తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తీసుకున్న రెండు కార్యక్రమాలు పల్లెల భౌతిక స్వరూపాన్ని మార్చి వేశాయి. పల్లె ప్రగతి, హరిత హారం కార్యక్రమాలు అమ లు చేయడంతో పల్లెల పర్యావరణంలో (village ecosystem) విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. తెలంగాణ పల్లెలు దేశానికి తలమానికమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేస్తే సింహ భాగం తెలంగాణదే. కొన్నిసార్లు మొదటి పది స్థానాలు మనమే సాధించాం. నూతన రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇంతటి అభివృద్ధి సాధించడం మనకు గర్వకారణం. ఒకప్పుడు వెనకబడిన ప్రాంతాల జాబితాలో ఉన్న తెలంగాణ ప్రాంతం ఇవాళ దేశంలో వేగంగా అభివృద్ధిచెందుతున్న రాష్ట్రాల సరసననిలబడింది. వెనకబాటుతనం నుండి ముందు వరసలో గ్రామాల నిలబడడం వెనుక జరిగిన కృషి అమోఘం.
మెదక్ జిల్లా కౌడిపల్లిలో 2015 ఆగస్టు 23న ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం మొదలైంది. ఈ ఏడేళ్లలో తెలంగాణ గ్రామాల రూపురేఖల్ని మార్చివేసింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ ప్రభుత్వం పల్లెలు, పట్టణాల అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళికలకు శ్రీకారం చుట్టింది. అప్పటికే తెలంగాణలో పట్టణ జనాభా వేగంగా పెరుగుతున్నది.ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పల్లెలు, పట్టణాలను ఏకకాలం లో అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి కార్యాచరణ రూపొందించింది. వాటిని అమలు చేయడంలో ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగంలో చిత్తశుద్ధి కనిపిస్తుంది. మహాత్మాగాంధీ చెప్పినట్లు పల్లెలు స్వయం సమృద్ధి సాధించినప్పుడే గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుంది. ఆయన మాటల్ని నినాదప్రాయంగా చెప్పి వదిలేసిన వారు అనేక మంది ఉన్నారు.కానీ సిఎం కెసిఆర్ సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లారు. పల్లెల కనీస అవసరాలు తీర్చడానికి సంకల్పించారు. వసతుల కల్పనా ప్రాధాన్యతను గుర్తించారు.
గత పంచాయతీ రాజ్ చట్టంలో ఉన్న లొసుగులు తొలిగించి కొత్త చట్టాన్ని రూపొందించారు. గ్రామంలో జరిగే అభివృద్ధికి, లోపాలకు సర్పంచిని కూడా జవాబుదారుడిగా చేశా రు. చట్టంలో వచ్చిన ఈమార్పు వల్ల ప్రజాప్రతినిధుల బాధ్యత మరింత పెరిగింది. ఇక్కడే పాలకుడి కార్యదీక్ష, అభివృద్ధి కాంక్ష, కచ్చితమైన భవిష్యత్తు ప్రణాళిక కనిపిస్తుంది. గాంధీజీ చెప్పినట్టు ఒక గ్రామం స్వయం సమృద్ధి సాధించాలంటే చేరుకోవాల్సిన లక్ష్యాలను నిర్దేశించారు. ప్రణాళికలు రూపొందించి ఆచరణలో పెట్టారు. ఒక గ్రామానికి అవసరమైన అధికారులు, సిబ్బందిని నియమించారు.ప్రతి గ్రామానికి పంచాయతీ సెక్రటరీ నియామకంతో గ్రామాల పరిపాలన వ్యవస్థ గాడిలో పడింది. గ్రామాధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి అభివృద్ధిలో భాగస్వామ్యంకావడం పల్లెల ప్రగతి వేగాన్ని పెంచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకే జమ చేయడం వల్ల పంచాయితీల పరిపాలనలో స్వతంత్రత పెరిగింది. గ్రామీణ గణతంత్రం దిశగా తెలంగాణ పల్లెలు సమృద్ధి సాధిస్తున్నాయి.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రతి గ్రామానికి ఒక వాటర్ ట్యాంకర్, తడి, పొడి చెత్తను సేకరించే ట్రాలీలను ఏర్పాటు చేసింది. పారిశుద్ధ సిబ్బంది ద్వారా చెత్త సేకరణ డంపింగ్ స్టేషన్‌కు చేర్చడం క్రమంతప్పకుండా నిర్వహించడంతో గ్రామాలన్నీ పరిశుభ్రంగా తయారయ్యాయి.పెట్టిన మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించే బాధ్యతే తీసుకున్నారు. క్రమం తప్పకుండా ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేసి హరిత హారాన్ని విస్తృతంచేశారు. ఫలితంగా అన్ని గ్రామాల్లో రోడ్డుకు ఇరువైపులా పచ్చదనం పలకరిస్తున్నది. గ్రామాలు అంటే అభివృద్ధికి ఆమడదూరం అనే అభిప్రాయాన్ని ప్రభుత్వం ఈ ఏడేళ్లలో తుడిచివేసింది. పల్లెలు, పట్టణాలతో పోటీపడుతూ అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో వసతుల కల్పనతో గతంలో ఉన్న అనేక ఇబ్బందులు తొలగిపోయాయి. ప్రజలు సౌకర్యవంతంగా పల్లెల్లో జీవించే వాతావరణం ఏర్పడింది.19,472 పల్లె ప్రకృతి వనాల నిర్మాణం చేశారు. రాష్ట్రంలో గత నాలుగు సంవత్సరాలలో 31,781 డంప్ యార్డుల నిర్మాణం చేయడం అంటే సాధారణమైన విషయం కాదు. రాష్ట్రంలో 12,745 గ్రామాలు ఉంటే చాలా గ్రామాల్లో శ్మశాన వాటికలు ఉండేవి కావు.
ఎవరైనా చనిపోతే వారి అంత్యక్రియలు జరపాలంటే వివక్ష, ఆంక్షలు ఉండే వి. ఈ పరిస్థితిని మార్చారు. ప్రతి గ్రామంలో ఆధునిక వసతులతో వైకుంఠ ధామాన్ని నిర్మించారు. నాలుగేళ్లలోనే ఇంతటి అభివృద్ధి సాధించి చరిత్ర సృష్టించారు. గత కాలపుగాయాలు తుడిచేస్తూ గ్రామాభ్యుదయాన్ని భుజాన వేసుకున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఒకప్పుడు పల్లెలు అనగానే ప్రజల వలసలు, వెతలు గుర్తుకువచ్చేవి. దశాబ్దాలుగా వెనక పడేయబడ్డ తెలంగాణను తొమ్మిదేళ్లలోనే ప్రగతి పథంలో నడిపించడానికి ఉద్యమస్ఫూర్తితో నిరంతరం శ్రమించారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. స్వల్ప కాలంలోనే తెలంగాణ ప్రభుత్వం ఈ ఘనత సాధించింది. వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్‌తో పంట దిగుబడి అనేక రెట్లు పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం ఎండబెట్టుకోవడానికి సుమారు 23 వేల కల్లాలు నిర్మించారు.
రెండు వేల ఆరు వందల వరకు రైతు వేదికల నిర్మాణం జరిగింది. ఇది గ్రామీణుల ప్రధాన వృత్తి అయిన వ్యవసాయ రంగానికి, దానిపై ఆధారపడిన ప్రజలకు అందించిన చేయూత. గ్రామాలు ఆహారపు ఉత్పత్తిలో స్వావలంబన సాధించాయి.పెరిగిన పచ్చదనంతో పర్యావరణ స్థిరత్వం వచ్చింది.రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన కనీస సౌకర్యాలలో కొన్నింటిని పరిశీలిస్తే తెలంగాణ పల్లెలు ఎంత ఆధునికరించబడ్డాయో అర్థం అవుతుంది. పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, వైకుంఠ ధామాలు, చెత్త సేకరణ కేంద్రాలు, కొన్ని ప్రాంతాలలో సేకరించిన చెత్త నుండి వర్మి కంపోస్ట్ తయారు చేసే యూనిట్లు, ప్రతి గ్రామానికీ ఒక నర్సరీ, ప్రతి గ్రామంలో విరిగిన, శిథిలావస్థలో ఉన్న కరెంటు స్తంభాల స్థానంలో కొత్త స్తంభాల ఏర్పాటు, మిషన్ భగీరథ తాగు నీరు, నిండుకుండ లాంటి చెరువులు నిర్మాణమయ్యాయి.
విద్యుత్ షాక్ లతో జరిగే ప్రమాదాలను నివారించడానికి ‘పవర్ డే’ ను ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ప్రమాదకంగా పరిణమించిన కరెంటు స్తంభాలను తొలగించి కొత్త వాటిని వేశారు. దీంతో విద్యుత్ వల్ల కలిగే ప్రాణనష్టం గణనీయంగా తగ్గింది. రాత్రి పూట కరెంటు కోసం బావుల దగ్గరకు వెళ్లే అవసరం లేదిప్పుడు. నూతన సౌకర్యాలతో అరిగోస పడిన పల్లె ప్రజల కష్టాలు తీరినాయి. గొప్ప మార్పులతో గ్రామీణ ప్రజల ఆరోగ్య రక్షణ, భద్రతను మెరుగుపడింది. ఒకటికి బదులుగా రెండు పంటలు పండిస్తుండడంతో రైతులకు ఆర్థిక సమృద్ధి సాధిస్తున్నారు. ఒకప్పుడు కన్నీటిధారల కడగండ్లు, నెర్రలు వారిన నేలలు ఇవ్వాళ అలుగుదుకుతున్న నీళ్లతో పచ్చని పంటలతో హరిత వర్ణాన్ని సంతరించుకున్నాయి. వెలవెల బోయిన రోజులను మరిపిస్తూ నేడు పల్లెలు కళకళలాడుతున్నాయి. ప్రజల స్వప్నం సాకారం కావాలంటే పాలకుడికి దృఢమైన సంకల్పం ఉండాలి. రాష్ట్ర పునర్ నిర్మాణం సఫలమవుతున్నదని, పల్లెల ప్రగతితో దేశానికే దిక్సూచిగా మన రాష్ట్రం నిలబడింది.