Monday, December 23, 2024

దూరమవుతున్న ఇరుగుపొరుగు

- Advertisement -
- Advertisement -

పదేళ్ల పాలనలో ప్రధాని నరేంద్ర మోడీ సాధించిన విజయాలలో అత్యంత ప్రభావంతమైన విదేశాంగ విధంగా ఒకటిగా భావిస్తూ వస్తున్నాము. అయితే మన విదేశాంగ విధానం మౌలికమైన సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలు వెల్లడి చేస్తున్నాయి. మొదటిసారి ప్రధాని పదవి చేపట్టే సమయంలో పొరుగు దేశాల ప్రధానులను ఆహ్వానించడం ద్వారా పొరుగు దేశాలతో మంచి స్నేహమే తన ప్రాధాన్యత అని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.

అయితే, బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా మినహా చెప్పుకోదగిన స్నేహితులు లేకుండా పోయారు. ఒక వంక చైనా మన సరిహద్దుల్లో భారీ భూభాగాలను ఆక్రమించుకున్నా నోరు మెదపలేని పరిస్థితుల్లో ఉన్నాం. పాకిస్థాన్‌తో సాధారణ సంబంధాలు సైతం మెరుగుపడే అవకాశం కనబడటం లేదు. అమెరికా ఆగ్రహం గ్రహించిన భారత్ విదేశాంగ మంత్రి గత వారం టోక్యోలో అమెరికా విదేశాంగ కార్యదర్శితో రెండు గంటలకు పైగా భేటీ జరిపి సర్దిచెప్పుకోవాల్సి వచ్చింది. గాజా ఘర్షణలో ఒక వంక ఇరాన్ నుండి చమురు పొందుతూ, మరోవంక ఇజ్రాయిల్‌కు ఆయుధాల సరఫరా చేస్తూ భారత్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నదనే విమర్శలు ఎదుర్కొంటున్నది. విదేశాంగ విధానంలో నెలకొన్న ఈ క్లిష్ట పరిస్థితులకు తోడుగా బంగ్లాదేశ్‌లో ఇప్పుడు ప్రభుత్వం మారడంతో భారత్ అతి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

అక్కడ షేక్ హసీనాకు వ్యతిరేకంగా చెలరేగిన నిరసనలు ‘భారత్ వ్యతిరేకత’తో ముడిపడటం గమనార్హం. ఆమెకు వ్యక్తిగతంగా భారత్ అండగా ఉంటూ రావడంతో భారత్ జాదర్ మామాబారి, బంగ్లా చారో తరతారీ (బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టండి, మీలో నిజమైన మాతృభూమి భారత దేశం) వంటి నినాదాలు తరచుగా వినిపించాయి. వైద్య కళాశాలలతో సహా బంగ్లాదేశ్ విద్యా సంస్థల్లో చదువుతున్న సుమారు 9,000 మంది భారతీయ విద్యార్థులను ఖాళీ చేయాల్సి వచ్చింది. వారిలో చాలా మంది వేధింపులు, బెదిరింపులకు గురయ్యారు. 2009 నుండి బంగ్లాదేశ్‌తో మన సంబంధాలను అవామీ లీగ్, షేక్ హసీనాలకు పరిమితం చేస్తూ రావడంతో నేడు దౌత్యపరమైన సవాళ్ళను ఎదుర్కొంటున్నాము. మాజీ ప్రధాని, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధినేత్రి బేగం ఖలీదా జియాతో ఢిల్లీకి దాదాపు సంబంధాలు లేవు. ఢాకాలో ఓ బలమైన అధికార కేంద్రంగా ఉన్న ఇస్లామిక్ మితవాద సంస్థగా భావించే జమియాత్ -ఇ- ఇస్లామీతో అసలు సంబంధంలేదు. షేక్ హసీనా సైతం తన రాజకీయ మనుగడకు కొన్ని సమయాలలో జామియాత్ తో చేతులు కలపాల్సి వస్తే, ఖలీదా ఇంకా సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు.

బంగ్లాదేశ్ ప్రభుత్వంతో కాకుండా అధికార పార్టీ, దాని అధినేత్రితో స్నేహానికి దౌత్యం పరిమితం కావడంతో ఇప్పుడు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మయన్మార్‌లో సైతం అటువంటి పొరపాటే చేశాం. బంగ్లాదేశ్‌ను ఆర్ధికంగా అభివృద్ధి చేయడంతో పాటు భారత్‌తో బలమైన సంబంధాలను మెరుగుపరచుకోవడంతో హసీనా ప్రభుత్వం భారత్‌కు భారీ ఉపశమనం కలిగించింది. చైనా, పాకిస్తాన్, మయన్మార్ సరిహద్దులపై దృష్టి సారిస్తూ 4,000 కిమీకు పైగా గల బంగ్లాదేశ్ సరిహద్దు గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేకుండాపోయింది. పైగా, హసీనా అందించిన మద్దతు కారణంగా ఈశాన్య రాష్ట్రాలలో వేర్పాటువాద, తీవ్రవాద సంస్థలను కట్టడి చేయగలిగాము. బంగ్లాదేశ్ కేంద్రంగా భారత్‌లో తీవ్రవాద, ఉగ్రవాద, అక్రమ రవాణా, నకిలీ నోట్ల రవాణా వంటి కార్యకలాపాలు సాగిస్తున్న వారిని చాలా వరకు కట్టడి చేయగలిగాము. అయితే, ఇప్పుడు కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం భారత్ పట్ల సానుకూలంగా ఉండే అవకాశం లేదు. పైగా, చైనా, పాకిస్తాన్ ప్రభావంతో భారత్‌ను ‘వ్యతిరేక’ దేశంగా పరిగణించే అవకాశం ఉంది.

తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా పదవీ బాధ్యతలు చేపట్టడానికి ముందే ‘బంగ్లాదేశ్‌లో హింస తన అంతర్గత వ్యవహారమని భారత దేశం చెప్పినప్పుడు బాధపడ్డాను’ అంటూ పేర్కొన్న ముహమ్మద్ యూనుస్ భారత్ పట్ల ఏవిధంగా వ్యవహరించగలరో ఊహించడం కష్టం కాబోదు. షేక్ హసీనాకు ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అయిన మాజీ ప్రధాని ఖలీదా ‘అవామీ లీగ్ పాలనలో భారతదేశంతో కుదుర్చుకున్న అన్ని ఒప్పందాలు పరిశీలన, సమీక్షకు లోబడి ఉంటాయి’అని బహిరంగంగా చెప్పడంతో రెండు దేశాల మధ్య సంబంధాలకు ప్రమాద ఘడియలు స్పష్టం చేస్తున్నాయి.
ఇటీవల మోడీ- హసీనా ప్రకటించిన పలు కనెక్టివిటీ ప్రాజెక్ట్‌ల భవిష్యత్తును ప్రశ్నార్ధకం కానుంది. ఈ ప్రాజెక్ట్‌లను కొత్త ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేయనప్పటికీ వాటి అమలు మందగించే అవకాశం ఉంది. అదానీ గ్రూప్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం వంటి కొన్ని కీలకమైన భారతీయ ప్రైవేట్ సంస్థలతో కుదిరిన ఒప్పందాలు సైతం గట్టి ఎదురుగాలిని ఎదుర్కోవచ్చు.

ఈ సంక్షోభం నుండి భారత దేశం తీసుకోగల ఒక పాఠం ఏమిటంటే విదేశాంగ విధానం వ్యక్తులు, కౌగలింతలు, భారీ ప్రచారాలకు పరిమితం కాకుండా రెండు దేశాల ప్రజల విశ్వాసం పొందే విధంగా ప్రయత్నం జరగాలనే అంశాన్ని స్పష్టం చేస్తుంది. అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ పట్ల మితిమీరిన స్నేహం ప్రదర్శించడం సైతం రెండు దేశాల మధ్య అనేక సమస్యలు కలిగించింది. వ్యక్తి కేంద్రంగా జరిగే దౌత్యసంబంధాలు ఇంగ్లాండ్, జర్మనీ వంటి దేశాలతో కూడా సమస్యలు కల్పించనున్నాయి. తాత్కాలిక దేశాధినేత యూనస్‌ను అభినందిస్తూ ప్రధాని మోడీ చేసిన ప్రకటనలో సైతం ఆ దేశంలోని మైనారిటీలు, ముఖ్యంగా హిందువుల రక్షణ పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశం హసీనా ప్రభుత్వంలో సైతం కొనసాగింది. ఆమె ఒక వంక భారత దేశంతో స్నేహితంగా ఉంటున్నా అక్కడ తన మనుగడ కోసం మితవాద సంస్థలతో ఉదారంగా వ్యవహరిస్తూ వచ్చారు. హసీనా అనుసరించిన భారత్ అనుకూల విధానాలు కారణంగా భారత్ ఆర్ధికంగా సైతం ఎన్నో ప్రయోజనాలు పొందింది. బంగ్లాదేశ్‌తో కొన్నేళ్లుగా జరుపుకొంటున్న ట్రాన్సిట్, ట్రాన్స్‌షిప్‌మెంట్ ఒప్పందాలు భారతదేశానికి ఒక వరంలా వచ్చాయి.

ఇది ఇప్పుడు బంగ్లాదేశ్ అంతటా రైలు, రహదారి, జలమార్గాల ద్వారా ప్రధాన భూభాగం నుండి ఈశాన్యానికి సరుకులను రవాణా చేసేందుకు అవకాశం ఏర్పడింది. ఈ ఒప్పందాలు జరిగే వరకు, ఈశాన్యానికి భారతదేశానికి ఏకైక లింక్ పశ్చిమ బెంగాల్‌కు ఉత్తరాన ఉన్న సిలిగురి కారిడార్ గుండా ఉంది. దీనిని చికెన్ నెక్ అని కూడా పిలుస్తారు. అతి సన్నగా, కారిడార్ కేవలం 22 కి.మీ వెడల్పు మాత్రమే ఉంది. ఈ ఒప్పందాలు బంగ్లాదేశ్ ఆర్థికాభివృద్ధికి సైతం ఎంతగానో తోడ్పడ్డాయి. బంగ్లాదేశ్‌కు చైనా తర్వాత భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కావడం గమనార్హం. బంగ్లాదేశ్‌లో పరిస్థితులు ఇప్పట్లో సాధారణ స్థితికి చేరుకునే అవకాశాలు కనిపించడంలేదు. లక్షిత దాడులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. హింసకు దిగుతున్నవారిని కట్టడి చేయడం పట్ల సైన్యం ఆసక్తి కనబరచడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో భారత్ ఏ విధంగా ఆ దేశంతో వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది. బంగ్లాదేశ్‌లో దాడులకు భయపడి అనేక మంది భారత్‌లో ఆశ్రయం కోసం వలస వచ్చే అవకాశం ఉంది.

హసీనా హయాంలో అణచివేయబడిన అతివాద, వేర్పాటువాద శక్తులు ఇప్పుడు తిరిగి బలం పుంజుకొని అవకాశం ఉంది. దానితో ఈశాన్య రాష్ట్రాల్లో మరోసారి హింసాయుత దాడులు పెరిగే అవకాశం ఏర్పడుతుంది. పూర్తిగా సరిహద్దు వెంబడి కంచె కూడా లేకపోవడంతో బంగ్లా సరిహద్దు రక్షణ మరో సమస్యగా మారుతుంది. హసీనాను గద్దెదించడం వెనుక విదేశీ హస్తం గురించి కథనాలు వస్తున్నాయి. అందుకు బలమైన తార్కాణాలు కనిపిస్తున్నప్పటికీ అటువంటి అవకాశం కల్పించింది ఆమెయే కావడం గమనార్హం. ఆమె భారత్‌తో స్నేహంగా ఉంటున్నప్పటికీ తీవ్రమైన అణచివేత విధానాలు అవలంబించడం, ప్రతిపక్షాలు, మీడియా, పౌర సమాజం పట్ల దారుణమైన వేధింపులకు పాల్పడుతూ ఉండడంతో ప్రజలలో ఏర్పడిన తీవ్రమైన ఆగ్రవేశాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి.

ఇటువంటి సమయంలో ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, ప్రజాస్వామ్యానికి మాతృకగా చెప్పుకునే దేశంగా భారత్ తన అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తపరిచే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. ఆమె అనుసరించిన నిరంకుశ, అవినీతి విధానాలకు తోడుగా కరోనా అనంతరం ఇంకా ఆర్ధిక వ్యవస్థ కోలుకోకపోవడంతో ప్రజలలో అసంతృత్తి పన్నురేట్లు పెరిగేందుకు దారితీసింది. దానితో హసీనా సాగించిన అణచివేతకు భారత్ అండదండలు ఉన్నట్లు భావిస్తున్నారు. పైగా 1971 యుద్ధం ద్వారా తమ దేశాన్ని రెండుగా చీల్చిన భారత్ పట్ల పాకిస్థాన్‌లో ఇప్పటికీ ప్రతీకారభావం వ్యక్తం అవుతున్నది. బంగ్లాదేశ్‌లో పాకిస్తాన్‌కు అనుకూలమైన శక్తులు అనేకం ఉన్నాయి. వారంతా కూడా భారత్‌ను తమకు వ్యతిరేక దేశంగానే చూస్తున్నారు. బంగ్లాదేశ్ ఎన్నికల సమయంలో, ఇతరత్రా ఆందోళనలో ‘భారత్ వస్తువులు బహిష్కరించండి’ అనే నినాదాలు వినిపిస్తుండటం గమనార్హం.

చలసాని నరేంద్ర
9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News