్కించుకుంది. గ్రామీణ ప్రాంతాలలోని అంశాలన్నీ చూస్తే తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భించిన అనంతరం 7.7% పచ్చదనం పెరిగింది. తెలంగాణ 2014లో తలసరి ఆదాయం రూ.1, 24,000 ఉండగా, అది నేడు మూడు రెట్లు పెరిగి మూడు లక్షల 17 వేలకు పెరిగింది. రైతుబంధు అమలుతో వ్యవసాయ భూముల విలువ గణనీయంగా పెరిగింది. దేశంలో 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో 65 వేల కోట్ల రూపాయలను జమ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది. పల్లె ప్రగతి కార్యక్రమం కింద తెలంగాణలో ఇప్పటివరకు రూ. 14 వేల 235 కోట్లు ఖర్చు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అధికార వికేంద్రీకరణతో ప్రజలకు పాలనను మరింత చేరువ చేయవచ్చని, నిశిత పర్యవేక్షణతో అద్భుత ఫలితాలు అందించవచ్చనే సంకల్పంతో ప్రభుత్వం నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. ఇది వరకు 8796 గ్రామ పంచాయితీలు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 12,769 చేశారు. కొత్త గ్రామ పంచాయితీల ఏర్పాటుతో గిరిజన తండాలు గూడెం వాసుల దశాబ్దాల కాలం నాటి స్వయంపాలన కల నెరవేరిందని విశ్లేషకుల అభిప్రాయం.

పరిపాలన సౌలభ్యం కోసం గ్రామ పంచాయితీల తరహాలోనే 10 జిల్లాలను 33 జిల్లాలకు, 68 మున్సిపాలిటీలను 142 మున్సిపాలిటీలుగా చేయడం, కొత్తగా 50 రెవెన్యూ డివిజన్లు 140 మండలాలను ఏర్పాటు చేయడం పరిపాలన అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రతిరూపం. కేంద్రం కేటాయిస్తున్న నిధులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పల్లె ప్రగతి కింద గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తుండడంతో తెలంగాణ పల్లెలు అన్ని మౌలిక సదుపాయాలను సంతరించుకుంటూ, జాతీయ అవార్డులను సాధిస్తున్నాయి. ఈ విధంగా కేంద్ర నిధులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసి గ్రామాల అభివృద్ధికి తోడ్పడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.

గ్రామాలను పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉట్టిపడేలా కృషి చేస్తున్నారని, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కార్యక్రమాల ద్వారా గ్రామాల్లోని చెరువులను పునరుద్ధరించి, ఎల్లవేళలా జలకళతో నిండుగా ఉండేలా చూడడం కూడా పల్లెల గ్రామీణ అబివృద్ధికి దోహదపడింది. ‘దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతి సతత్ వికాస్ పురస్కార్’ పేరిట పల్లెల అభివృద్ధి విభాగాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో తెలంగాణ సత్తా చాటింది. దేశ వ్యాప్తంగా 2.5 లక్షల గ్రామ పంచాయతీలు ఈఅవార్డుల కోసం పోటీపడగా, 46 అవార్డులు దక్కించుకున్న మొత్తం గ్రామాల్లో 13 గ్రామాలు తెలంగాణకే చెందినవి కావడం విశేషం. తెలంగాణ పంచాయతీలు పచ్చదనం, పరిశుభ్రతతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలతో దేశంలోనే అత్యున్నత స్థాయిలోనిలిచి, ఎనిమిది విభాగాల్లో తెలంగాణ అవార్డులను సాధించడం విశేషం.

అవార్డుల్లో 30 శాతం రాష్ట్రమే కైవసం చేసుకున్నది. ఈ 13 ర్యాంకుల్లోంచి కూడా నాలుగు ఫస్ట్ ర్యాంకులు తెలంగాణకే రావడం గొప్పవిషయం. ఐదంచెల పరిపాలన వ్యవస్థలో ప్రజా ప్రతినిధులు తమ బాధ్యతలను గుర్తెరిగి సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తే దేశంలో మరిన్ని విజయాలను విజయాలను సాధించవచ్చు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డులు సాధించిన గ్రామ పంచాయతీలకు కనీసం 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షల రూపాయల చొప్పున అదనపు నిధులు కేటాయిస్తే మరింత అభివృద్ధి చెందుతాయి. దీనివల్ల అవార్డులు సాధించిన పాలక వర్గాలను ప్రోత్సహించినట్లు అయి, ఇతరులకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి వివిధ రంగాల్లో వస్తున్న అవార్డులే గ్రామీణ అభివృద్ధిలో ఏ విధంగా ప్రభుత్వం ఉత్తమ విధానాలు ఎలా పాటిస్తుందో తెలుస్తుంది. భవిష్యత్తులో మరిన్ని గ్రామాలు ఉత్తమ గ్రామాలుగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. దీనికి ప్రజల భాగస్వామ్యం మరింత అవసరం.

డా. కందగట్ల శ్రవణ్ కుమార్
8639374879

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News