ఛాయ ప్రచురణల సీఈవో అరుణాంక్ లత, డైరెక్టర్ చాయ మోహన్‌లతో విమల సంభాషణ
పుస్తక ప్రచురణా రంగం నేడు అనేక కొత్త పుంతలు తొక్కుతూ వుంది. ముఖ్యంగా ఆధు నిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తొంభయ్యవ దశకం తరువాత ఇంటర్నెట్ వ్యవస్థ అందు బాటులోకి వచ్చి, సమాచార వెల్లువ, ఒక క్లిక్‌తోనే అంతటా ప్రవాహా వేగంతో చుట్టుముట్టి, ప్రపంచమే ఒక గ్లోబల్ కుగ్రామంగా మారిన తరువాత, ఇ పుస్తకాలు కూడా అందుబాటులోకి వచ్చాక అచ్చుపుస్త కాలకు ఇక కాలం చెల్లినట్లే అనుకున్నారు అంతా. అనేక ప్రచురణా సంస్థలు, పాత తరహా ప్రచురణా, విక్రయాలు నిజంగానే గడ్డు పరిస్థితిని ఎదుర్కున్న కాలం కూడా కొంతవరకూ మనం చూసాం.
కానీ నిజానికి అచ్చు పుస్తకాలకి కాలం చెల్లలేదు. పుస్తకాన్ని చేతుల్లో పట్టుకుని, మెల్లిగానో, వేగంగానో, ఏకాంతంగానో, సమూహాల మధ్యనో చదు వుకుంటూ ఆనందించే వాళ్ళు తక్కువేం కాదు. ఇప్పుడు పుస్తకాలు కొత్త తరం ప్రచురణ కర్తల చేతులలో, కొత్త వూపిరులను పోసుకుని ముందుకు వచ్చాయి. దేశీయ, ప్రపంచ భాషలలోని సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు పరిచయం చేయడంతో పాటు, పుస్తకాన్ని పాఠకులకు చేర్చే మార్కెటింగ్ స్ట్రాటజీలు, వ్యాపార మెలుకువల అవసరాన్ని కూడా గుర్తెరిగిన ఆధునిక ప్రచురణ కర్తలు వేల, లక్షల ప్రతుల్ని అమ్మడాన్ని కూడా మనం చూస్తున్నాం. అలాంటి ప్రచురణ కర్తలు, సాహిత్య, కళా ప్రపంచంలో తమదైన ముద్రను వేస్తున్న వాళ్ళను పరిచయం చేయడం కోసం మెహఫిల్ ఈ కొత్త శీర్షిక ముద్రను మీ ముందుకు తెస్తున్నది.
ఇప్పటికీ అనేక ప్రచురణ సంస్థలు ఉండగా, ఎందుకు ఛాయ ఎందుకు, ఎలా ఏర్పడింది?
ఛాయ మొదట సాహిత్యవేదికగా ప్రారంభమైంది. సాహిత్య సభలు, సాహితీవేత్తల సభలు నిర్వహించేవాళ్ళం. ఆ తరువాత పూడురి రాజిరెడ్డి చింతకింది మల్లయ్య ముచ్చట కథల సంకలనంతో ప్రచురణ సంస్థగా ప్రారంభమైంది. అప్పుడున్న పరిస్థితి పుస్తక ప్రచురణ అంటే వెయ్యి పుస్తకాలు ప్రచురించి, అమ్ముడుపోయే దాకా ఎదురుచూడడమే. మా పదకొండు పుస్తకాలు కూడాఅలా ప్రచురించినవే. మొదటి రెండేళ్ళ కాలంలో ఓ కొత్త ప్రచురణ సంస్థ అన్ని పుస్తకాలు ప్రచురించడం కాస్త సాహసమే. సంస్థ మొదలుపెట్టిన రెండేళ్ళలోనే కోవిడ్ రావడం, ఆ తరువాత కొంతకాలం వరకు పుస్తకాల అమ్మకాలు పెద్దగా లేకపోవడంతో ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
అప్పడు వచ్చిన ఐడియానే డిజిటల్ ప్రింటింగ్. డిజిటిల్ ప్రింటింగ్ తెలుగులో మొదలుపెట్టింది ఛాయనే. మేం డిజిటల్ ప్రింటింగ్ వేస్తున్నాం అన్నప్పుడు అది జిరాక్స్ అనీ, అక్షరాలు పోతాయని అంటే మా మొదట పుస్తకం రామేశ్వరం కాకులుని నీళ్ళలో ఒక రోజంతా నానబెట్టి, ఎండబెట్టి, పరీక్ష చేసి ఫోటో తీసి పెట్టాం. ఆ తరువాత తెలుగు ప్రచురణ రంగంలో చాలా మంది డిజిటల్ ప్రింటింగ్ వైపు వెళ్ళారు. ఆ రోజు మమ్మల్ని వెక్కిరించిన వారు కూడా ఇవాళ డిజిటల్ ప్రింటింగ్‌లో పుస్తకాలు వేస్తున్నారు.
పుస్తకాల ఎంపికల్లో మీదైనా ప్రత్యేకత, ముద్ర ఉందా? ఎలాంటి వైవిధ్యమైన పుస్తకాలు వచ్చాయి?
పుస్తకానికి సాహిత్య విలువ అనేది ఉండాలని మేం నమ్ముతాం. అదే తెలుగు సాహిత్యంలో ఛాయని ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఫలానా రచయిత పుస్తకం కొనాలి అనడం వింటుంటాం. మా విషయంలో ఛాయ వేసిన పుస్తకాలు కొనాలి అనే పాఠకులున్నారు. ఏదైనా పుస్తకం వాళ్ళు ఛాయ నుండి ఆశించినంత స్టాండర్డ్ లో లేనప్పుడు ఇది ఛాయ వేయాల్సిన పుస్తకం కాదు అనడం కూడా ఉన్నది. ఒక రకంగా అది మాకు దక్కిన గౌరవం. మేం వేసిన పుస్తకం ఏమిటి? ఏ విషయం మీద అనే దానితో సంబంధం లేకుండా ప్రతి పుస్తకం కొనే పాఠకులున్నారు. అనువాదాలకు ప్రత్యేక పాఠకులున్నారు. మేం ఎన్నుకునే పుస్తకాలు మమ్మల్ని ఇలా నిలబెట్టాయి. ఛాయగా వినబడని గొంతుకల పక్షాన ఉండాలి అనేది మా పాలసీ.
మియా కవిత్వం తీసుకొచ్చినా, బౌల్ కవిత్వం తీసుకొచ్చినా, సిఎఎ ఎన్‌ఆర్‌సి నేపథ్యంలో కాగితాలకు ఆవల అనే కథల సంకలనం తీసుకొచ్చినా, ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన మహత్తర రైతు ఉద్యమాన్ని డాక్యుమెంట్ చేసిన ఫూల్ ఔర్ కాంటే తీసుకువచ్చినా, తొలి తెలుగు హోమో సెక్సువల్ నవల సన్నాఫ్ జోజప్ప, ఇటీవల వచ్చిన ఎండపల్లి భారతీ కథల సంపుటి దేవ రహస్యాలు దాకా ఇవి మేం ఏ పక్షాన నిలబడుతున్నామో చెప్పే పుస్తకాలే. మియా కవిత్వం తెచ్చినప్పుడు మియా కవుల్ని తీసుకొచ్చి ఇక్కడ సభ చేద్దాం అనుకున్నాం. వాళ్ళ మీద ఉండే నిర్భందం గురించి తెలిసిందే కదా. వాళ్ళే మా మీద నడుస్తోన్న నిర్భందాన్ని మీదాక తేవద్దు అనుకుంటున్నాం అన్నారు. ఒక్క పూల్ ఔర్ కాంటే మినహాయిస్తే మిగతావన్నీ కాల్పనిక సాహిత్యమే. మేం అనుకునే సాహిత్య విలువలలో ఉన్నతంగా నిలబడే సాహిత్యమే. అదే తెలుగు సాహిత్యంలో మా ముద్ర. ఈ ప్రయాణంలో మాతో పాటూ లక్ష్మీ, నరేష్కుమార్ సూఫీ, క్రాంతీ, శేషులు ఉన్నారు.
కొత్త రచయితలను, కొత్త పుస్తకాలను మీరు పరిచయం చేస్తుంటారా? ఎలాంటి స్పందన మీకు వస్తూ వుంటుంది?
విభిన్న సాహిత్యానికీ, కొత్త గొంతుకలకు చోటివ్వాలి అనేది మా ఆలోచన. ఉణుదుర్తి సుధాకర్ నుండి యం.యస్ హనుమంత రాయడు దాకా పదిహేను మంది ఛాయ నుండి పరిచయం అయ్యారు. అనువాదంలో అయితే, వసుధేంద్ర, వివేక్ శానాభాగ, యం.ఆర్. దత్తాత్రి, జయమోహన్, శ్రీధర్ బనవాసి, నరేంద్ర మోహన్, జయప్రకాష్ కదమ్ లాంటి దేశీ భాషల్లో స్టాల్ వారట్స్ అనుకునే వాళ్ళను తెలుగులో ఛాయ పరిచయం చేసింది. ఇందులో 90 పుస్తకాలు సమకాలీనంగా రాస్తున్న రచయితల అనువాదాలే అనేది గుర్తించాలి. సిల్క్ రూట్, ఆ దారి పొడవునా బౌద్ధ ధర్మ విస్తరణ గురించి వసుధేంద్ర కన్నడలో రాసిన పుస్తకం సెప్టెంబర్‌లో వస్తే డిశంబర్ నాటికల్లా తెలుగులోకి తెచ్చాం. సమకాలీన సాహిత్యం అనువాదం అయినప్పుడు అక్కడ ఎలాంటి రచనలు వస్తున్నాయో మన వాళ్ళకూ తెలుస్తుంది. ఇది మేం మొదటి నుండి పాటిస్తూ వచ్చాం. ఛాయ తెలుగులోకి తెచ్చిన రచయిత పుస్తకం ఆ భాషలో విడుదల అయితే, మీరెప్పుడు తెస్తున్నారు అని అడిగే పాఠకుల్ని సంపాదించుకున్నాం. అంతకన్నా గొప్ప రెస్పాన్స్ గానీ, కితాబు గానీ ఏముంటుంది.
మీ పుస్తకాల్లో అనువాదాల సంఖ్య కూడా ఎక్కువగానే వుంది? ఆ వైపుగా ప్రయాణం ఎలా సాగింది?
అనువాదాలు ఏ భాషలోకి వెడతాయో ఆ భాషను కూడా సుసంపన్నం చేస్తాయి అనేది మా అవగాహన. మన దగ్గర చూసుకుంటే శరత్ నవలలు తెలుగు నవలలు అన్నంతగా మనలో ఇమిడిపోయాయి కదా. రెండోది పైన చెప్పిన్నట్లు వివిధ సాహితీ సమాజాల్లో ఏం జరుగుతుంది? ఎట్లాంటి సాహిత్యం వస్తుంది? కొత్తగా సాహిత్యంలో ఏవైనా టెక్నిక్స్ వస్తున్నాయా అనేది మనకు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ మాట అంటే చాలా మందికి కోపం వస్తుంది కాని తెలుగులో ఒక రకమైన మూస సాహిత్యమే ఇంకా వస్తుంది. ఇటీవల వస్తున్న వాటిల్లో వేళ్ళ మీద లెక్కబెట్టే రచనలు మినహాయిస్తే మెజారిటీ పుస్తకాల్లో డెప్త్ ఉండటం లేదు. మనకూ గొప్ప చారిత్రిక వారసత్వం ఉన్నది.
సాహిత్య లెగసి ఉన్నది కానీ అది సాహిత్యంలో రిఫ్లెక్ట్ అవ్వడం లేదు. ఆ కొరతను అనువాదాలు తీరుస్తున్నాయి. నెమ్మి నీలం లాంటి కథలు తెలుగులో రాలేదు అన్నారు కవి శివారెడ్డి గారు. రాయలు తెలుగువాడు అంటుంటాం (తెలుగా కాదా అనే చర్చలోకి పోవడం లేదు. కానీ అంటుంటాం కదా) కానీ తేజో – తుంగభద్ర, కరి సిరి యాన లాంటి నవలలు తెలుగులో రాలేదు. ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమం ఇక్కడ జరిగితే అది సాహిత్యంలో కథా, నవల సాహిత్యంలో ఎంతలా వచ్చింది. నాన్ – ఫిక్షన్‌లో నలమాస కృష్ణ రాసిన ఎం.ఫిల్ థీసిస్ కొంత మేరకు సమకాలీన ఉద్యమ లోటును తీర్చింది. సాహిత్యంలో సమకాలీన విషయాలు రాస్తున్నప్పుడు క్రిటికల్ అబ్సర్వేషన్ ఉండాలి కదా. అదెందుకో ఎక్కువగా కనబడంలేదు. కథ వ్యాసమై పోతుంది. నవల ఉపన్యాసమైపోతుంది.
ఛాయ అనువాదాలనే కాదూ అనువాదకులనూ పరిచయం చేసింది. హర్ష సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎ చదువుతున్న విద్యార్థి. విఫల అనే నవలను చక్కగా అనువాదం చేశాడు. అవినేని భాస్కర్ తెలుగు అనువాదానికి స్టాండర్డ్ సెట్ చేశాడు. కొత్తగా చేస్తున్న కుమార్.ఎస్ రాబోయే కాలానికి ప్రామిసింగ్ అనువాదకుడు. అధోలోకం గాక, రెండు విదేశీ పుస్తకాలు అనువాదం చేశాడు.
పల్ప్ ఫిక్షన్ చదివే వాళ్ళు, కొనేవాళ్ళు ఎక్కువ ఉంటారు. వాటికి డబ్బులు కూడా వస్తాయి. అయితే ఛాయ సాహిత్య విలువలతో కూడిన పుస్తకాలు వేయాలనుకుంది అన్నారు కదా. ఎలా వాటిని అమ్మగలుగుతున్నారు?
పల్ప్ ఫిక్షన్ లేదా పాపులర్ ఫిక్షన్‌కే ఎప్పుడూ మార్కెట్ ఉంటుంది అనేది సత్యమే. అయితే, మంచి సాహిత్యం కూడా ఎప్పుడూ అమ్ముడుబోతూనే ఉంటుంది. చలం రాసిన విషయాలతోనో, శ్రీశ్రీ రాసిన విషయాలతోనో పేచీలు ఉండొచ్చుగాక ఇప్పటికీ ఆ సాహిత్యం అమ్ముడవుతూనే ఉంది కదా.
సాహిత్యానికి సంపాదకుల అవసరం ఉందా?
కచ్ఛితంగా ఉంది. రచయితా మనిషే. ప్రతి మనిషిలో ఉండే ఆపేక్ష రచనల పట్ల రచయితలకూ ఉంటుంది. రాసిన ప్రతిదీ అచ్చులో చూసుకోవాలి అనుకుంటారు తప్పితే ఎడిటింగ్ అవసరం అనేది ఒకటి ఉంటుందని చాలా మంది గుర్తించరు. ఏదైనా పుస్తకం మా వద్దకు ప్రచురణకు వస్తే వేస్తామా, వేయమా అని చెప్పేందుకు కచ్ఛితంగా 90 రోజులు తీసుకుంటాం అని చెబుతున్నాం. వేస్తాం అని చెప్పాక ఆరు నెలలు ఆగాలి. మాకు కొందరు గెస్ట్ ఎడిటర్స్ ఉన్నారు. వాళ్ళు చూసి ఎవాల్యుయేట్ చేస్తారు. అవసరమైన ఎడిటింగ్‌కి ఒప్పుకోవాలి అని ముందే చెబుతున్నాం. కుదరదు అంటే సగం ఎడిట్ చేసిన పుస్తకాలను కూడా వెనక్కి ఇచ్చేసిన సందర్భాలున్నాయి. పుస్తకం బయటకి బాగా రావాలని తప్పితే ఫలానా రోజు రావాలి అనే డెడ్‌లైన్‌ల ప్రాతిపదికతో పనిచేయలేం. సంపాదకులే కాదు, రివ్యూయర్లు కూడా కావాలి. కొత్తగా రీడర్ రివ్యూ అనే పద్దతిని పాటిస్తున్నాం. మేం ఎన్నుకున్న ఓ పది మందికి ముందే పుస్తకం పంపించి, పుస్తకానికి వారిచ్చే సూచనలు తీసుకుంటున్నాం. కొన్నిసార్లు వాళ్ళు మంచి ఎడిటింగ్ విషయాలు కూడా చెబుతున్నారు.
మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి?
ఇన్నాళ్ళూ దేశీ అనువాదాలు తీసుకుని వచ్చిన ఛాయ ఇక మీదట విదేశీ సాహిత్య అనువాదాలు తేవాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఛాయ – విదేశీ అనే ఒక సీరిస్ మొదలుపెట్టాం. ఈ ఏడాది నోబెల్ వచ్చిన రచయిత్రి హాన్ కాంగ్ నవల వీ డు నాట్ పార్ట్, ఈ ఏడాది ఇంటర్నేషనల్ బుకర్ వచ్చిన జెన్ని ఎర్పెన్‌బెక్ రచన కైరోస్, గత ఏడాది బు కర్ వచ్చిన ప్రాఫెట్ సాంగ్, నోబెల్ రచయి తా యాన్ ఫోసా షైనింగ్ లతో పాటూ 15 అంతర్జాతీ య భాషల నుండి 25 పుస్తకాలు వచ్చే రెండేళ్ళలో తేవాలనే ప్రయత్నంలో ఉన్నాం. అనువాదాలు అం టే కమ్యునిస్ట్ పార్టీ ఉంది గనుక ఎక్కువగా రష్యన్ సాహిత్యం వచ్చింది మనకు, కొంత యూరోపియన్ సాహిత్యం. కాని ఈ సిరీస్‌లో నాలుగు లక్షల జనాభా ఉన్న ఐలాండిక్ మొదలు డచ్, ఫీనీష్, నార్వేజియన్, స్వీడిష్, పోలిష్, అరబిక్, పోర్చుగీస్, ఫ్రెంచ్, ఇటాలియన్ లాంటి భాషల నుండీ పుస్తకాలు తెస్తున్నాం.
ఇవి అక్కడి సాహిత్యాన్ని, సమాజాన్ని మనకు పరిచయం చేయడమే గాక మనం సాహిత్యాన్నీ సుసంపన్నం చేస్తాయని నమ్ముతున్నాం. ఇందులో స్పెక్యులేటివ్, హిస్టారికల్, థ్రిల్లర్, క్రైమ్, డిటెక్టివ్ ఫిక్షన్‌ల నుండీ పుస్తకాలున్నాయి. రాయల్టీలు దండిగానే కడుతున్నాం. చూడాలి. ఇందులో ఇప్పటికే మూడు పుస్తకాలు అనువాదమై ముద్రణకు సిద్ధమవుతున్నాయి.
దీంతో పాటూ మేం ప్రచురించిన పుస్తకాలను ఇతర భాషల్లోకి తీసుకుపోయే ప్రయత్నం కూడా చేస్తూనే ఉన్నాం. ఈ ఏడాది, ఛాయ ప్రచురించిన పుస్తకాల్లో ఐదు పుస్తకాలు తమిళ, కన్నడ భాషల్లోకి అనువాదం అవుతున్నాయి. ఇక మీద తెలుగులోకే కాదూ తెలుగు నుండీ ఇతర భాషల్లోకి పుస్తకాలు వెళ్తున్నాయి అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఛాయ – అజు కలిసి నిర్వహిస్తున్న Telugu into Literary Translation అనే వర్క్ షాప్ ముగింపుకొచ్చింది. వచ్చే రెండేళ్ళలో తెలుగు నుండి ఇంగ్లీష్‌లోకీ సాహిత్యం వెళ్ళడాన్నీ చూడొచ్చు.