నిజామాబాద్ సిటీ: మత సామరస్యానికి ప్రతీక ఊర పండుగని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఈ పండుగను ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా తాను కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని ఖిల్లా ప్రాంతంలో నెలకొల్పిన దేవతామూర్తులకు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవతామూర్తుల ఊరేగింపులో ఆయన పాల్గొన్నారు.
ఈ సం దర్భంగా అర్బన్ ఎమ్మెల్యే బిగాల మాట్లాడుతూ దృష్టా శక్తులు, అంటు వ్యాధులు ప్రబలకుండా, వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధ్దిగా పండి నిజామాబాద్ నగర ప్రజలు సుఖ శాంతులతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని పండుగలకు సమ ప్రాధాన్యతను ఇస్తుండటంతో ప్రజలు శాంతియుత వాతావరణంలో సంతోషంగా జరుపుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.