ఇస్లామిస్టు గ్రూప్ నిరసనల ఉధృతి
హిందూ దేవాలయాలపై దాడులు
రైలు విధ్వంసం ..వీధుల్లో ప్రదర్శనలు
ఢాకా : భారత ప్రధాని మోడీ పర్యటనలో బంగ్లాదేశ్‌లో తలెత్తిన హింసాకాండ మరింత రగులుకుంది. ఆదివారం పలు చోట్ల హిందూ దేవాలయాలపై అతివాద ఇస్లామిస్టు సంస్థ సభ్యులు దాడి జరిపారు. తూర్పు బంగ్లాదేశ్‌లో ఓ రైలును నిలిపివేసి, విధ్వంసానికి దిగారు. ప్రధాని మోడీ బంగ్లాదేశ్ పర్యటనను నిరసిస్తూ అక్కడ హింసాకాండ చెలరేగి, కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. ఇప్పటికీ దేశంలో నిరసనలు సాగుతూ పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం నుంచి ఆదివారం వరకూ కనీసం 11 మంది కాల్పుల్లో మృతి చెందారని స్థానిక పోలీసులు, వైద్యులు తెలిపారు. ఆదివారం బంగ్లాదేశ్‌లో పలు చోట్ల వేలాది మంది వీధులలో కలియతిరిగారు. ప్రధాని మోడీ బంగ్లాదేశ్‌కు రావడాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలకు దిగారు. భారతదేశంలో మైనార్టీ ముస్లింల పట్ల మోడీ ప్రభుత్వం వివక్షతను ప్రదర్శిస్తోందని ఇస్లామిక్ గ్రూప్ మండిపడుతోంది. హెఫజత్ ఎ ఇస్లామ్ గ్రూప్ కార్యకర్తలు కొందరు బ్రహ్మన్‌బరియా జిల్లాలో ఓ రైలుపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పది మంది వరకూ గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
నిరసనకారులు రైలు ఇంజిన్ రూంను, కొన్ని బోగీలను ధ్వంసం చేశారని తెలిపారు. తాము ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నామని, భయంతో గడపాల్సి వస్తోందని బ్రహ్మన్‌బరియా పట్టణానికి చెందిన జర్నలిస్టు జావెద్ రహీం తెలిపారు. నిరసనకారులు ప్రెస్‌క్లబ్‌పై కూడా దాడి జరిపారని, ప్రెస్‌క్లబ్ ప్రెసిడెంట్‌తో పాటు పలువురు గాయపడ్డారని తెలిపారు. . ఆదివారం ఇస్లామిస్టు కార్యకర్తలు రాజ్‌షాహీ జిల్లాలో రెండు బస్సులపై దాడికి దిగారు. ఢాకాకు శివార్లలో ఉండే నారాయణ్‌గంజ్‌లో నిరసనకారులు ఎలక్ట్రిక్ స్తంభాలు, వెదురు, ఇసుకసంచీలతో రోడ్లపై అడ్డంకులు కల్పించారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు రబ్బరు బుల్లెట్లు, భాష్పవాయువు ప్రయోగానికి దిగారు. దీనితో పలువురు గాయపడ్డారు.