Tuesday, November 5, 2024

మణిపూర్ మంటలు

- Advertisement -
- Advertisement -

డబులింజిన్ ప్రభుత్వం వల్ల ప్రజలు సుఖశాంతులతో తులతూగుతారని బిజెపి తరచూ ఊదరగొడుతుంటుంది. అందుచేత తమకు మాత్రమే ఓటు వేసి తరించాలని ఎన్నికల ప్రచార సభల్లో హితబోధ చేస్తుంది. బిజెపి పాలనలోని ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో ఈ డబులింజిన్ వైభవం ఏమైందో, ఎందుకు గల్లంతైందో అర్థం కాదు. అక్కడ అనూహ్య స్థాయిలో వైషమ్యాలు చెలరేగి మంటలు మండిస్తున్నాయి. ఆ మంట ల్లో ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు, విద్యాలయాలు, ఆసుపత్రులు అన్ని అగ్నికి ఆహుతవుతున్నాయి. జ్వాలలు ఆకాశాన్నంటుతున్నాయి.

ఈ హింసాకాండలో ఇప్పటి వరకు 54 మంది బలయ్యారు. చిరకాలంగా వున్న ఒక సమస్యను రెండు వైపుల వారిని ఒక చోట కూచోబెట్టి సామరస్య మార్గంలో పరిష్కరించకపోడం వల్లనే ఆ రాష్ట్రం ఇప్పుడు లంకా దహన దృశ్యాలతో అట్టుడికినట్టు ఉడికిపోతున్నది. వేలాది మంది నిర్వాసితులయ్యారు. రాజధాని ఇంఫాల్‌లో కూడా హింస చెలరేగింది. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఇచ్చారంటే పరిస్థితి ఎంతగా దిగజారిందో ఊహించవచ్చు. పరిస్థితి చక్కబడడానికి ఎంత కాలం పడుతుందో చెప్పలేము. వందలాది మంది రాష్ట్ర సరిహద్దులు దాటి అసోంలోని ఖచార్ జిల్లాలో తలదాచుకొంటున్నారని తెలుస్తున్నది. అక్కడ చిక్కుకొన్న తెలంగాణ విద్యార్థులను మన రాష్ట్ర ప్రభుత్వం హుటాహుటిన విమానాల్లో రప్పిస్తున్నట్టు సమాచారం.

మణిపూర్‌లో హింస ప్రజ్వరిల్లిన ప్రాంతాలను కేంద్రం తన అదుపులోకి తీసుకొన్నదని తాజా వార్తలు చెబుతున్నాయి. అందుకోసం రాజ్యాంగంలోని 355వ అధికరణను ప్రయోగించినట్టు తెలుస్తున్నది. ఆ రాష్ట్రం వున్నట్టుండి ఇలా భగ్గుమనడానికి కారణం కొండల్లో నివసిస్తున్న కుకీలు, నాగాలకు మైదాన ప్రాంతంలోని మెయితీలకు మధ్య చిరకాలంగా వున్న వివాదమేనని స్పష్టపడుతున్నది. 32 లక్షల మంది జనాభా గల మణిపూర్‌లో 34 గుర్తింపు పొందిన తెగలున్నాయి. అవి ఎక్కువగా నాగా, కుకీ తెగలకు చెందినవే. నాగా తెగలన్నీ కలిసి రాష్ట్ర జనాభాలో 24% కాగా, కుకీలు 16 శాతం. మెయితీ లు రాష్ట్ర జనాభాలో 53 శాతం. చుట్టూ వున్న కొండ ప్రాంతాల్లో నాగాలు, కుకీలు నివాసముంటారు. మధ్యలో గల మైదాన ప్రాంతంలో మెయితీలు నివసిస్తున్నారు. మెయితీల్లో మెజారిటీ హిందువులు కాగా, నాగా, కుకీల్లో అత్యధికులు క్రైస్తవులు. మణిపూర్‌లోని అన్ని రాజకీయ పార్టీల్లో మెయితీలదే పైచేయిగా వుంటుంది. ఇది కొండల్లో నివసించే నాగాలకు, కుకీలకు అసహన కారణం కావడం సహజమే.

ఈ రెండు వర్గాలు సహజంగానే ఎస్‌టిలుగా గుర్తింపు పొంది వున్నారు. మెయితీలు కూడా ఎస్‌టి గుర్తింపు కోసం చిరకాలంగా డిమాండ్ చేస్తున్నారు. వారికి ఇప్పటికే ఎస్‌సి, బిసి వర్గాలుగా గుర్తింపు వుంది. నాగాలు, కుకీలకు కూడా అధికారాన్ని అనుభవించిన చరిత్ర వుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి రిషాంగ్ కీషింగ్ నాగాలకు చెందిన వాడే. తమలో చాలా మంది పేదరికంలో మగ్గుతున్నారని, ఎస్‌టి గుర్తింపు లేకపోడం తమను ఎల్లప్పుడు వెనుకబాటుతనంలోనే మగ్గిస్తుందని మెయితీలు వాదిస్తారు. 18వ శతాబ్దంలో తాము హిందువులుగా మారడానికి ముందు ముఖ్యంగా వైష్ణవ మతం పుచ్చుకోడానికి ముందు తమది గిరిజన నేపథ్యమేనని వారు చెబుతున్నారు. ఎస్‌టిలుగా గుర్తింపు పొందడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కువ వాటా పొందాలన్నది వారి ఆరాటం. అయితే మణిపూర్‌లో మెయితీలు రాజకీయ, ఆర్థిక ఆధిపత్యాన్ని కలిగి వున్నారని, వారికి ఎస్‌టి హోదాతో ఏమి పని అని నాగాలు, కుకీలు ప్రశ్నిస్తున్నారు.ఈ నేపథ్యంలో మెయితీలను ఎస్‌టిలలో చేర్చే విషయాన్ని సానుకూలంగా పరిశీలించవలసిందిగా మార్చి 27న మణిపూర్ హైకోర్టు ఒక ఉత్తర్వు జారీ చేసింది.

అప్పటికే ప్రభుత్వ యంత్రాంగం చర్యల వల్ల నాగాలు, కుకీలు తీవ్ర అసంతృప్తి చెంది వున్నారు. మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న శక్తులను పట్టుకోడానికని, గంజాయి క్షేత్రాలను ధ్వంసం చేయడానికని ఏప్రిల్ మాసారంభంలో ప్రభుత్వం కొండ ప్రాంతాలపై విరుచుకుపడడం నాగాల్లో, కుకీల్లో ఆగ్రహాన్ని రగిలించింది. అందులోనూ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ మెయితీలకు చెందిన వాడు కావడం అగ్గి మీద ఆజ్యం పోసినట్టు అయింది. రిజర్వేషన్ల విషయంలో ఇంచుమిం చు ఇటువంటి పరిస్థితులున్న రాష్ట్రాలు దేశంలో మరి కొన్ని వున్నాయి. నివాసార్హం కాని కొండ వాలుల్లో, ఎత్తుల్లో చిరకాలంగా నివసిస్తున్న ఆదివాసీలు మైదాన ప్రాంతాల్లోని వారికి కూడా ఎస్‌టి కోటాను పంచి ఇవ్వడం పట్ల అసంతృప్తిగా వున్నారు. ప్రభుత్వాలు విజ్ఞతతో, చాకచక్యంతో ఇటువంటి వర్గాల మధ్య సామరస్యాన్ని సాధించవలసి వుంది. మణిపూర్ అసెంబ్లీలోని 60 స్థానాలలో 40 స్థానాలను మెయితీలకు కేటాయించారు. జనాభాలో ఆధిక్యత కారణంగా అది అనివార్యమై వుండవచ్చు. కాని అవతలి వర్గాలను కూడా కలుపుకొని పోవాలంటే అందులోని సహేతుకతను వారికి చెప్పి ఒప్పించాలి. సమర్థవంతమైన నాయకత్వం వల్లనే అది సాధ్యమవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News