ముంబై: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి ప్రశంసల వర్షం కురిపించాడు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో కోహ్లి జట్టును నడిపించిన తీరును ఎంత పొగిడినా తక్కువేనన్నాడు. సారథ్యం మార్పు గురించి చర్చలు సాగుతున్న తరుణంలో విరాట్ ఎలాంటి ఒత్తిడి లేకుండా తన పని తాను చేసుకుని ముందుకు పోవడం తనను ఎంతో ఆకట్టుకుందన్నాడు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో కోహ్లిని మించిన కెప్టెన్ లేడనడంలో అతిశయోక్తి కాదన్నాడు. సీనియర్, జూనియర్ ఆటగాళ్లతో కలిసి జట్టును జయప్రదంగా ముందుకు నడిపిస్తున్న ఘనత కోహ్లికి మాత్రమే దక్కుతుందన్నాడు. ప్రతి బౌలర్‌కు, బ్యాటర్‌కు తనవంతు సహకారం అందిస్తూ వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో కోహ్లిని మించిన సారథి ఎవరూ లేరన్నాడు. తొలి టెస్టులో ఒత్తిడిలోనూ భారత బౌలర్లు సమర్థంగా రాణించేందుకు విరాట్ సారథ్య ప్రతిభే ప్రధాన కారణమని ప్రశంసించాడు. ఇదే జోరును కొనసాగిస్తే సఫారీ గడ్డపై టెస్టు సిరీస్‌ను గెలుచుకోవడం విరాట్ సేనకు కష్టం కాదని కాంబ్లి అభిప్రాయపడ్డాడు.