గురుద్వారాల్లోకి ఆగంతకుల వరుస చొరబాట్లు, అపవిత్రం
24గంటల వ్యవధిలో ఇద్దరిని
కొట్టిచంపిన ఘటనలు, స్వర్ణ
ఆలయం ఘటనపై సిట్ విచారణ
కపుర్తల: అమృత్‌సర్ స్వర్ణ దేవాలయంలో సిక్కుల పవిత్ర గ్రంథం గురు గంథి సాహిబ్‌ను అపవిత్రం చేయడానికి ప్రయత్నించాడన్న ఆరోపణపై ఆగంతకుడ్ని కొట్టి చంపిన ఘటన జరిగిన 24 గంటలు గడవక ముందే పంజాబ్‌లోని మరో గురుద్వారాలోకి చొరబడిన ఆగంతకుడ్ని స్థానికులు కొట్టి చంపిన ఘటన చోటు చేసుకుంది. దీంతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ రోజు తెల్లవారుజామున గురుద్వారాలో ఒక వ్యక్తిని తాము పట్టుకున్నామని కపుర్తల జిల్లా నిజాంపూర్ గ్రామస్థులు చెప్పారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలోఆ వ్యక్తి సిక్కుల పతాకాన్ని అవమానించడానికి యత్నిస్తుండగా తాము చూశామని వారు చెప్పారు. పోలీసు బృందం సంఘటన స్థలానికి చేరుకుని అతడ్ని అదుపులోకి తీసుకున్నప్పటికీ స్థానికులు మాత్రం అతడ్ని తమ ముందే ప్రశ్నించాలని పట్టుబట్టారు. పోలీసులతో గొడవ అనంతరం గ్రామస్థులు అతడ్ని కొట్టి చంపేశారు. గ్రామస్థులు ఆ వ్యక్తిని కర్రలతో కొట్టి చంపినట్లు సిసి టీవీ దృశ్యాల్లో రికార్డయింది. తీవ్రంగా గాయపడిన అతడ్ని పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లారు కానీ అతను అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
సిట్ ఏర్పాటు
కాగా అమృత్‌సర్ స్వర్ణ దేవాలయంలో ఆగంతకుడు గురుగ్రంథి సాహిబ్‌ను అపవిత్రం చేయడానికి యత్నించిన ఘటనపై దర్యాప్తుకు పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేశారు. కాగా దాడి చేసిన వ్యక్తిని భక్తులు కొట్టి చంపిన విషయం తెలిసిందే. మృతి చెందిన వ్యక్తి ఎవరనే విషయం తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటన తర్వాత పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌జిందర్ సింగ్ రణధావా అమృత్‌సర్‌లో డిప్యూటీ కమిషనర్, పోలీసు కమిషనర్, ఐజి, అమృత్‌సర్ రూరల్ ఎస్‌ఎస్‌పిలతో సమావేశం నిర్వహించారు. ఈ సంఘటనపై దర్యాప్తుకు డిప్యూటీ పోలీసు కమిషనర్(శాంతిభద్రతలు) నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేస్తున్నామని, రెండు రోజుల్లో అది నివేదికను అందజేస్తుందని రణధావా చెప్పారు. నిందితుడు స్వర్ణ దేవాలయంలోని పరిక్రమలో కొన్ని గంటలు ఉన్నాడని, ఉద్దేశపూర్వకంగానే అతను ఇక్కడికి వచ్చాడని ఆయన చెప్పారు.
గుర్తు తెలియని నిందితుడిపై ఐపిసి సెక్షన్లు 295ఎ,307 కింద కేసులు నమోదు చేసినట్లు అమృత్‌సర్ పోలీసు కమిషనర్ సుఖ్‌చైన్ సింగ్ గిల్ ఆదివారం చెప్పారు. నిందితుడికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి స్వర్ణ దేవాలయంలోని అన్ని సిసి కెమెరాల ఫుటేజిని తీసుకున్నామని, వాటిని పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు.ఆ వ్యక్తి శనివారం ఉదయం 11 గంటల సమయంలో స్వర్ణ దేవాలయంలోకి ప్రవేశించాడని,అకాల్‌తక్త్ ముందు కొద్ది గంటలు నిద్రించాడని ఆయన చెప్పారు. ఈ సంఘటన సాయంత్రం 6 గంటల తర్వాత జరిగిందని, నిందితుడు నేరానికి పాల్పడే ముందు ఆలయంలో చాలా గంటల పాటు గడిపాడని ఆయన చెప్పారు.
స్వర్ణాలయాన్ని సందర్శించిన సిఎం
కాగా పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ పింగ్ చన్ని ఆదివారం అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. ఆయన అక్కడ పోలీసు ఉన్నతాధికారులను కలిసి సంఘటన గురించి తెలుసుకుంటారని తెలుస్తోంది.
ఆర్‌ఎస్‌ఎస్ ఖండన
ఇదిలా ఉండగా అమృత్‌సర్ ఘటనను ఆర్‌ఎస్‌ఎస్ ఖండించింది. సమాజంలో అశాంతిని సృష్టించడం కోసం పన్నిన కుట్రగా ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిని తీవ్రంగా శిక్షించాలని ఆయన కోరారు. అంతేకాదు ఇలాంటి సంఘటనలతో సమాజంలో సామరస్యం దెబ్బతినకుండా చూడాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.