Monday, November 25, 2024

స్పాంజ్ ఐరన్ కంపెనీ విస్తరణ వద్దు

- Advertisement -
- Advertisement -

చిట్యాల : నల్లగొండ జిల్లా, చిట్యాల మండలం, వెల్మినేడులో ఎంపిఎల్ స్పాంజ్ ఐరన్ కంపెనీ విస్తరణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించనుండగా ఆ కార్యక్రమాన్ని నిలిపివేయాలని, కంపెనీ విస్తరణ చేయొద్దంటూ యువకులు, ప్రజలు కంపెనీ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఏర్పాటు చేస్తున్న టెంట్లను తొలగించి, ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాట్లను అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గ్రామస్థులను అడ్డుకున్నారు. గ్రామస్థులను అక్కడి నుండి చెదరగొట్టే ప్రయత్నం చేయటంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఈ సందర్బంగా కంపెనీ తమ కొద్దంటూ నినాదాలు చేశారు. పోలీసులు గ్రామస్థులతో మాట్లాడి శాంతింపజేసే ప్రయత్నం చేశారు.

అయితే, ఎట్టి పరిస్థ్దితులోనూ ప్రజాభిప్రాయ సేకరణ జరుగనివ్వమని స్థానికులు పట్టుబట్టారు. గ్రామస్థులకు నచ్చజెప్పే ప్రయత్నంలో పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ ప్రాణాలైనా అర్పిస్తాం..కానీ కంపెనీ విస్తరణ మాత్రం జరుగనివ్వబోమని నినాదాలు చేశారు. వెల్మినేడు గ్రామ పంచాయతీ సర్పంచ్‌తో సహా, పాలకవర్గ సభ్యులు, పిట్టంపల్లి, బొంగోనిచెర్వు గ్రామాల యువకులు తరలి వచ్చారు. కంపెనీ విస్తరణ విస్తరిస్తే ఇప్పటికే వాయు కాలుష్యంతో నిండిపోయిన వెల్మినేడు పరిసర గ్రామాల ప్రజలు ఇంకా వాయు, జల కాలుష్యంతో సతమతమవుతారని వాపోయారు. పలు పరిశ్రమల వల్ల ఇప్పటికే జల కాలుష్యం, వాయు కాలుష్యంతో భూగర్భ జలాలు పాడయ్యాయని, పంటలు సాగు చేయటానికి కూడా వ్యవసాయ భూములు పనికి రాకుండా పోయాయని అన్నారు.

పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో నల్లగొండ డిఎస్‌పి శ్రీధర్‌రెడ్డి అక్కడికి చేరుకుని, ప్రజలతో మాట్లాడారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా కంపెనీల ఏర్పాటు జరగదని, వారి అభీష్టం మేరకే కంపెనీ ఏర్పాటు జరుగుతుందని గ్రామస్థులను సముదాయించడంతో శాంతించారు. నార్కట్‌పల్లి సిఐ మహేశ్, చిట్యాల ఎస్‌ఐ ఇరుగు రవి , పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News