ప్రతి సంవత్సరం నవంబర్ 25 నుండి డిసెంబర్ 10 వరకు అంటే ప్రపంచ మానవ హక్కుల దినం వరకు, 16 రోజుల పాటు మహిళలపై వివిధ రూపాల్లో జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా, భారతదేశంతో సహా, ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో పెద్ద ఎత్తున ప్రచార, కార్యాచరణ కార్యక్రమాలు జరుగుతాయి. ఎందుకు నవంబర్ 25వ తేదీని స్త్రీలపై హింసను వ్యతిరేకించే తేదీగా ఎంచుకోవడం జరిగిందని అంటే, సరిగ్గా అదే తేదీనే, 1960లో డొమినికన్ రిపబ్లిక్‌లో అక్కడి నిరంకుశ పరిపాలకుడు రాఫియల్ త్రిజిలో (Rafael Trujillo) కి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ముగ్గురు అక్కాచెల్లెళ్ళు హత్యగావించబడ్డారు.
రాజకీయ కార్యకర్తలైన, మిరాబాల్ (Mirabal) అక్క చెల్లెళ్ళుగా పిలిచే 36 ఏళ్ల పాట్రియా, 34 ఏళ్ల మారియా, 26 ఏళ్ల మారియో థెరీసా అనే ఈ ముగ్గురు యువతులను పోలీసులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన అనంతరం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా తిరుగుబాటు జరిగి, ఆరు నెలల తరువాత నిరంకుశ పాలకుడు త్రిజిలో మరణించాడు. అనేక దేశాలలో ‘మిరాబల్ సిస్టర్స్’ మహిళల ప్రతిఘటనకి స్ఫూర్తి ఇచ్చే గుర్తులుగా మారారు.
లాటిన్ అమెరికన్ దేశాలు నవంబర్ 25న వీళ్ళు చంపివేయబడ్డ రోజును స్త్రీలపై హింసను వ్యతిరేకించే అంతర్జాతీయ దినంగా జరపాలని 1970 ల నాటికే పిలుపునిచ్చాయి. 1981 ఆనాటి నుంచి ఒక్కొక్కటిగా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో మహిళా హక్కుల కోసం పని చేస్తున్న వివిధ సంస్థలు డిసెంబర్ 25వ తేదీని స్త్రీలపైన హింసకి వ్యతిరేకించే రోజుగా పాటించడం మొదలు పెట్టాయి. ఎన్నో ఏళ్ల తరువాత 1993లో మహిళలపై హింసను రూపుమాపేందుకై ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. 2000, ఫిబ్రవరి 7న అది మరొక తీర్మానాన్ని కూడా చేసింది. నవంబర్ 25 వ తేదీని ‘స్త్రీలపై హింస వ్యతిరేక దినంగా’ పాటించాలని, అలాగే ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో మహిళల హక్కుల కోసం పని చేస్తున్న సంస్థలు ఈ పిలుపు అందుకొని ప్రజలలో చైతన్యం తీసుకొచ్చేందుకు 16 రోజులపాటు ప్రచార కార్యక్రమాన్ని చేయాలని అది అధికారికంగా ప్రకటించింది.
ఈ ప్రచార ఉద్యమాన్ని యుఎన్ వుమెన్ ప్రారంభిస్తూ, మహిళల హక్కులు మానవ హక్కులే అంటూ, మహిళలపై జరుగుతున్న హింస మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం ప్రపంచంలో 35% మంది మహిళలు భౌతిక, లైంగిక హింసను ఎదుర్కొంటూ ఉన్నారు. 736 మిలియన్ల మహిళలు బాలికలుగా ఉన్నప్పుడే వైవాహిక జీవితంలోకి నెట్టబడ్డారు. 133 మిలియన్ల బాలికలు ఇప్పటికీ జెనిటల్ మ్యూటేషన్ పేరుతో జననావయవాల విచ్ఛిత హింసను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా హత్యకు గురవుతున్న మహిళల్లో సగం మంది మహిళలు, వాళ్ళ జీవిత సహచరులు, తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల చేతుల్లో చంపబడుతున్నారు. 120 మిలియన్ల బాలికలు బాల్యంలోనే బలవంతపు లైంగిక చర్యలను ఎదుర్కొంటూ ఉన్నారు.
భారతదేశంలోనూ మహిళలపై హింస ప్రతి ఏడాదీ ఎన్నో రెట్లు పెరుగుతూనే ఉంది. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) రిపోర్ట్ ప్రకారం 2022లో స్త్రీలపై జరుగుతున్న నేరాలకు సంబంధించి 4,45,256 కేసులు నమోదు అయ్యాయి. అంటే, సుమారు ప్రతి గంటకి 51 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అవుతున్నట్టు అన్నమాట. 2020 సంవత్సరంలో 3,71,503 కేసులు నమోదయ్యాయి. స్త్రీల పైన జరుగుతున్న హింస రెండు ఏళ్ళలోనే ఎంత వేగంగా పెరిగిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. స్త్రీలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా, కేవలం స్త్రీలు మాత్రమే ఉద్యమించడం కాకుండా, మగపిల్లలు, యువకులు, పురుషులు ఈ హింసకు గల మూల కారణాలను, అందుకు కారణం అయిన పురుషుల ఆధిపత్యాన్ని తెలుసుకునేలా చేయాలనీ, పురుషులను కూడా ఈ 16 రోజుల ప్రచారంలో భాగం చేసేలా హింసా వ్యతిరేక క్యాంపెయిన్ అంతటా నడుస్తుంది.
ప్రపంచం అంతటా స్త్రీలపైన వివిధ రూపాల్లో జరుగుతున్న హింస సాధారణీకరించబడింది.
అన్ని చోట్లా అది సమాజపు ఆమోదం పొందుతున్నటువంటి విషయంగా కూడా ఉంటుంది. ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా మహిళలు రెండవ తరగతి పౌరులుగానే పరిగణించబడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ) 2000-2018 మధ్య 161 దేశాలలో చేసిన అధ్యయనాల నివేదిక ప్రకారం, ప్రపంచంలో ప్రతి ముగ్గురు మహిళలలో ఒక మహిళ, అంటే 30 శాతం మంది ఆడవాళ్లు శారీరకమైన హింసకు లేదా లైంగిక హింసకు తమ జీవిత భాగస్వాములు లేదా సహచరుల చేతిలోనూ వారి జీవిత కాలంలో గురి అవుతూ ఉన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న లైంగిక శారీరక హింస వాళ్ళ జీవిత భాగస్వాములు చేతుల్లో ఎంతో ఎక్కువగా జరుగుతూ ఉంది. అమెరికాలో 29.8%, యూరప్ ప్రాంతంలో 25.4%, వెస్టన్ పసిఫిక్ ప్రాంతంలో 24.6%, మెడిటేరియన్ ప్రాంతంలో 37%, ఆఫ్రికా ప్రాంతంలో 36.6%, సౌత్ ఈస్ట్ ఏషియా ప్రాంతంలో 37.7% మహిళలు తమ జీవిత భాగస్వాముల చేతుల్లో హింసకు గురవుతున్నారు. 15 నుంచి 49 సంవత్సరాల మధ్య వయసు మహిళలు ప్రపంచ వ్యాప్తంగా తమ జీవిత భాగస్వాముల చేతుల్లోనే లైంగిక శారీరక హింసకి గురి అవుతున్నారు.
ఈ నిత్య హింసా భయం, బెదిరింపులు, వారి కదలికలపై, చివరికి మాటలపై కూడా జరిగే నియంత్రణలు మహిళల శారీరక, మానసిక, లైంగిక జీవితాలపైన, వాళ్ళ పునరుత్పత్తికి సంబంధించిన ఆరోగ్యం పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపుతూ ఉన్నాయని అధ్యనాలు తెలుపుతున్నాయి. ఐక్యరాజ్యసమితి స్త్రీలపై హింసకు సంబంధించిన నిర్వచనాలు చెబుతూ జెండర్ కారణంగా ఎటువంటి రకమైన హింసకు పాల్పడ్డా లేదా అలా పాల్పడానికి ప్రయత్నించినా, శారీరక, లైంగిక లేదా మానసికమైనటువంటి ఎలాంటి హాని తలపెట్టినా, వీటి వల్ల ఏ స్త్రీ అయినా బాధకు గురైతే అవి అన్నీ కూడా హింస కిందికే వస్తాయి. పైన పేర్కొన్నటువంటి చర్యలు చేస్తామని భయపెట్టినా, వారిని అలాంటి చర్యకు ఒప్పించినా, బలవంతపెట్టినా, వారి స్వేచ్ఛకు భంగం కలిగించినా, వీటన్నిటి కారణంగా ఆ మహిళల బహిరంగ జీవితం లేదా వ్యక్తిగత జీవితం నష్టపడినా, అదంతా హింస కిందికే వస్తుంది.
పెళ్లి లేదా సహజీవనంతో ఒక స్త్రీ, ఒక పురుషుడితో ఉంటున్నప్పుడు ఆ భాగస్వామి మహిళల పైన శారీరకంగా, లైంగికంగా, మానసికంగా ఏ రకపు హానిని తలపెట్టినా, ఒత్తిడి చేసినా, మానసికంగా అబ్యూస్ చేసినా, మహిళల ప్రవర్తనను నియంత్రించేందుకు ప్రయత్నించినా ఇవన్నీ కూడా ఇంటిమేట్ పార్టనర్ చేసే హింస కిందికే వస్తాయి. అభ్యంతరకరంగా మహిళల శరీరాన్ని తాకటం, లైంగిక అత్యాచారానికి ప్రయత్నించటం, అత్యాచారం చేస్తానని బెదిరించడం, ఒక పనిని చేసిపెట్టినందుకు గాను లైంగికపరమైన ఫేవర్స్‌ని పొందడం, ఇవన్నీ కూడా సెక్సువల్ హింస కిందకే వస్తాయి.
ఇంత వివరణాత్మకమైన నిర్వచనాన్ని ఐక్యరాజ్యసమితి ఎందుకు ఇచ్చిందని అంటే, స్త్రీలపై జరుగుతున్న హింసా పరిధి చాలా విశాలం, విస్తృతం, సామాజిక ఆమోదం కలిగినదై వుండటం వల్లనే. అంతేకాదు మతం, కులం, జాతి, విశ్వాసాలు, సాంప్రదాయాలు అనే పేరిట ఈ హింసకు ధర్మబద్ధత కూడా తరచూ కల్పించబడుతూ వుంటుంది.
ప్రపంచ వ్యాప్తంగా హత్య గావించబడుతున్న మహిళల్లో 38% మంది మహిళలు వారి సన్నిహిత సహచరుల చేతుల్లో చంపబడుతున్నారు. 42% మంది మహిళలు వారి జీవిత సహచరుల చేతుల్లో హింసకు, తన్నులకు గురై గాయాల పాలవుతున్నారు. అంతేకాదు వాళ్లు కోరుకొని అకాల గర్భధారణలకు లేదా ఆ తన్నుల వల్ల గర్భ విచ్ఛితికి, గైనిక్ సమస్యలకు, అనారోగ్యాలకు చివరికి హెచ్‌ఐవి వంటి జబ్బులకు గురవుతున్నారు. భార్యల శరీరాలపై సమస్త హక్కులు వున్నాయని భావించే భర్తలు వారిపై చేసిన బలవంతపు లైంగిక చర్యల కారణంగా 1.5% మహిళలు హెచ్‌ఐవి జబ్బుకు బలయ్యారు. ఇదంతా ఒక ఎత్తయితే, ఈ శారీరక హింసలు, అత్యాచారాల వల్ల స్త్రీల శారీరక, మానసిక ఆరోగ్యం ఎంతగానో దెబ్బతింటున్నది. అలాంటి హింసల నుంచి బయటపడిన తర్వాత కూడా ఏళ్ల తరబడి మహిళలు మానసిక కుంగుబాటుకు, భయం, తీవ్ర ఆందోళన, ఆత్రుత, నిద్ర లేమి, ఆహారం తీసుకోవడంలో క్రమబద్ధత లేకపోవడం, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కలగడం, అందుకోసం ప్రయత్నించడం ఇలాంటివన్నీ కూడా వాళ్ళలో జరుగుతూ ఉన్నాయి.
వెన్ను నొప్పి, పొత్తి కడుపులో నొప్పి, క్రానిక్ పెయిన్స్, కదిలేందుకు, బయటికి వెళ్లేందుకు, ఏదైనా పని చేసేందుకు జంకటం, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడం, నిత్యం భయపడడం, కుంగుబాటు ఇలాంటి అనేక లక్షణాలకు మహిళలపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జరుగుతున్న హింసయే కారణం అని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. బయటికి చెప్పుకోలేనటువంటి ఈ క్రూర హింసల్ని పురుషాధిపత్య సమాజం, కుటుంబం సాధారణీకరణ చేసింది. ఈ మొత్తం పరిణామాలు పురుషులపై కూడా భారమే. అణిచివేసే, హింసా ప్రవృత్తి గల వారిగా మగవాళ్ళని మార్చి వేసే పితృస్వామ్య సంకెళ్ళను వాళ్ళు కూడా తెంచి వేసినప్పుడే, మానవీయ విలువలు కలిగిన నిజమైన మానవులుగా వాళ్ళు మిగలగలుగుతారు. ఈ అంకెల వెనుక మనుషులున్నారు.
మానవ జాతికి, పురుషులకు జన్మనిచ్చిన తల్లులున్నారు. తమను హింసించి, భక్షించే జాతికి తామే జన్మనివ్వడం స్త్రీల జీవితాలలోకెల్లా విషాదమైన విషయం. అన్ని హద్దులను, నియంత్రణలను, బుద్ధులను, హింసను అనుభవిస్తున్న వారికే పదేపదే బోధించడం మాని, ఆ హింసకు కారకులైన పురుషులకు, ఆ హింసకు అండగా నిలుస్తున్న సమాజంలోని అన్ని వ్యవస్థలకు ఇకనైనా మారాలని చెప్పాలి. స్త్రీలపై హింసలేని సమాజం, స్త్రీలూ, పురుషులూ సమాన సహచరులుగా, మానవులుగా జీవించడం అపపుడే సాధ్యమని చెప్పాలి. అది జరిగేందుకు ఈ 16 రోజుల ప్రచారం మాత్రమే కాదు, 364 రోజులూ, 24 గంటల సమయం కూడా చాలదేమో!
(రచయిత్రి సామాజిక కార్యకర్త)
విమల
బహుముఖం