Wednesday, January 22, 2025

వినాయకచవితి వ్రత విధానం

- Advertisement -
- Advertisement -

వినాయక చవితి రోజు ప్రాతఃకాలమే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని, నీళ్ళతో కడగాలి. తరువాత ఇంటిలోని సభ్యులందరూ తలంటుకుని స్నానం చేసి, ఉతికిన బట్టలు ధరించాలి. గుమ్మాలను మామిడాకులతో అలంకరించుకోవాలి. వ్రతం చేయాలనుకునే ప్రదేశంలో పీట వేసి, పసుపుతో విఘ్నేశ్వరుని చేసి, తమలపాకుల చివర తూర్పు వైపుకుగానీ, ఉత్తరం వైపుకు గానీ ఉంచుకోవాలి. ఒక పళ్ళెంలో బియ్యం పోసుకుని వాటిపై తమలపాకులను పెట్టుకోవాలి. అగరవత్తులు వెలిగించి దీపారాధన చేసి..
ఓం దేవీంవాచ మజనయంత దేవాస్తాం విశ్వరూపా: పశవో వదంతి
సానో మంద్రేష మూర్ణం దుహానాధే నుర్వాగాస్మానుప సుష్టుతైతు అయం ముహూర్తస్సుముహూర్తోస్తు

శ్లోకం: యశ్శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళాః
తయోః సంస్మరణా త్పుంసాం సర్వతో జయమంగళం అని చదవాలి.

పీటపై వినాయకుడి విగ్రహాన్ని ఉంచుకుని. పాలవెల్లికి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, దాన్ని విఘ్నేశ్వరుని తలపై వచ్చేలా తాళ్ళు కట్టి పైన కట్టుకోవాలి. పాలవెల్లిపై పత్రి వేసుకుని పాలవెల్లి నలువైపులా మొక్కజొన్న పొత్తులను కట్టుకుని, పళ్ళతో అలంకరించుకోవాలి. వినాయకుడికి ఉండ్రాళ్ళు, కుడుములు, గారెలు, పాయసం మొదలైన పిండివంటలు చేసుకుని దగ్గర పెట్టుకోవాలి. వినాయకుడి ప్రతిమ ఎదురుగా పీటపై కొన్ని బియ్యం పోసుకుని దానిపై రాగి, వెండి లేదా మట్టి పాత్రకు పసుపు రాసి, పాత్రపై జాకెట్టు గుడ్డ వేసి, మామిడాకులు కొన్ని ఉంచి దానిపై కొబ్బరికాయ ఉంచి కలశం ఏర్పాటు చేసుకోవాలి.

పూజకు కావలసిన సామాగ్రి

పసుపు, కుంకుమ, గంధం, అగరవత్తులు, కర్పూరం, తమలపాకులు, వక్కలు, పూలు, పూల దండలు, అరటిపండ్లు, కొబ్బరికాయలు, బెల్లం లేదా చక్కెర, పంచామృతం, తోరం, కుందులు, నెయ్యి, నూనె, దీపారాధనకు వత్తులు,21 రకాల ఆకులు (పత్రి), ఒక గ్లాసులో చెంచా లేదా ఉద్దరిణ, పళ్ళెం పెట్టుకోవాలి (ఆచమనం చేయడానికి). మూడు తమలపాకులు, రెండు వక్కలు, రెండు పళ్ళు, దక్షిణ ఉంచుకోవాలి. ఆచమనం చేసిన తరువాత చేతులు తుడుచుకోవడానికి ఒక తువ్వాలు. పూజ చేసేవాళ్ళు బొట్టు పెట్టుకుని పీటపై కూర్చోవాలి.

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే!!
అయం ముహూర్తః సుముహూర్తోస్తు
తదేవలగ్నం సుదినం తదేవ
తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం తదేవ
లక్ష్మీపతేతేంఘ్రియుగం స్మరామి
యశ్శివోనామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా
తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళమ్
అని చదువుతూ పీటమీద తూర్పుముఖంగా కూర్చోవాలి. పసుపుతో చేసిన వినాయకుడికి కుంకుమబొట్టు పెట్టి అక్షింతలు చల్లి నమస్కరించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News