మూడు గంటల పాటు ఇనుప చువ్వ సాయంతో బ్రిడ్జ్ ఫిల్లర్‌పై నిలుచున్న రైతు
ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
మన తెలంగాణ/ఆసిఫాబాద్ ప్రతినిధి: పొలం పనుల నిమిత్తం వెళ్లి తిరుగు ప్రయాణంలో వాగు ఉధృతిలో చిక్కుకున్న రైతును గ్రామస్థులు, మత్సకారులు ధైర్యసాహసాలతో వెళ్లి కాపాడారు. ఆసిఫాబాద్ జిల్లా బాబసాగర్ గ్రామానికి చెందిన బస్‌కిత్రి సాయినాధ్ అనే రైతు సోమవారం వ్యవసాయ క్షేత్రానికి తన ఎడ్లబండిపై వెళ్లగా నాయకపుగూడ సమీపంలో ఉన్న వాగుకు ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో ఎడ్లబండి వాగులో కొట్టుకుపోయంది. దాంతో రైతు సాయినాధ్ వాగుపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జికి ఉన్న ఇనుప చువ్వను పట్టుకొని పైకిఎక్కి ప్రాణాలు దక్కించుకున్నాడు. వరదలో ఎడ్ల బండి, ఎడ్లు కొట్టుకుపోతున్న క్రమంలో మత్సకారులు ఎడ్లను కాపాడారు. సాయినాధ్ సుమారు మూడు గంటలపాటు అలా వరద ఉధృతి వస్తున్న క్రమంలో పిల్లర్‌పైనే నిలుచుని ప్రాణాలను రక్షించుకున్నాడు. బ్రిడ్జి పిల్లర్ మధ్యలో ఇనుప చువ్వ సాయంతో నిలుచున్న సాయినాధ్‌ను గ్రామస్థులు, మత్సకారులు తాడు సాయంతో బయటకు తీసుకువచ్చారు. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సాయినాధ్ వాగులో ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న కౌటాల సిఐ బుద్దె స్వామి, ఎస్‌ఐ విజయ్ సంఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థులను అభినందించారు.