Thursday, January 23, 2025

ఉద్యమిస్తేనే ఉషోదయం..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ పేరుకు మాత్రమే పార్టీ అని, భారతదేశ పరివర్తనే దీని అసలు లక్ష్యమని, యావత్ భారతదేశం పరివర్తన చెందాల్సిన అవసరముందని, భారతదేశం ఎందుకు పరివర్తనం చెందాల్సిన అవసరముందో మీకు సులభంగా అర్థమయ్యేలా వివరిస్తానని కెసిఆర్ తెలిపారు. సోమవారం తెలంగాణ భవన్‌లో బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమక్షంలో సోలాపూర్ నియోజకవర్గ గ్రామ సర్పంచ్‌లు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పార్టీ అధినేత కెసిఆర్ వారికి గులాబి కండువాలు కప్పి సాదారంగా పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రంలా మహారాష్ట్ర మరో వెలుగుజిలుగుల రాష్ట్రంగా అవతరించాలని ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ పార్టీలో చేరిన సర్పంచ్‌లు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కెసిఆర్ వారిని ఉద్ధేశించి మాట్లాడుతూ మహారాష్ట్ర గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు చాలా వింతగా అనిపిస్తుంటుందన్నారు.

దేశ ఆర్థిక రాజధానిగా ఖ్యాతిగాంచిన ముంబైతో పాటు మరెన్నో పెద్ద పెద్ద నగరాలు, పరిశ్రమలు, సహజవనరులు కలిగిన మహారాష్ట్రలో సంపదకు కొదువ లేదని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ఎన్నో నదులు మహారాష్ట్రలో పుడుతున్నాయి. పెద్ద నదులైన గోదావరి, కృష్ణా నదులు మహారాష్ట్రలో పుట్టి, అక్కడి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల మీదుగా ప్రయాణిస్తూ సముద్రంలో కలుస్తాయి. పంచగంగ, వెన్‌గంగ, మూల, ప్రవర, వార్దా వంటి రెండు డజన్లకు పైగా నదులు మహారాష్ట్రలో ప్రవహిస్తున్నాయన్నారు. కానీ, మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తాగడానికి సరిపడా నీళ్లు లేవని కెసిఆర్ వాపోయారు. మహారాష్ట్రలో ఎన్నో చోట్ల 20,22, 25 గజాల లోతున ఉన్న నీటి కోసం అక్కాచెల్లెల్లు తాళ్లతో బావుల్లోకి దిగుతూ ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారన్న సంఘటనలను తాను సోషల్ మీడియాలో గమనిస్తున్నానని, ఇలాంటి దుస్థితి ఎందుకుందో మహారాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలని కెసిఆర్ సూచించారు.

తెలంగాణ తప్ప తాగునీటికి ఏ రాష్ట్రంలోనూ పరిపూర్ణ వ్యవస్థ లేదు
మన దేశంలో తాగునీటికి సరైన వ్యవస్థ లేదని కెసిఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం మినహాయించి తాగునీటికి ఏ రాష్ట్రంలోనూ పరిపూర్ణ వ్యవస్థ లేదన్నారు. దేశంలో తాగునీరు లేదా ? దేశ తాగునీటి అవసరాలకు మించి రెట్టింపు నీటి వనరులను భగవంతుడు మన దేశానికి సమకూర్చాడని కెసిఆర్ పేర్కొన్నారు. భారతదేశంలో 1 లక్ష 40 వేల టిఎంసిల వర్షపాతం సంభవిస్తుందని, దీంట్లో సగం నీరు భాష్పీకరణ ద్వారా పోగా 70 వేల టిఎంసిల నీరు భారతదేశంలోని నదుల్లో ప్రవహిస్తుందన్నారు. ఇప్పటిదాకా దేశం 19 వేల టిఎంసిల నీటిని మాత్రమే వినియోగించుకుంటున్నా మని, మిగిలిన 51 వేల టిఎంసిల నీరు మనందరి సమక్షంలోనే సముద్రాల్లో కలుస్తుందన్నారు. ఒకవైపు నీరు సముద్రాల్లో కలుస్తూనే ఉంటారని, మరోవైపు మహారాష్ట్రలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉంటారని, ఈ సంఖ్య పెరుగుతూనే ఉందని, ఒకప్పుడు రోజుకు ఆరుగురు దాకా రైతులు ఆత్మహత్య చేసుకునేవారని, ఈ సంఖ్య నేడు 8, 9 కి చేరుకుందన్నారు.

మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ ను అమలు చేయాలి
మొదటిసారి నాందేడ్‌లో జరిగిన సభకు తాను హాజరైనప్పుడు నాటి మాజీ ముఖ్యమంత్రి, నేటి ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మీకు ఇక్కడేం పని అని ప్రశ్నించారని కెసిఆర్ తెలిపారు. అప్పుడు మీరు మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ ను అమలు చేస్తే తాను వెంటనే మధ్యప్రదేశ్‌కు వెళతానని స్పష్టం చేశాను. ఆయన నుంచి ఇప్పటికీ సమాధానం రాలేదు. ఔరంగాబాద్ డివిజన్ కమిషనర్ కేంద్రేకర్ అనే ఐఎఎస్ అధికారి ఇప్పటికే 70 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరో 1 లక్ష మంది రైతులు అదే దారిలో ఉన్నారని ఆయన నాకు చెప్పారన్నారు. దీనిని వెంటనే నిలువరించాలని, దీనిని నిలువరించాలంటే తెలంగాణ మోడల్‌ను అమలుచేయాలని ప్రభుత్వానికి సూచించానన్నారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంట్, ధాన్యం కొనుగోళ్లు, నీటి పన్నుల రద్దు వంటి చర్యలను అమలు చేయాలన్నారు.

బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే భరిస్తుంది
విఆర్‌ఓ వ్యవస్థను రద్దు చేశాం. ధరణి పోర్టల్ ద్వారా రైతుల అకౌంట్లలోకి వారికి అందాల్సిన ప్రయోజనాలను నేరుగా అందజేస్తున్నాం. మధ్యలో దళారి వ్యవస్థకు అవకాశం లేదు. ప్రతి రూపాయి రైతులకు చేరుతుంది. బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. రైతు మరణిస్తే వారం రోజుల్లో వారికి ఐదు లక్షల రూపాయలను అందజేస్తున్నాం. మహారాష్ట్రలో పాల ఉత్పత్తిదారులకు ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహాకాలను అందించడం లేదు. కానీ, తెలంగాణలో లీటర్‌కు 4 రూపాయల చొప్పున ప్రోత్సాహకాలను అందిస్తున్నాం. వారికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
భూగర్భవనరులు తెలంగాణలో సమృద్ధిగా పెరిగాయి
జలవనరులు ఇలాగే సముద్రాల్లో కలుస్తాంటే పిచ్చివాళ్ళలా చూస్తూ ఉందామా ? లేక ఏమైనా చేద్దామా ? ఏమైనా చేద్దామంటే విప్లవించాలి. విప్లవం దానికదే రాదు. యువత ఉద్యమించే ఫలితం రాదు. విషయం అర్థం కాకుంటే వేరు. కానీ విషయం అర్థమైన తర్వాత ప్రజలకు విషయాలను వివరించి, వారిని ఉద్యమింపచేయాలి. రైతులను ఏకం చేయాలి. సమస్యలను పరిష్కరించుకోవాలి. దేశంలోని ప్రజలను విద్యుత్ విషయంలో ఎందుకు ఇబ్బందులకు గురిచేస్తుంటారో అర్థం కాదనీ కెసిఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం, బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడడానికి ముందుకు తెలంగాణ ప్రాంతంలోనూ చాలా దారుణమైన పరిస్థితులుండేవని,

ఉదయం మూడు గంటలు, రాత్రి నాలుగు గంటల విద్యుత్ సరఫరా, రాత్రి పూట పొలాలకు వెళ్లిన రైతులకు పాములు కుట్టి చనిపోవడం, రైతుల ఆత్మహత్యలు లాంటి దారుణాలను తెలంగాణ ప్రాంతం చవిచూసిందన్నారు. నేడు తెలంగాణ ప్రాంతంలో పరిస్థితులు సంపూర్ణంగా మారిపోయాయని, ఎన్ని గంటలు, ఎన్ని మోటార్లు వాడుకున్నా ప్రభుత్వం రైతులను ప్రశ్నించదన్నారు. చెరువుల పూడికతీత, చెక్ డ్యాంల నిర్మాణం ద్వారా నీటి వనరులను సంరక్షించుకోవడంతో నేడు భూగర్భవనరులు తెలంగాణలో సమృద్ధిగా పెరిగాయని కెసిఆర్ తెలిపారు.

కేంద్రం మనల్ని ఎందుకు వెధవల్ని చేస్తోంది ?
దేశంలో అణువిద్యుత్‌కు సంబంధించి వివాదాలు నెలకొన్నాయి. జల విద్యుత్, గ్యాస్ ఆధారిత విద్యుత్, పవన్ విద్యుత్, సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో ప్రతిబంధకాలు ఉన్నాయి. ఇవి పోగా మనదేశంలో 361 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. బొగ్గు మంత్రిత్వ శాఖ అందించిన గణాంకాలు ఇవి. ఈ నిల్వలతో రోజుకు 24 గంటల చొప్పున 150 సంవత్సరాల పాటు నిరాటంకంగా యావత్ దేశానికి విద్యుత్‌ను అందించవచ్చు. అయినా ఆస్ట్రేలియా, ఇండోనేషియాల వంటి దేశాల నుంచి ఎందుకు బొగ్గును కొంటున్నారు. మనల్ని ఎందుకు వెధవల్ని చేస్తున్నారు ? మీరు ఈ విషయాలను మీ ఇళ్లకు వెళ్లాక ఆలోచించండి, చర్చించండి. అంబానీకి అప్పగించమంటారు. అదానీకి అప్పగించాలంటారు. విద్యుత్ బిల్లులు పెంచాలంటారు. కేంద్రం వింతైన చేష్టలు చేస్తుందని కెసిఆర్ ఆరోపించారు.

ఐఎఎస్ అధికారిని బెదిరించి రాజీనామా చేయించారు
తాను మహారాష్ట్రలో కాలు పెట్టాక విద్యుత్ కోతలు ఎత్తేసారు. బిఆర్‌ఎస్ భయంతో తోకముడిచారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవద్దని, వెంటనే తెలంగాణ మోడల్ ను మహారాష్ట్రలో అమలుచేయాలని కేంద్రేకర్ అనే ఐఎఎస్ అధికారి సలహానిస్తే, ముఖ్యమంత్రి, మంత్రులు ఆయన్ను పిలిపించుకొని, చివాట్లు పెట్టి, బెదిరించి, రాజీనామా చేయించింది. మహారాష్ట్రలో అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు తెలంగాణ మోడల్ ను అమలుచేస్తే 49 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయి. అంత మొత్తం మహారాష్ట్ర ప్రభుత్వం పెట్టలేదని చేతులెత్తేశారు. రైతులు చస్తే చావనీయమని వదిలేశారు. ఇంతటి సంపద కలిగిన రాష్ట్రం, దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు ఎన్నో నగరాలను,

పరిశ్రమలను కలిగిన మహారాష్ట్ర ఆదాయం ఏమవుతుంది ? తెలంగాణ మోడల్‌ను అమలు చేస్తే దేశం దివాళా తీస్తుంది అంటున్నారు. నిజమే తాను ఈ విషయంతో ఏకీభవిస్తున్నాను. కానీ మహారాష్ట్ర దివాళా తీయదు. నేతలు దివాళా తీస్తారు. రైతులు దివాళీ (దీపావళి) పండుగు జరుపుకుంటారు. తెలంగాణ మోడల్ ను అమలు చేస్తే నాయకులకు కమీషన్లు రావు. అందుకే వాళ్లు దివాళా తీస్తారు.ఇప్పటివరకు మహారాష్ట్రను పాలించిన కాంగ్రెస్, బిజెపి, శివసేన, ఎన్సీపి ఈ సమస్యలను ఎందుకు దూరం చేయలేకపోయాయి.ఈ సమస్యలను తొలగించడానికి నూతన పార్టీ అవసరం ఉంది.
రెండేళ్లలో వెలుగుజిలుగుల మహారాష్ట్రను ఆవిష్కరిస్తా
బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడితే రెండేళ్లలో తెలంగాణ మాదిరి వెలుగుజిలుగుల మహారాష్ట్రను ఆవిష్కరించుకోవచ్చు. మూడు సంవత్సరాల్లోగా మహారాష్ట్రలోని ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీటిని సమృద్ధిగా అందిస్తాం. మార్పు అవసరమా లేదా మీరే నిర్ణయించుకోవాలి. తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ రాష్ట్రంలో ఇంతటి ప్రగతి సాధ్యమైనప్పుడు దశాబ్దాలుగా రాష్ట్రంగా ఉనికిలో ఉంది. అయినా ఎందుకీ వెనుకబాటుతనం ? ధన్ కీ కమీ నహీ హై, మన్ కీ కమీ హై (ధనం లేక కాదు మనసు లేక), నాయకులకు ప్రజలపై, ప్రగతిపై మనసు లేదు కాబట్టి మహారాష్ట్ర పరిస్థితి ఇలా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రగతి సాధ్యమైనప్పుడు, ధనిక మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదో చెప్పాలని కెసిఆర్ ప్రశ్నించారు.

బుల్డానా జిల్లా నుంచి 100 శాతం మంది సర్పంచ్‌లు బిఆర్‌ఎస్‌లోకి….
విదర్భలోని బుల్డానా జిల్లా నుంచి 100 శాతం మంది సర్పంచ్‌లు వచ్చి బిఆర్‌ఎస్ లో చేరనున్నారు. సిట్టింగ్ సర్పంచ్‌లుగా వారికి మరో రెండు, రెండున్నరేళ్ల పదవీకాలం ఉంది. మహారాష్ట్రను ప్రగతి బాట పట్టించాలన్న ఏకైక లక్ష్యంతో వారంతా బిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. బిఆర్‌ఎస్ పార్టీతోనే మార్పు సాధ్యమని వారు ప్రగాఢంగా నమ్ముతున్నారు. బుల్డానా జిల్లాలో సర్పంచ్‌లంటే కేవలం బిఆర్‌ఎస్ పార్టీ సర్పంచ్‌లుగా మాత్రమే ఉండనున్నారు. మార్పు కోసం మహారాష్ట్ర కచ్చితంగా ఉద్యమించాల్సిన అసవరం ఉందని కెసిఆర్ పిలుపునిచ్చారు.కర్ణాటకలో బిజెపి పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. దీనివల్ల ఒరిగేదేమైనా ఉందా ? అని కెసిఆర్ ప్రశ్నించారు. పార్టీలు మారుతున్నాయి, కానీ, ప్రజల జీవితాలు మారడం లేదని ఆయన ఆరోపించారు.
ఒక్కసారి గులాబీ జెండాలుగా మారి చూడండి
తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా దేశంలో లేని విధంగా బిడి కార్మికులు 2,016 రూపాయల పెన్షన్ ను వారి వారి అకౌంట్లలో వేస్తుందన్నారు. ఎన్నో వర్గాలు ఈ ప్రయోజనాలు పొందుతున్నాయని కెసిఆర్ తెలిపారు. ప్రతి దేశంలో ప్రభుత్వాలు ప్రజల వెంట ఉన్నాయి. కానీ, మనదేశంలో ప్రభుత్వాలు ప్రజల వెంట లేవని, మనం ఐక్యంగా లేకపోవడమే దీనికి కారణమని కెసిఆర్ పేర్కొన్నారు. రైతులకుండే వ్యాధి ఏమిటంటే సమస్యలొస్తే ఏడుస్తారు. ఎన్నికలొస్తే నాయకుల ప్రలోభాలకు తలొగ్గి విభజింపచబడతారు. మతం, కులం, పార్టీల వారీగా వేరైతామని ఆయన తెలిపారు. రైతు సోదరులకు విన్నవిస్తున్నా. ఒక్కసారి గులాబీ జెండాలుగా మారి చూడండి. ఆ తర్వాత దేశంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో మీరే చూస్తారని కెసిఆర్ తెలిపారు.
బిఆర్‌ఎస్ ప్రగతే రైతుల ప్రగతి
తెలంగాణలో ఇంత అభివృద్ధి సాధ్యమైనప్పుడు మహారాష్ట్రలోనూ సాధ్యమవుతుందని కెసిఆర్ పేర్కొన్నారు. ఇప్పటివరకు 20 వేల మంది తెలంగాణ అమలవుతున్న పథకాలు, సాగునీటి ప్రాజెక్టులను స్వయంగా చూసి వెళుతున్నారని ఆయన తెలిపారు. బిఆర్‌ఎస్ ప్రగతే రైతుల ప్రగతి అని, బిఆర్‌ఎస్ ప్రగతే పేదల ప్రగతి అని కెసిఆర్ పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ రైతుల కోసం, పేదవారి కోసం పనిచేస్తుందని, దానికి మించి మాకు వేరే కోరికలేం లేవని ఆయన తెలిపారు. మహారాష్ట్రలోనే కాదు యావత్ భారతదేశంలోనే వెనుకబాటుతనం కనిపిస్తుందన్నారు. రైతులే ప్రభుత్వంగా ఆవిర్భవించాలని, అందుకే మా నినాదం ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అని ఆయన తెలిపారు.
మహారాష్ట్రలో 48 ఎంపిలు సీట్లు బిఆర్‌ఎస్ గెలిస్తే
మహారాష్ట్రలోని 48 మంది ఎంపిలకు 48 మంది బిఆర్‌ఎస్ నుంచి ఎన్నికై పార్లమెంట్‌కు పోతే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచలేమా ? తెలం గాణలో 17 ఎంపి సీట్లున్నాయి. రెండు రాష్ట్రాలోని 65 పార్లమెంట్ స్థానాలు కలవకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటయ్యే పరిస్థితి ఉండదన్నారు. ఈ రకంగా దేశానికి నేతృత్వం వహించే అవకాశం మొదటిసారి మహారాష్ట్రకు దక్కిందన్నారు. మంచి లక్ష్యంతో మనం ముందుకు సాగుతున్నప్పుడు మనకు దేవుడు, ప్రకృతి ఆశీర్వాదం మెండుగా ఉంటుందని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని కెసిఆర్ తెలిపారు.రానున్న రోజుల్లో మరెంతో మంది సర్పంచ్‌లు బిఆర్‌ఎస్ పార్టీలో చేరబోతున్నారని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రలో లభిస్తున్న ఆదరణను చూస్తూ వందకు వంద శాతం మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని కెసిఆర్ తెలిపారు. తెలంగాణలో అమలుచేస్తున్న పథకాలను అక్కడ అమలు చేస్తే నెల, నెలన్నర రోజుల్లో మీకు మార్పు కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎంతో ప్రేమతో ఇక్కడికి వచ్చిన అందరికీ కెసిఆర్ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు.
బిఆర్‌ఎస్‌లో చేరిన సోలాపూర్ నియోజకవర్గంలోని పలువురు గ్రామ సర్పంచ్‌ల వివరాలు
భారత్ రూప్ నర్ (ఔజ్ గ్రామం), అమర్ పాటిల్ (బోరుల్ గ్రామం), విద్యాధర్ వల్సంగే (ఇంగల్గి), ఇర్ఫాన్ షేక్ (హనమ్ గావ్ గ్రామం ), మహేష్ పాటిల్ (తొగరల్లి గ్రామం ), బస్వరాజ్ మిర్జే ( దిండూర్ గ్రామం), విఠల్ పాటిల్ (తిర్థ్ గ్రామం ), నాగేష్ షిండే ( కర్దేహల్లి గ్రామం ), బాబా హండే (వాంగీ గ్రామం), శ్రీశైల్ వ్హన్ మానే (మద్రే గ్రామం), మాయావతి పాటిల్ ( హిప్లే గ్రామం), అశోక్ సోన్ కట్లే (హత్తర్ సంగ్ గ్రామం), ఆనంద్ దేశ్ ముఖ్ (బసవ్ నగర్ గ్రామం), సూర్యకాంత్ యార్గలె (ధోత్రి గ్రామం), పరమేశ్వర్ షిండే (ఔరాద్ గ్రామం ), పండిత్ బుల్గుండే ( సంజ్ వాల్ గ్రామం), సుశీలా ఖ్యామగుండే ( టాకలి గ్రామం), ధర్మరాజ్ రాఠోడ్ (హత్తుర్ గ్రామం), భరమన్న గావ్డే (సింద్ ఖడే గ్రామం), సుఖ్ దేవ్ గావ్డే (గావ్డేవాడి గ్రామం), లక్ష్మణ్ హాకే (వర్లేగావ్ గ్రామం), జావేద్ షేక్ (గంగేవాడి గ్రామం), గురునాథ్ కొట్టాల్గి (లవంగి గ్రామం), అప్పు కోలి ( తెల్గావ్ గ్రామం), చంద్రకాంత్ చవ్హాన్ (ఘోడాతాండా గ్రామం),

అణ్సిద్ధ్ దేశ్ ముఖ్ (కార్కల్ గ్రామం), కాశీనాథ్ బిరాజ్ దార్ ( వడ్ గావ్ గ్రామం), సమీర్ షేక్ (కుడల్ గ్రామం), సంజ్ కుమార్ లోణారి (ఇలేగావ్ గ్రామం), శ్రీమతి హోన్ మానే (వడ్కబాల్ గ్రామం), రాజశేఖర్ సగ్ రే (బంక్ లగీ గ్రామం), అభిమాన్ ఘంటే ( మన్ గోలే గ్రామం), ఉమ్జజ్ ముజావర్ (వడ్ జీ గ్రామం), సురేష్ సోలంకర్ ( తిల్లేహాల్ గ్రామం), బాపూరావ్ దేశ్ ముఖ్ పాటిల్ (బోల్ కవ్ ఠా గ్రామం), హన్మంత్ కోలి ( శింగడ్ గావ్ గ్రామం), అనిల్ బర్వ్ (వల్ సంగ్ గ్రామం), రాజేంద్ర చవ్హాన్ (ఫతాటెవాడి గ్రామం), మహేశ్ వ్హటానే (హోట్గీ గ్రామం), ప్రకాశ్ సుతార్ ( ముస్తీ గ్రామం), సుధాకర్ కోలి (సాదెపూర్ గ్రామం), సమర్థ్ దుర్గే ( కుంభారి గ్రామం), రాజ్ కుమార్ బిరాజ్ దార్(దర్గన్ హల్లి గ్రామం), జిగర్ పాటిల్ (చించోలి గ్రామం), సాగర్ కోలి (ఆచెగావ్ గ్రామం), సురేష్ డవ్లే (హోట్గీ స్టేషన్ గ్రామం), నానా దోర్ ములే (ఆలెగావ్ గ్రామం), సంగప్ప కోలి (బాల్ గి గ్రామం), మల్లినాథ్ మాలి (ములేగావ్ గ్రామం), కొండీబా రాఠోడ్ (బక్షీ హిప్పర్ గీ గ్రామం), అమోల్ సౌదాగర్ (సంగ్ దరీ గ్రామం), తుకారాం షెండ్ గే (యత్ నాల్ గ్రామం).
మంత్రులు హరీష్‌రావు, వేముల
ఈ చేరికల కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, తెలంగాణ ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన చైర్మన్ సముద్రాల వేణుగోపాలచారి, మహారాష్ట్ర బిఆర్‌ఎస్ ఇంచార్జి వంశీధర్ రావు, బిఆర్‌ఎస్ నాయకులు దాసోజు శ్రావణ్, సోలాపూర్ ముఖ్య నాయకులు నగేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News