Sunday, December 22, 2024

ఇంకా రగులుతున్న మణిపూర్

- Advertisement -
- Advertisement -

మణిపూర్‌లో హింస 90 శాతం అదుపులోకొచ్చిందని ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రకటించారు. ఆరు నెలలుగా జాతి విద్వేషాలు నిరాటంకంగా ఇప్పటికీ సాగుతూ, అప్పుడప్పుడూ మంటలు చెలరేగుతునే వున్నాయి. దేశ విభజన సమయంలో జరిగిన హింస కంటే ఈ హింస చాలా ఎక్కువ. దేశవిభజన సమయంలో జాతి విద్వేషాలు చెలరేగినప్పటికీ, మెజారిటీ ప్రజలు నివసించే అనేక ప్రాంతాల్లో మైనారిటీ ప్రజలు కొనసాగారు. ఇటీవల అల్లర్లు చెలరేగిన పంజాబ్‌లోని మలెర్‌కొట్లలో, హర్యానాలోని ‘నూ’లో శాంతి సామరస్యత నెలకొంది. పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో కానీ, బంగ్లాదేశ్‌లో కానీ హిందూ మైనారిటీలు క్షేమంగా ఉన్నారు. మణిపూర్‌లో పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. మణిపూర్‌లో మెయితీ, కుకీల మధ్య జాతివిభజన ఏర్పడింది. జాతి విద్వేషాలు మొదలవగానే మెయితీలు ఎక్కువగా ఉన్న లోయ ప్రాంతాల నుంచి కుకీలు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అలాగే కుకీలు అధికంగావున్న కొండప్రాంతం నుంచి మెయితీలు ఖాళీచేసి వెళ్ళిపోయారు. వారి మధ్య విభజన పూర్తయి, దేశాల మధ్య సరిహద్దుల్లా విభజన రేఖకు ఇరువైపులా భద్రతా దళాలు మోహరించి, అటువాళ్ళు ఇటు, ఇటు వాళ్ళు అటు వెళ్ళడం ఆగిపోయింది.

పోలీసుల నుంచి, రిజర్వు బెటాలియన్ ఆయుధాగారం నుంచి వేలాది ఆటోమేటిక్ ఆయుధాలు, రాకెట్ లాంచర్లు, లక్షల సంఖ్యలో మందుగుండు సామాగ్రిని ఎత్తుకుపోయారు. సాయుధ ముఠాలు సాధారణ పౌరులపైన చేపట్టే హింసాత్మక దాడులలో వీటిని ఉపయోగించాయి.ఎత్తుకెళ్ళిన ఆయుధాలను అప్పగించేయాలని రాష్ర్ట ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి ఎలాంటి ఫలితం లేదు. ఈ జాతి విద్వేష హింసలో 200 మంది ప్రాణాలను కోల్పోగా, 75 వేల మంది తమ నివాస ప్రాంతాల నుంచి తరలిపోయారు. కేంద్రంలోనూ, రాష్ర్టంలోనూ ఉన్న బిజెపి ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోలేదు. కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాల అసమర్ధత వల్ల ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.‘ప్రజల ఆగ్రహం, నిరసనలు నిదానంగా పెరుగుతున్నాయి. పరిస్థితిని చక్కదిద్దడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని పరిస్థితులు నలుదిక్కులా చూపిస్తున్నాయి’ అని బిజెపి రాష్ర్ట విభాగం కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొంది. ముఖ్యమంత్రి మెయితీ వర్గానికి చెందినప్పటికీ, ఆ వర్గం విశ్వాసాన్నికూడా కోల్పోవడమే కాకుండా, ఆయనింటితో పాటు బిజెపి రాష్ర్ట అధ్యక్షుడి ఇంటిపైన కూడా దాడి జరిగింది.

ప్రజానీకం ఇతర జాతి నుంచి రక్షణ కోసం ప్రభుత్వంపైన కాకుండా, గ్రామ రక్షణ కమిటీలపైనే ఆధారపడ్డారు. తమ ఆయుధాగారాన్ని దోచుకుపోయిన అల్లరి మూకకు రాష్ర్ట పోలీసులు లొంగిపోయినట్టు వ్యవహరిస్తున్నారు. తమ ఆయుధాగారాన్ని రక్షించుకోలేని పోలీసు వ్యవస్థ తమకు రక్షణ కల్పిస్తుందనే నమ్మకాన్ని ప్రజలు కోల్పోయారు. పోలీసు వ్యవస్థే కాదు, అధికారుల వ్యవస్థ కూడా అచేతనంగా తయారైపోయిది.రాష్ర్ట వ్యవస్థలపైన ప్రజల నమ్మకం సడలిపోయింది. అంతర్యుద్ధంలో వలే ప్రభుత్వం ఇక ఏ మాత్రం నడిచే స్థితిలేదు. మణిపూర్‌లో పరిస్థితిని అదుపు చేయలేకపోయినట్టయితే, ఈశాన్య రాష్ట్రాలలో నెలకొన్న శాంతి, సుస్థిరత దెబ్బ తింటుంది.
ఇంత జరుగుతున్నా బీరేన్ సింగ్ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం విశ్వాసాన్ని ప్రకటించడమే ఆశ్చర్యకరం. శాంతి భద్రతల సమస్యపై ముఖ్యమంత్రి సహకరిస్తుండడం వల్ల ఆయన్ని తొలగించాల్సిన అవసరం లేదని కేంద్ర హోం శాఖామంత్రి ప్రకటించారు. సాధారణ పరిస్థితులు నెలకొనడానికి రాష్ర్టపతి పాలన విధించక తప్పదు. రాష్ర్ట పోలీసులకు, అసోం రైఫిల్స్‌కు మధ్య సయోధ్య లేకపోవడం వల్ల కూడా రాష్ర్టపతి పాలన విధించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మెయితీలు నివసించే 19 పోలీస్ స్టేషన్ల పరిధిని వదిలేసి, కుకీలు నివసించే ప్రాంతమంతా సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఎఎఫ్‌ఎస్‌పిఎ) అమలు చేయడం ప్రభుత్వ పక్షపాత ధోరణికి నిదర్శనం.

ఫలితంగా మెయితీ తిరుగుబాటు సాయుధ దళాలు దొంగిలించిన ఆయుధాలతో చెలరేగిపోతున్నారు. జాతి వైరాలతో విభజితమైన పోలీసుల రోజువారీ పని పద్ధతులపైన ఈ అధికారికి ఎలాంటి అదుపు లేకుండా పోయింది. పరిస్థితిని అదుపు చేయాల్సిన బాధ్యత వున్న పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఒక వర్గానికి చెందిన పోలీసులు మరొక వర్గం వారు నివసించే ప్రాంతంలో గస్తీ తిరుగలేకపోతున్నారు. ఈ గొడవలకు హిందూ క్రైస్తవ ఘర్షణలుగా రంగు పులమడానికి రెండు వందల చర్చిలను, పన్నెండు దేవాలయాలను దగ్ధం చేసి, వాటిని దోచుకున్నారు.
మన పొరుగునున్న చైనా మన సమస్యలపై కాచుకు కూర్చునుండడంతో, ఈ సమస్య మన సమగ్రతకు ముప్పు ఏర్పడనుంది. జాతుల మధ్య అనుమానాలు, అపార్థాలు చాలా లోతుగా వున్న ఈ సమయంలో సాధారణ స్థితికి రావడానికి చాలా కాలం పడుతుంది. తొలుతే రాష్ర్టపతి పాలన విధించవలసి వుంది. అది జరగకపోయేసరికి పరిస్థితిని అదుపు చేయడానికి కేంద్ర బలగాలను, అవసరమైతే సైన్యాన్ని దించవలసి ఉంది. ఇప్పటికైనా రాష్ర్టపతి పాలన విధించి, స్థానిక జాతి వైరంతో సంబంధం లేని కేంద్ర బలగాలను దించినట్టయితే ప్రజల్లో విశ్వాసాన్ని పాదుకొల్పవచ్చు.

మెయితీ వర్గం వైపు వున్న రాష్ర్ట పోలీసులు ఈ పనులను చేయలేరు. మరొక వైపు అసోం రైఫిల్స్ కూడా కుకీల వైపు పక్షపాత ధోరణితో వుందని మెయితీల ఆరోపణ. రాష్ర్టపతి పాలన విధించినట్టయితే, ప్రజల దృష్టిలో చట్టబద్ధ పాలన సాగించే అర్హత కోల్పోయిన ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌ను తొలగించి, ప్రజల్లో విశ్వాసాన్ని నింపాలి. దుండగులు ఎత్తుకుపోయిన ఆయుధాలను తిరిగి అప్పగించాలి. ఇందు కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాలి. నేరస్థులను సాధ్యమైనంత త్వరగా శిక్షించడానికి స్పెషల్ ఇన్‌వెస్టిగేటింగ్ టీవ్‌ును, ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలి. బాధితులను దగ్గరకు చేర్చుకోవాలంటే దారుణమైన హింసకు పాల్పడినవారిని, ముఖ్యంగా మహిళలు, పిల్లలపైన హింసకు పాల్పడినవారిని న్యాయస్థానాల ముందునిలబెట్టాలి. ఘర్షణ జరిగిన ప్రాంతాల్లో అధికారులు తరుచూ పర్యటించి, పరిస్థితిని అంచనా వేస్తూ, ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలి. అవసరమైన చోట ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని కల్పించాలి. ఈశాన్య ప్రాంతాల్లో గౌరవప్రదంగా ఉండే ‘గావోన్ బుద్ధాస్’ అనే గ్రామాధికారులు, మహిళా సంఘాలతో కలిపి జాతుల మధ్య చర్చలు మొదలు పెట్టి, తద్వారా ప్రజల మధ్య వున్న అపోహలను తొలగించాలి.

భిన్నజాతుల మధ్య పరస్పర అవగాహన, స్నేహంతో మాత్రమే హింసను ఎదుర్కోగలం.
మణిపూర్‌లో ఘర్షణలకు కారణమైన మయన్మార్ నుంచి చొరబడి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోకుండా సరిహద్దులను కట్టుదిట్టం చేయాలి. స్థానిక గిరిజనులు స్వేచ్ఛగా వెళ్ళి రావడానికి అనుకూలంగా స్వేచ్ఛగా తిరుగాడే ప్రాంతంగా అమలు చేయడానికి, రికార్డులను నిర్వహించడానికి సరిహద్దు భద్రతా బలగాలు సమర్థవంతంగా పని చేయాలి. మణిపూర్‌లో, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో ఆంతరంగిక భద్రత ప్రాథమిక బాధ్యతగా పని చేసే అసోం రైఫిల్స్‌కు ఆ పనులను కేటాయించాలి. మారుమూల కొండ ప్రాంతాల్లో మంచి పరిపాలన కోసం హిల్ కమ్యూనిటీలను ఏర్పాటు చేయాలి. ప్రధానమైన సమస్య ఏమిటంటే, లోయలో ఆక్రమించుకున్న మెయితీల చేతిలోనే అభివృద్ధి అంతా కేంద్రీకృతమైందనేది కుకీల ఆరోపణ. మారుమూల ఉన్న కొండ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలి. మణిపూర్‌లో నేను పని చేసినప్పుడు అక్కడి చురాన్‌చాంద్‌పూర్‌లో నా అనుభవం ఏమిటంటే, అధికారు లు కానీ, పోలీసులు కానీ మారుమూల ప్రాంతాలను సందర్శించలేదు.

మారుమూల వుండే కొండప్రాంతాల్లో కనీస వసతులు లేవు. చురాన్‌చాంద్‌పూర్ నుంచి 70 కి.మీ దూరంలో ఉన్న మయన్మార్ సరిహద్దుకు వెళ్ళడానికి 2007లో నాకు ఏడు గంటలు పట్టింది. పదిహేనేళ్ళ తరువాత కూడా ఆ ప్రాంతంలో చాలా స్వల్ప అభివృద్ధి మాత్రమే జరిగిందని నా సహోద్యోగులు ఇప్పటికీ చెపుతున్నారు. రాజ్యాంగంలోని 371 సి ప్రకారం కొండ ప్రాంతం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులతో ఏర్పడిన రాష్ర్ట అసెంబ్లీ కమిటీ సమర్థవంతంగా పని చేయడానికి అనుమతివ్వాలి. కొండ ప్రాంతంలో వుండే జిల్లాలకు స్వయంప్రతిపత్తి గల జిల్లా కమిటీలను ఏర్పాటు చేయాలి.ప్రస్తుతం ప్రధాన నగరాలను, పట్టణాలను మాత్రమే కలుపుతున్న రహదారులను తూర్పు ప్రాంతాలను కూడా కలిపేలా రైలు, రోడ్డు మార్గాలను అభివృద్ధి చేయాలి. విద్య, వ్యవసాయం, పరిశ్రమలను అభివృద్ధి చేయాలి. పరిశ్రమలను స్థాపించి, ఉపాధి అవకాశాలు పెంచినట్టయితే హింస, మాదకద్రవ్యాల రవాణా వంటి నేరాలకు ప్రజలు పాల్పడరు. పామాయిల్ తోటల పెంపకం భూసారాన్ని దెబ్బ తీస్తుంది. కొండప్రాంతాల్లో చేపట్టే గసగసాల సాగును కూడా నిలిపి వేసి, కోళ్ళపరిశ్రమ, పాడి పరిశ్రమ, గొర్రెలు, మేకల పెంపకం వంటి ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారించాలి.

కొండ ప్రాంతంలో ఉండే వాతావరణానికి తగినట్టు కాఫీ, పైనాపిల్, బత్తాయి, అరటి వంటి పంటలను, రబ్బరు తోటలను వేసుకోవచ్చు. మెయితీలు తమని షెడ్యూల్డ్ తరగతుల్లో చేర్చాలనే కోర్కె ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం కాకుండా, కొండ ప్రాంతాల్లో భూముల కొనుగోలు కోసం అన్న విషయం గమనించాలి. జాతి విద్వేషాలతో మణిపూర్ నిరంతరాయంగా రగులుకోవడం దేశ భద్రతకు, సమగ్రతకు పెద్ద దెబ్బ.ఆ రాష్ర్టంలో సాధారణ పరిస్థితిని పునరుద్ధరించడం తక్షణావసరం. దీర్ఘకాలికంగా వున్న సమస్యల పరిష్కారానికి చర్చలు మొదలుపెట్టాలి. ‘ఇంటికప్పు నుంచి సూర్యు డు తొంగిచూస్తున్నప్పుడే మరమ్మతులు చేపట్టాలి’ అనేది సామెత. అధికారులు ఇప్పటికైనా జాతి, మత, ప్రాంతీయ సమస్యలను పరిష్కరించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News