Monday, December 23, 2024

రెరా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

- Advertisement -
- Advertisement -

మూడు సంస్థలకు షోకాజ్ నోటీసులు
జారీ చేసిన రెరా చైర్మన్

మనతెలంగాణ/హైదరాబాద్:  రెరా చట్టంలోని నిబంధనలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు విధిగా పాటించాలని రెరా చైర్మన్ డాక్టర్ ఎన్. సత్యనారాయణ సూచించారు. రెరా నిబంధనలు ఉల్లంఘించిన మరో మూడు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు మంగళవారం ఆయన షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లోగా దీనికి సంబంధించి సంజాయిషీ సమర్పించాలని ఆయన ఆదేశించారు. నాగోల్ ఎక్స్‌రోడ్డులోని సుప్రజ ఆసుపత్రి సమీపంలో నాని డెవలపర్స్ పేరుతో కార్యాలయం ప్రారంభించి, రెరా రిజిస్ట్రేషన్ పొందకుండా శ్రీ లక్ష్మీనరసింహ కంట్రీ-3 పేరుతో ఆలేరు, యాదాద్రిలో వెంచర్లు చేపట్టి కరపత్రాలు బ్రోచర్ల ద్వారా కొనుగోలుదారులను ఆకర్షిస్తూ ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం చేయడం చట్టరీత్యా నేరమని అందులో భాగంగా ఈ సంస్థకు నోటీసులు జారీ చేసినట్టు రెరా చైర్మన్ తెలిపారు.

ఖైరతాబాద్ ప్రేమ్‌నగర్ కాలనీకి చెందిన ఆర్నా ఇన్‌ఫ్రా డెవలపర్స్ రెరా రిజిస్ట్రేషన్ పొందకుండా మహేశ్వరం వద్ద ఓపెన్ ప్లాట్లు విక్రయించే కార్యక్రమాన్ని చేపట్టి బ్రోచర్ల ద్వారా విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని అందులో భాగంగా ఆ సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేసినట్టు చైర్మన్ పేర్కొన్నారు. అదేవిధంగా కర్మన్‌ఘాట్ ప్రాంతంలోని మంద మల్లమ్మ ఎక్స్ రోడ్డుకు చెందిన అషూరుడు ప్రాపర్టీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆరంబు, అరణ్య పేరుతో నాగార్జునసాగర్ హైవే చింతపల్లి, శ్రీశైలం హైవే ఆమనగల్ ప్రాంతంలో ఓపెన్ ప్లాట్లు బహిరంగ విక్రయాన్ని చేపట్టిందని దీనికి రెరా రిజిస్ట్రేషన్ పొందకుండా చేపట్టినందున ఆయన షోకాజు నోటీసు జారీ చేశారు. రెరా చట్టo ప్రకారం రెరా రిజిస్ట్రేషన్ లేకుండా ఎలాంటి ప్రకటనలు జారీ చేయరాదని, నిబంధనలు అతిక్రమించే బాధ్యులపై చట్టరీత్యా తగిన చర్యలు చేపడుతామని చైర్మన్ హెచ్చరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News