Tuesday, February 25, 2025

గ్రామ సంఘాల పని తీరు మెరుగుపర్చుకోవాలి: సీతక్క

- Advertisement -
- Advertisement -

సిఆర్పిల సమావేశంలో మంత్రి సీతక్క దిశా నిర్దేశం

మన తెలంగాణ/హైదరాబాద్: గ్రామ సంఘాల పనితీరును మెరుగుపరిచేందుకు అవసరమైన శిక్షణ సిఆర్‌పిలు ఇవ్వాలని, పనితీరు మెరుగుపర్చుకోవాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. రాజేంద్రనగర్‌లోని టీజీఐఆర్డీ సమావేశ మందిరంలో సోమవారం ఉమ్మడి మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాలో గ్రామ సమాఖ్యలతో సమావేశమయ్యారు. పలు జిల్లాల పర్యటనలో ఉన్న మంత్రి సీతక్క సిఆర్పిలను ఉద్దేశించి ఆన్‌లైన్‌లో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సిఆర్పి ల నుంచి సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్, ఇతర అధికారులు ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క ఆన్‌లైన్‌లో మాట్లాడుతూ గ్రామ సమాఖ్యల అనుభవాలు తెలుసుకోవడంతోపాటు వారి పనితీరును మెరుగుపరిచేందుకు గత 15 రోజులపాటు గ్రామాల్లో శిక్షణ ఇచ్చారని తెలిపారు. కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ -(సిఆర్పి)లకు మంత్రి సీతక్క దిశా నిర్దేశం చేశారు. మహిళా సంఘాల పనితీరు మెరుగుపరిచేందుకు, మహిళలందరినీ కోటీశ్వరులుగా చేయడానికి ముఖ్యమంత్రి తీసుకున్న ఆశయాన్ని ముందు తీసుకోవడానికి సెర్ప్ పనిచేస్తుందని అన్నారు. వారం రోజులు పాటు ఆయా గ్రామాల్లో ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా కలెక్టర్, ప్రాజెక్ట్ డైరెక్టర్‌కి నివేదికలు అందించారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా మహిళా సంఘాలను ప్రోత్సహిస్తూ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో పనిచేస్తున్నారని అన్నారు. ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత సిఆర్‌పిలకు ఉందని అన్నారు. వారం పాటు ఆయా గ్రామాల్లో ఉండి స్వయం సహాయక బృందాల అనుభవాలను సీఆర్పీలు తెలుసుకున్నారు. కాగా సీఆర్పీలు గ్రామాల్లో పరిశీలించిన అంశాలను సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ గారికి నివేదించారు. మహిళల ఆర్థికమైన అవసరాలే కాకుండా సామాజిక అవసరాలను మీరు గుర్తించడం అభినందనీయమని అన్నారు. ప్రతి మహిళ ఒకరికి ఒకరు అండగా కలిసికట్టుగా ఉండే విధంగా మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలో సీఆర్పీలు నివేదించాలని సెర్ప్ సీఈఓ తెలిపారు. ప్రతి మహిళ తన కుటుంబ బాగు తో పాటు సామాజికంగా ఎదిగేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News