Thursday, January 23, 2025

గ్రామాల అభివృద్ధిలో వాళ్ల కృషి ఉంది: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

Villages more develop with MPDO

హైదరాబాద్: తెలంగాణలో 60 శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారని, గ్రామాలలో ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి అమలు చేస్తున్న పల్లె ప్రగతి, ఇతర గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతం కావడానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు అంకితభావంతో కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. హైదరాబాదులోని బంజారాహిల్స్ ప్రాంతం మినిస్టర్ క్వార్టర్స్ లో సోమవారం రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తో కలిసి మండల పరిషత్ అభివృద్ధి అధికారుల 2022 సంవత్సరపు డైరీ, క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం పిదప ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న మండల పరిషత్ అధికారుల, ఇతర అధికారుల, ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి కెసిఆర్ పరిష్కరించి అర్హులైన అందరికీ ప్రమోషన్లు ఇచ్చారని ఆయన తెలిపారు.

అంతేకాకుండా పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించామని ఆయన అన్నారు. రాష్ట్రంలో గ్రామాల సమగ్ర అభివృద్ధికి గత మూడేళ్ల కాలంలో 7 వేల 203 కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు నేరుగా నిధులు విడుదల చేసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. దీనికి తోడుగా వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల ద్వారా మరో 8 వేల 867 కోట్ల రూపాయలు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో చేపట్టి అమలు చేశామని ఎర్రబెల్లి వివరించారు. పల్లె ప్రగ్రతి కార్యక్రమం క్రింద గ్రామీణ ప్రాంతాలలో అన్ని గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డ్ లు, ఇతర కార్యక్రమాల వల్ల గ్రామాల రూపురేఖలు మారాయని వివరించారు. ఈ కార్యక్రమాలు విజయవంతంగా అమలు కావడానికి మండల పరిషత్ అధికారులు అందరూ రెగ్యులర్ గా గ్రామాలను సందర్శించి ఈ కార్యక్రమాల అమలును ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని ఎర్రబెల్లి కోరారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు గణనీయమైన కృషి చేస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారుల, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించారన్నారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి అమలు చేస్తున్న వివిధ పథకాల విజయవంతం కావడానికి అధికారులు, ఉద్యోగులు కృషి చేయాలని మంత్రి కోరారు

ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా పరిషత్ సిిఇఒ, డిప్యూటీ సిఇఒ అసోసియేషన్ అధ్యక్షులు కె.రాఘవేంద్రరావు, రాష్ట్ర యం.పి.డి.ఒ ల అసోసియేషన్ అధ్యక్షులు సత్తయ్య, ప్రధాన కార్యదర్శి జి చంద్రశేఖర్, టి.జి.ఓ ల రాష్ట్ర జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, రాష్ట్ర ఎంపిడిఒల సంఘం ఉపాధ్యక్షులు మల్లికార్జున్, పబ్లిసిటీ సెక్రటరీ నాగేందర్ రెడ్డి, రాష్ట్ర ఎంపిడిఒల సంఘం అన్ని జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News