Wednesday, January 22, 2025

బెంగాల్‌లో హింస.. 8మంది సజీవ దహనం

- Advertisement -
- Advertisement -

Violence in Bengal: 8 people burnt alive

ఇళ్లకు తాళాలు వేసి నిప్పు పెట్టిన దుండగులు
టిఎంసి నేత హత్యతో ప్రతీకార చర్య
ఘటనపై దర్యాప్తుకు ప్రత్యేక సిట్ ఏర్పాటు
72 గంటల్లో నివేదికకు కేంద్ర హోం శాఖ ఆదేశం

రాంపూర్‌హట్/ కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఓ రాజకీయ నాయకుడి హత్యతో చెలరేగిన హింసాకాండలో 8 మంది సజీవ దహనమయ్యారు. హత్యకు నిరసనగా ఆందోళనలకు దిగిన కొందరు ఇళ్లకు నిప్పంటించడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..బీర్భుమ్ జిల్లా రాంపూర్ హట్ ప్రాంతంలో తృణమూల్ కాంగ్రెస్ పంచాయతీ నాయకుడు భదు షేక్ సోమవారం రాత్రి హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై నాటు బాంబులు విసరడంతో తీవ్రంగా గాయపడిన ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే ఈ ఘటన జరిగిన కొన్ని గంటల అనంతరం మంగళవారం తెల్లవారుజామున రాంపూర్‌హట్ ప్రాంతంలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మనుషులను లోపల పెట్టి ఇళ్లకు తాళాలు వేసి నిప్పంటించినట్లు స్థానికులు చెబుతున్నారు.10-12 ఇళ్లకు మంటలు అంటుకున్నాయి. సమాచారమందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో 8 మంది మంటల్లో చిక్కుకుని మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

భదుషేక్ హత్యకు ప్రతీకారంగానే ఈ అల్లర్లు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయంగా దుమారానికి దారి తీసింది. అసెంబ్లీలో ప్రతిపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తుతూ ప్రభుత్వంపై మండిపడ్డాయి. అయితే ఈ అల్లర్ల వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదని, ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి 11 మందిని అరెస్టు చేశామని, రాంపూర్‌హట్ పోలీసు స్టేషన్ ఎస్‌డిపిఓ, ఇన్‌చార్జిని పోలీసు విధులనుంచి తప్పించినట్లు డిజిపి మనోజ్ మాలవీయ కోల్‌కతాలో చెప్పారు. మరోవైపు ఈ కేసులో దర్యాప్తు చేపట్టేందుకు బెంగాల్ ప్రభుత్వం సిఐడి అదనపు డిజి జ్ఞాన్‌వంత్ సింగ్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకోవడం కోసం అధికార తృణమూల్ కాంగ్రెస్ మంత్రి ఫిర్హాద్ హకీమ్ నేతృత్వంలో ముగ్గురు ఎంఎల బృందాన్ని సంఘటనా స్థలానికి పంపించింది. కాగా ఈ ఘటనపై 72 గంటల్లో నివేదిక సమర్పించాల్సిందిగా కేంద్ర హోం శాఖ రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News