Wednesday, November 13, 2024

వినేశ్ అనర్హత జాతికి గుండెకోత

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్‌కు చేరిన క్రీడాకారిణి వినేశ్ ఫొగాట్‌పై ఒలింపిక్స్ కమిటీ అనర్హత వేటు వేయడం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. కేవలం వంద గ్రాముల అధిక బరువు కారణంగా ఆమె ఫైనల్ పోటీలో పాల్గొనకుండా వేటు వేయడం దేశాన్నే దిగ్భ్రాంతికి గురి చేసింది. సగటు పౌరుడు మొదలుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ముర్ము, విపక్ష నేత రాహుల్ గాంధీతో సహా అన్ని రంగాల ప్రముఖులు ఫొగాట్ అనర్హతపై అసాధారణ రీతిలో స్పందిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ మీరే చాంపియన్లకే చాంపియన్ అంటూ ట్వీట్ చేసి ఆమెను ఓదార్చారు. ఒలింపిక్స్‌లో తొలిసారి స్వర్ణంతో చరిత్ర సృష్టించాల్సిన ఫొగాట్ కేవలం బరువు కారణంగా అనర్హురాలు కావడం తనను తీవ్రంగా కలచివేసిందని మోడీ ఎక్స్‌లో ఆవేదన వ్యక్తంచేశారు.

అయినా వినేశ్ మీరే దేశానికి గర్వకారణం, ప్రేరణ అంటూ మోడీ ఫొగాట్‌ను ప్రశంసించారు. బరువు తగ్గడం కోసం ఆమె పోటీకి ముందు రోజు రాత్రంతా జాగింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్ చేసి నిద్రాహారాలు మానినా నిర్దేశిత పరిమితికి మించి కేవలం వంద గ్రాముల బరువు అధికంగా ఉందని పోటీలో పాల్గొనకుండా చేయడం భారతీయుల గుండె పగిలేలా చేసింది. ఫొగాట్ అనర్హతపై దేశమంతా ఐక్యంగా నిరసన తెలపడం, చివరకు విపక్షాలు పార్లమెంటులోని మకర ద్వారం దగ్గర పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. ఒలింపిక్స్ గ్రామంలోని పాలిక్లినిక్‌లో చికిత్స పొందుతున్న ఫొగాట్‌ను ఆవేదనతో ఓదార్చని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఒక క్రీడాకారిణి విషయంలో దేశమంతా ఐక్యం కావడం సాధారణ విషయం కాదని క్రీడా నిపుణులు అంటున్నారు. వంద గ్రాముల బరువు అనేది అసలు సమస్య కాదని, ఈ అనర్హత వెనుక కుట్ర కోణం దాగి ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఒలింపిక్స్ కమిటీతో చర్చించి ఫొగాట్‌కు న్యాయం చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

మంగళవారం జరిగిన మహిళల 50 కిలోల ఫ్రి స్టయిల్ విభాగం ప్రి క్వార్టర్ ఫైనల్, క్వార్టర్, సెమీ ఫైనల్ పోటీల్లో అసాధారణ ఆటతో ప్రత్యర్థులను మట్టికరిపించి వినేశ్ తుది పోరుకు అర్హత సాధించింది. బుధవారం ఆమె స్వర్ణం కోసం పోటీపడాల్సి ఉంది. అయితే నిబంధనల ప్రకారం 100 గ్రాముల బరువు పెరిగిందని నిర్వాహకులు వినేశ్‌పై అనర్హత వేటు వేశారు. దీంతో వినేశ్‌తో పాటు దేశం మొత్తం ఒక్కసారి షాక్‌లోకి వెళ్లిపోయింది. ఇక వినేశ్‌పై వేటు పడడంతో అసలూ ఎందుకిలా జరిగింది. రెజ్లింగ్ రూల్స్ ఏం చెబుతున్నాయనే దానిపై దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది. కాగా, బరువును తగ్గించుకునేందుకు వినేశ్ విపరీతంగా శ్రమించినా ఆమెకు ప్రతికూల ఫలితమే వచ్చింది. ఈ విషయంలో నిబంధనలు పరిశీలిస్తే.. ఒలింపిక్స్ ఫ్రి స్టయిల్ విభాగంలో పురుషులు, మహిళలకు వివిధ కేజీల విభాగంలో పోటీలు నిర్వహిస్తారు.

పురుషులకు 57 125 కిలోల మధ్య ఆరు కేటగిరీల్లో పోటీలు ఉంటాయి. ఇక మహిళలకు 50, 53, 57, 62, 68, 76 కిలోల విభాగంలో పోటీలు నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. ఇదిలా వుంటే అథ్లెట్లు ఆయా కేటగిరిలో ఉన్నారని నిర్ధారించేందుకు పోటీలు జరిగే ఉదయం బరువును కొలుస్తారు. ప్రతి కేటగిరీలో రెండు రోజుల పాటు పోటీలు ఉంటాయి. వినేశ్ ఫొగాట్ పోటీపడిన 50 కిలోల విభాగంలో మంగళవారం, బుధవారం పోటీలు జరగాల్సి ఉంది. మంగళవారం జరిగిన పోటీల్లో వినేశ్ ఫొగాట్ వరుస విజయాలతో ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇక బుధవారం ఫైనల్ పోటీ నేపథ్యంలో క్రీడాకారిణులు నిర్ణీత కేటగిరిలో బరువు ఉండేలా చూసుకోవ్సాందే. బరువు తూచే సమయంలో క్రీడాకారిణులకు 30 నిమిషాల వ్యవధి ఇస్తారు. ఈ వ్యవధిలో వారు ఎన్నిసార్లైనా తమ బరువును కొలుచుకోవచ్చు.

బరువును కొలిచే సమయంలో వారు ధరించే జెర్సీలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అంతేగాక ఇతర ఆరోగ్య పరీక్షలు చేసి ఏమైనా వ్యాధులు ఉన్నాయా లేదా అని నిర్ధారిస్తారు. రెండో రోజు మాత్రం బరువు కొలతలకు 15 నిమిషాల సమయం మాత్రమే కేటాయిస్తారు. వినేశ్ మంగళవారం బౌట్ సమయంలో తన బరువును నియంత్రణలోనే ఉంచుకుంది. కానీ, మంగళవారం రాత్రికి వినేశ్ బరువు అదనంగా రెండు కిలోలు పెరిగింది. రాత్రంతా నిద్ర పోకుండా జాగింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్ చేసి చాలా వరకు బరువును తగ్గించుకునేందుకు ప్రయత్నించింది. కానీ, చివరి 100 గ్రాములను మాత్రం తగ్గించుకోలేకపోయింది. ఇక వినేశ్‌కు కొంత అదనపు సమయం ఇవ్వాలని భారత బృందం ఒలింపిక్స్ అధికారులను కోరినా ఫలితం లేకుండా పోయింది. 100 గ్రాముల అదనపు బరువు కలిగి వుందని ఒలింపిక్ నిబంధనల ప్రకారం నిర్వాహకులు వినేశ్‌పై వేటు వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News